జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయ్
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:35 AM
రాజశేఖర్‌రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన..
విజయలక్ష్మి లేఖ పూర్తి పాఠం
రాజశేఖర్‌రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన..
ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధేస్తోంది. ఇంటి గుట్టు.. వ్యాధి రట్టు. తెరిచిన పుస్తకం అని రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ అనేవారు. రాజశేఖర్‌రెడ్డి గారు, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్లం. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. జరగకూడనివన్నీ నా కళ్లముందే జరిగిపోతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. అబద్ధాల పరంపర కొనసాగుతోంది. తెలిసి కొంత.. తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు. అవి దావానలంగా ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఇవి కంటిన్యూ కాకూడదు. నా పిల్లలిద్దరికే కాదు.. చెప్పాలంటే ఇది రాష్ర్టానికి కూడా మంచిది కాదు. నేను మీ ముందుకు ఈ విషయంగా రాకూడదని అనుకున్నాను. అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నా.. ఈ కుటుంబాన్ని ప్రేమించినవారు మీరు. మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. రాజశేఖర్‌రెడ్డి గారికి మేమెంతో.. మీరు కూడా అంతే. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో.. మిమ్మల్నీ అంతగానే ప్రేమించారు. మీరు కూడా అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు. అంతెందుకు.. రాజశేఖర్‌రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయాక నా పిల్లలను.. ఆయన ఉన్నప్పటి కంటే ఎక్కువగా ప్రేమించి, ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అది ఎన్నటికీ మరిచిపోలేను. నా జన్మంతా రుణపడి ఉంటూ.. హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఇతరులు అందరూ.. వాళ్లు మాట్లాడుతున్నది.. వాళ్లు ప్రేమించే వైఎ్‌సఆర్ గారి గురించి అని మరచి.. తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అనే స్పృహ లేకుండా.. ఎన్నో అసత్యాలు చెప్పారు. వైఎ్‌సఆర్ గారు బ్రతికి ఉండగానే ఆస్తులు పంచేశారని అన్నారు. ఇది అవాస్తవం. వైఎ్‌సఆర్ గారు కొన్ని ఆస్తులు పాప పేరు మీద.. కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. వైఎ్‌సఆర్ గారు బ్రతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారని లిస్ట్ చదివారు. జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ కూడా చదివి ఉండాల్సింది. వైఎ్‌సఆర్ గారు చేసింది పంపకం కాదు. కొన్ని ఆస్తులు ఇద్దరి పేరు మీద పెట్టారు.. అంతే.
రాజశేఖర్‌రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయాక.. 2009 నుంచి 19 వరకు 10 ఏళ్లు కలిసి ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకుని, రూ.200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. ఎంవోయూ ప్రకారం జగన్‌కు 60 శాతం.. పాపకు 40 శాతం అయితే.. ఎంవోయూకు ముందు.. సగం సగం డివిడెండ్ తీసుకునేవారు.. ఎందుకంటే పాపకు సమాన వాటా ఉంది కాబట్టి. వీటన్నింటికీ అప్పుడు, ఇప్పుడు నేనే సాక్షిని.
2019లో సీఎం అయిన రెండు నెలలకు.. డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్‌లో జగన్ ప్రపోజల్. ‘పిల్లలు పెద్ద వాళ్లయ్యారు.. నాకు అల్లుళ్లు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్లు వాళ్లు కలిసి ఉండకపోవచ్చు.. కాబట్టి విడిపోదాం’ అన్నాడు. అలా 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం.. ఆస్తులపరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది. తర్వాత విజయవాడలో నా సమక్షంలో.. ఆస్తుల్లో ఇవి జగన్‌కు, ఇవి పాపకు అని అనుకున్నారు. జగన్ నోటితో చెప్పి.. ఆయన చేతితో రాసిన ఎంవోయూనే ఇది. హక్కు ఉంది కాబట్టే పాపకు 200 కోట్లు డివిడెండ్ ఇచ్చారు. ఎంవోయూ రాసుకున్నారు. పాపకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్‌గా ఇస్తున్నవి కాదు. జగన్ బాధ్యతగా ఇస్తున్నవి. అటాచ్మెంట్లో లేవు కాబట్టి ఎంవోయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, ఎంవోయూలో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం పాపకు వెంటనే ఇస్తానని జగన్ మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవీ ఇవ్వకుండా అటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలోనూ అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎ్‌సఆర్ గారి ఇల్లు.. ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది. 2019 వరకు కలిసి ఉన్నాం. షర్మిలను బిజినె్‌సలో ఇన్వాల్వ్ చేయలేదు. అయినా పాలిటిక్స్‌లో జగన్ చెప్పినట్లు చేసింది. జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. అధికారంలో రావడానికి పాప కృషి ఎంతో ఉంది.
జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే.. చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడడం నా విధి, నా ధర్మం. ఇంత మంది పెద్ద మనుషులు చెబుతున్న అబద్ధాల మధ్య నిజం తెలియాలనే ఇన్ని చెప్పాల్సి వచ్చింది. అయినా వాళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లు. ఇది వారి సమస్య. వారే పరిష్కరించుకుంటారు.
మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులూ ఎత్తి మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా. సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు. దూషణలు చేయవద్దు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు. ఆజూౌౌఛీ జీట ్టజిజీఛిజ్ఛుట ్టజ్చిుఽ ఠ్చ్ట్ఛీట. వాళ్లిద్దరూ సమాధానపడతారు. మీరెవరూ రెచ్చగొట్టవద్దని నా మనవి. నేను నమ్మిన దేవుడు యేసయ్య.. సమాధానకర్త. నా బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని నా నమ్మకం.
విజయసాయిరెడ్డి గారు ఆడిటర్‌గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. వైవీ సుబ్బారెడ్డి గారు ఈ ఇంటి బంధువుగా ఎంవోయూపై సాక్షి సంతకం చేశారు. అయినా.. మీడియాలో అవాస్తవాలు మాట్లాడడం నాకు చాలా బాధ కలిగించింది. అబద్థాల పరంపర కొనసాగకుండా ఉండడానికి సూటిగా నిజం చెబుతున్నాను. వీరిద్దరూ నా పిల్లలు. వీరిని నేను, వైఎ్‌సఆర్ గారు ఎంతో అపురూపంగా, ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరూ సమానమే. అలాగే రాజశేఖర్‌రెడ్డి గారి మాటా సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎ్‌సఆర్ గారి ఆజ్ఞ నిజం. ఆస్తులు వృద్థిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులూ కుటుంబ ఆస్తులే అన్నది కూడా నిజం. జగన్ బాధ్యత గల కొడుకుగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలన్నది కూడా నిజం. వైఎ్‌సఆర్ గారి చివరి రోజుల్లో జగన్ ఆయనకు.. ‘నాన్నా.. నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరే వారిలో నేను మొదటివాడిని’ అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది ‘నాలో నాతో వైఎ్‌సఆర్’ అనే పుస్తకంలో ఎప్పుడో రాశా. రాజశేఖర్‌రెడ్డి గారు బ్రతికి ఉండగా ఆస్తులు పంచలేదు. ఇక పంచుదాం అనుకునే సరికి ఆయన ప్రమాదంలో వెళ్లిపోయారు. ఈ విషయం సాయిరెడ్డికి తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారు.
రాజశేఖర్‌రెడ్డి గారు ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు. ఇంతటి వివాదం జరిగేది కాదు. నేనూ ఇలా రావాల్సిన అవసరం పడేది కాదు. అయినా దీని విషయంగా జరుగుతున్న రచ్చను చూసి.. నా మాటలు మాత్రమే ఆపుతాయని విశ్వసిస్తూ.. నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని.. మీ ముందుకు రావాల్సి వచ్చింది.
మరొక్కసారి మీ ఆడబిడ్డగా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని ప్రతి ఒక్కరినీ కోరుకుంటూ..
- ఇట్లు ప్రేమతో
వైఎస్ విజయ రాజశేఖర్‌రెడ్డి.
Updated Date - Oct 30 , 2024 | 05:35 AM