Ganta Srinivasa Rao: ఓట్ల రాజకీయం మొదలుపెట్టారు.. జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి గంటా ఫైర్
ABN, Publish Date - Jan 31 , 2024 | 08:50 PM
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విటర్ మాధ్యమంగా జగన్ సర్కార్ వైఖరిపై తారాస్థాయిలో మండిపడ్డారు. మరో రెండు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉండగా.. ఇప్పుడు వైసీపీ వాళ్లు టెట్, డీఎస్సీ అంటూ ఓట్ల రాజకీయం మొదలుపెట్టారని నిప్పులు చెరిగారు. గత ఐదేళ్లుగా డీఎస్సీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూశారని..
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విటర్ మాధ్యమంగా జగన్ సర్కార్ వైఖరిపై తారాస్థాయిలో మండిపడ్డారు. మరో రెండు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉండగా.. ఇప్పుడు వైసీపీ వాళ్లు టెట్, డీఎస్సీ అంటూ ఓట్ల రాజకీయం మొదలుపెట్టారని నిప్పులు చెరిగారు. గత ఐదేళ్లుగా డీఎస్సీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూశారని, ఇప్పుడు కేవలం 6,100 పోస్టులకు కేబినెట్ ఆమోద ముద్ర అంటూ కొత్త ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ఫేక్ నోటిఫికేషన్ అని, నిరుద్యోగులెవ్వరూ దీనిని నమ్మరని ఉద్ఘాటించారు. ఈ అరాచక జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఏపీ నిరుద్యోగులు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. రానున్నది చంద్రన్న రాజ్యమని.. భవిష్యత్తు మనదేనని భరోసా కల్పించారు. రాష్ట్రంలో మిగిలున్న పోస్టులన్నింటినీ భర్తీ చేసి, మీ ఉద్యోగాలను మీకిచ్చే బాధ్యత చంద్రన్నదేనని హామీ ఇచ్చారు.
అంతకుముందు కూడా.. భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ తనని తాను అర్జునుడిగా అభివర్ణించడంపై కూడా గంటా శ్రీనివాసరావు వ్యంగ్యంగా స్పందించారు. ‘‘నీకున్న అజ్ఞానానికి పురాణ పురుషుల గురించి మాట్లాడడం ఎందుకులే’’ అంటూ జగన్‌ని ఎత్తిపొడిచారు. అర్జునుడు అంటే నీలాగా రాక్షసుడు కాదని, ఆయన ధర్మం వైపు నిలబడి యుద్ధం చేసినవాడని, ధర్మాన్ని గెలిపించవాడని చురకలంటించారు. గత ఎన్నికల సమయంలో నవ రత్నాలతో కలిపి 730 హామీలిచ్చిన జగన్.. అందులో కేవలం 15 శాతం హామీలు మాత్రమే అమలు చేశారని వివరించారు. జగన్ ఎప్పుడూ తాము పాండవులమని అంటుంటారని.. నిజానికి వాళ్లు కౌరవులని దుయ్యబట్టారు. జగన్ పాలనంతా విధ్వంసం, ప్రత్యర్ధుల అణిచివేత కోసం కొనసాగాయని విమర్శించారు. వైసీపీ అంటే నకిలీ పార్టీ అని.. వైనాట్ 175 అని చెప్పే జగన్ ఈసారి పులివెందులలో కూడా ఓడిపోతారని జోస్యం చెప్పారు. 100 అడుగులు పాతాళంలోకి వైసీపీని పాతి పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
Updated Date - Jan 31 , 2024 | 08:50 PM