Kesineni Chinni: కేశినేని నాని పోస్టుతో నాకు సంబంధం లేదు
ABN, Publish Date - Jan 05 , 2024 | 12:12 PM
సోషల్ మీడియాలో వచ్చిన ఎంపీ కేశినేని నాని ట్వీట్‌కు.. తనకు ఎటువంటి సంబంధం లేదని కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. తమ దృష్టంతా తిరువూరు సభను విజయవంతం చేయడమే మీదే ఉందన్నారు. పార్టీలో తానొక సామాన్య కార్యకర్తనేనన్నారు.
విజయవాడ: సోషల్ మీడియాలో వచ్చిన ఎంపీ కేశినేని నాని ట్వీట్‌కు.. తనకు ఎటువంటి సంబంధం లేదని కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. తమ దృష్టంతా తిరువూరు సభను విజయవంతం చేయడం మీదే ఉందన్నారు. పార్టీలో తానొక సామాన్య కార్యకర్తనేనన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే తన ధ్యేయమని చిన్ని పేర్కొన్నారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న కలహాలు వస్తాయని.. తిరువూరులో జరిగిన ఘటన కూడా అటువంటిదేనన్నారు. ఇతర పార్టీలో జరుగుతున్న విభేదాలు.. గొడవలు కంటే తమ పార్టీలో వచ్చినవి చాలా చిన్నవని వ్యాఖ్యానించారు. తిరువూరు సభకు లక్ష మంది పైగా ప్రజలు వస్తారని దీమా వ్యక్తం చేశారు.
కాగా ఫేస్‌బుక్ వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి చెప్పారని వివరించారు. తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని ప్రస్తావించారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. అధినేత ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తానని వివరించారు. తిరువూరు సభ విషయంలో బుధవారం నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గాల మధ్య వివాదం చెలరేగింది. తిరువూరు ఇన్‌చార్జి దేవదత్‌ను నాని పూజకు పనికి రాని పువ్వు అని దూషించడంపై టీడీపీ దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jan 05 , 2024 | 12:29 PM