Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ABN, Publish Date - Aug 13 , 2024 | 07:44 AM
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో మంగళవారం నాడు తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాంక్యుమెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో మంగళవారం నాడు తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాంక్యుమెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చాలామంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం.
జోగి రమేష్ అవినీతికి పాల్పడినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రధానంగా ఇసుకతో పాటు పలు భూ అక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇటీవల ఆయనపై వరుసగా మీడియాలో కథనాలు వచ్చాయి. అధికారులను బెదిరించి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారాల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంత్రి హోదాలో జోగి రమేష్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఏవిధంగా ప్రభుత్వ నిబంధనలకు కాదని కాంట్రాక్ట్‌లు అప్పగించారనే కీలక విషయాలపై ఏసీబీ అధికారులు అరా తీశారు. ఇప్పటికే కీలకమైన డాంక్యుమెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
సీఐడీ భూముల స్వాధీనం..
అయితే, గతంలో జోగి రమేశ్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములను చెరబట్టింది. సీఐడీ స్వాధీనంలో ఉన్న భూములను దర్జాగా కబ్జా చేసి అప్పనంగా రూ.5కోట్ల పైచిలుకు సొమ్ము చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో ఆర్‌ఎస్ నం.69/2, రీసర్వే నం.87లో అగ్రిగోల్డ్‌కు చెందిన సుమారు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది. దీన్ని ఏపీ సీఐడీ స్వాధీనం చేసుకుంది. అగ్రి గోల్డ్ భూములు వివాదంలో ఉండటాన్ని సాకుగా తీసుకున్న జోగి కుటుంబం ఈ భూములపై కన్నేసింది. జోగి రమేశ్ బాబాయ్ అయిన జోగి వెంకటేశ్వరావు, జోగి తనయుడు జోగి రాజీవ్ కలసి చెరో 1,086, 1,074 గజాలను తమ పేరుతో రాయించుకున్నారు. ఈ విషయంలో జోగి కుటుంబం తమ చేతికి మట్టి అంటకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది.
అంబాపురంలో ఆర్‌ఎస్ నం.88లో పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు తమకు ఉన్న భూమిలో 4 ఎకరాలను బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించారు. ఆయన ఎకరా భూమిని పోలవరపు మురళీమోహన్‌కు అమ్మారు. ఆయన మహాలక్ష్మీ ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్టెమెంట్స్‌కు చెందిన అడుసుమిల్లి మోహన రామదాసుకు 3,800 గజాలు విక్రయించారు. ఈ మోహన రామదాసు నుంచి 2022లో జోగి వెంటేశ్వరరావు, జోగి రాజీవ్‌లు 2,160 గజాలు కొనుగోలు చేసి వెంటనే 200 గజాలు ప్లాట్లుగా వేసి ఏడుగురు వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
భూముల విక్రయం
ఇక్కడే జోగి కుటుంబం తెలివితేటలు ఉపయోగించింది. సర్వే నం.88లో కొనుగోలు చేసినట్లుగా చూపిన భూమి దస్తావేజుల్లో తప్పు దొర్లిందని పేర్కొంటూ 2023లో స్వీయ సవరణ చేయించారు. ఆ సమయంలో అగ్రి గోల్డ్ భూములున్న సర్వే నం.87ను అసలుదిగా పేర్కొన్నారు. అంటే సర్వే నం.87లోని భూమి కొనుగోలు అంతా ఉత్తుత్తి డ్రామా అని వీరి ఎత్తుగడ అగ్రి గోల్డ్ భూమిని కాజేయడమేనని అర్థమవుతోంది. వీరు కొనుగోలుదారులకు విక్రయించినది కూడా అగ్రి గోల్డ్‌కు చెందిన భూమి కావడం గమనార్హం. అసలు విషయం తెలియక కొనుగోలుదారులు సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూమిని కొనుగోలు చేసి మునిగిపోయారు. విక్రయించగా మిగిలిన 800గజాల్లో జోగి కుటుంబం ప్రహరీ నిర్మించుకునే ప్రయత్నంలో ఉండగా అగ్రి గోల్డ్‌కు చెందిన అవ్వా వెంకట శేషు నారాయణరావు విజయవాడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఫిర్యాదు అనంతరం విజయవాడ రూరల్ తహసీల్దార్ నివేదిక మేరకు వివాదాస్పద అగ్రిగోల్డ్ భూములను జోగి కుటుంబం విక్రయించినట్లు స్పష్టమవుతోంది.
Updated Date - Aug 13 , 2024 | 08:37 AM