Andhra Pradesh: సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు.. రేపటి నుంచే విధుల్లోకి..
ABN, Publish Date - Jan 10 , 2024 | 07:51 PM
అమరావతి, జనవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి కార్మిక సంఘాలు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోల రూపంలో విడుదల చేసిన తరువాత పూర్తిగా సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.
అమరావతి, జనవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి కార్మిక సంఘాలు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోల రూపంలో విడుదల చేసిన తరువాత పూర్తిగా సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.
మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రూ. 21 వేల వేతనంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు మంత్రి. అలాగే, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 5-7 లక్షల వరకు సాయం పెంచామని తెలిపారు మంత్రి. 2019 నుంచి దరఖాస్తు చేసుకోని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకున్నా ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు మంత్రి. ఇక ఈ సంక్రాంతి పండుగకు ప్రతి కార్మికునికి రూ. 1000 కొత్త బట్టలు కొనుగోలుకు ఇస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ ఇచ్చిన హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని, అలాగే, హామీ అమలు కోసం గురువారం సాయంత్రానికి జీవో జారీ చేస్తామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.
కార్మిక సంఘాల నేతలు..
మున్సిపల్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు కార్మిక సంఘాల నేతలు. కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం స్పందించి హామీ ఇచ్చిందని తెలిపారు. రూ. 21వేలకు వేతనం పెంచాలని కోరామని, ప్రభుత్వం అందుకు అంగీకరించిందన్నారు. సమ్మె కాలంలో జీతం, కేసుల ఉపసంహరణ కు హామీ ఇచ్చారని తెలిపారు. రాజధాని ప్రాంత కార్మికులను కూడా మున్సిపల్ పరిధిలోకి తేవాలని కోరామని, ఈ అంశాన్ని పరిశీలించి చెబుతామన్నారని తెలిపారు. గురువారం నాడు మినిట్స్ కాపీ, మూడు రోజుల్లో జిఒ ఇస్తామని మంత్రి చెప్పినట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఇతర ఇంజనీరింగ్ విభాగాల సమస్యలపై తొమ్మిది మందితో కమిటీ వేస్తామని చెప్పారన్నారు. అలాగే, ఔట్ సోర్సింగ్‌లో ఉన్న సిబ్బందిని కాంట్రాక్టు పరిధిలోకి తేవాలని కోరామని, దీనిపై పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం అయితే సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నామని, జీవో వచ్చాక వాటిని పరిశీలించి తదుపరి ప్రకటన చేస్తామన్నారు కార్మిక సంఘాల నేతలు. గురువారం నుంచి మున్సిపల్ కార్మికులందరూ పనుల్లోకి వెళ్లాలని ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు జీవోలో లేకపోతే మళ్లీ సమ్మె ఆలోచన చేస్తామని హెచ్చరించారు కార్మిక సంఘాల నేతలు.
Updated Date - Jan 10 , 2024 | 07:51 PM