Pawan Kalyan: ఇప్పటి హీరో అడవిలో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు: డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 08 , 2024 | 04:28 PM
బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోల గురించి ఆసక్తికరంగా స్పందించారు.
బెంగళూరు: బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోల గురించి ఆసక్తికరంగా స్పందించారు. 40 సంవత్సరల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడే వాడని, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుతం సినిమా పరిస్థితి అని ఆయన అభివర్ణించారు.
కాగా ఇవాళ (గురువారం) బెంగళూరు నగరంలో కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వంతో వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించేందుకు పవన్ కర్ణాటక వెళ్లారు. కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ సుధీంద్ర, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం, తదితరులు ఆహ్వానం పలికారు. ఇక పర్యటనలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో కూడా పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.
పవన్ కర్ణాటక ఎందుకు వెళ్లారంటే..?
కాగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పరిధిలో, పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులు ఊళ్ల మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. అంతేకాదు ప్రాణ హాని కూడా కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమవుతాయి. కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉండడంతో కొన్ని కుంకీ ఏనుగులు ఏపీకి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖతో చర్చలు జరిపేందుకు పవన్ కర్ణాటక వెళ్లారు. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖంద్రేతో చర్చలు జరిపారు.
Updated Date - Aug 08 , 2024 | 04:46 PM