Overtake : ఆరుగురిని బలిగొన్న ‘ఓవర్‌టేక్’!
ABN, Publish Date - Jun 15 , 2024 | 03:42 AM
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జాతీయ రహదారి-216పై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఒకరు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అంబేడ్కర్
కృష్ణా జిల్లా కృత్తివెన్నులో ఘోర ప్రమాదం
ట్రాక్టర్‌ను ఢీకొని ఆగిన మినీవ్యాన్
అదే సమయంలో మినీవ్యాన్‌ను ఢీకొన్న కంటైనర్
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
మృతులు, క్షతగాత్రులు కోనసీమ, కాకినాడ జిల్లా కూలీలు
మృతుల కుటుంబాలకు రూ.ఐదేసి లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి కొల్లు
మచిలీపట్నం/కృత్తివెన్ను, జూన్ 14: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జాతీయ రహదారి-216పై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఒకరు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు ప్రాంతం నుంచి డ్రైవర్‌తో సహా పది మంది కూలీలు బంటుమిల్లి మండలం తుమ్మిడిలో చేపల ప్యాకింగ్ పట్టుబడి చేసేందుకు మినీ వ్యాన్‌లో శుక్రవారం రాత్రి 1.30 గంటలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఉదయం 4-5 గంటల మధ్య శీతనపల్లి వద్ద ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయింది. ఆ ప్రయత్నంలో ట్రాక్టర్ వెనుక వైపు ఢీకొట్టి.. అదే వేగంతో ముందుకెళ్లి రోడ్డు మధ్యలో ఆగిపోయింది. సరిగ్గా ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ.. రెప్పపాటులో మినీవ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. లారీ, వ్యాన్ ముందుభాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా ఉప్పలగుంట గ్రామానికి చెందిన పెదసింగు కనకరాజు (34), కాట్రేనికోన మండలం గద్దనపల్లికి చెందిన చింత లోవరాజు (32), మాగాపు నాగరాజు(26), కరప మండలానికి చెందిన వ్యాన్ డ్రైవర్ గాంధీ ధర్మవరప్రసాద్ (27), తమిళనాడు వేల్పూరుకు చెందిన లారీ డ్రైవర్ అయ్యప్పన్ జయరామన్(42) అక్కడికక్కడే మృతి చెందారు. ఉప్పలగుంట గ్రామానికి చెందిన రేవు భూషణం (26)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ప్రమాదంలో కాకినాడ సమీప గొర్రిపూడికి చెందిన మేడిశెట్టి మహే్‌షకుమార్, గద్ద్దనపల్లికి చెందిన చింతా దుర్గప్రసాద్, ఉప్పలగుంటకు చెందిన రేవు జ్ఞానేశ్వరరావు, ఎస్.యానాంకు చెందిన మల్లాడి శ్రీకాంత్, సంగాని నాగేంద్రబాబు గాయాలపాలై మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నాగేంద్రబాబు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రక్తమోడిన రహదారులు
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
సంగం, కోవూరు, చిత్తూరు రూరల్, జూన్ 14: నెల్లూరు, చిత్తూరుజిల్లాల్లో శుక్రవారం వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన జయమంగళం నాగరాజు నెల్లూరు జిల్లా సంగం మండలం శంకరవీరరాఘవపురంలో చేపల చెరువులను లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కైకలూరుకు వెళ్లి గర్భిణి అయిన తన కుమార్తె అనసూయను, మరో కుమార్తె ప్రశాంతి, మనుమరాలిని వెంటబెట్టుకుని శంకరవీరరాఘవపురం బయలుదేరారు. అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో నెల్లూరులో రైలు దిగి బస్సులు లేకపోవడంతో సంగం వైపు వచ్చే పేపర్ వ్యాన్‌లో ఎక్కారు. బుచ్చిరెడ్డిపాళెం దాటిన తరువాత వేగంగా వస్తూ మార్గమధ్యంలోని దువ్వూరు సమీపంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న రెండు గేదెలను ఢీకొని వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాగరాజు (45), డ్రైవర్ శ్రీనివాసులు (40) మృతి చెందాడు. ఓ గేదె కూడా మృతి చెందింది. మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే, చెన్నై-కోల్‌కతా హైవేపై శుక్రవారం తెల్లవారుజామున ఆగిఉన్న కంటైనర్ లారీని ఓ లారీ ఢీకొనడంతో కావూరు గ్రామానికి చెందిన మినీ లారీ డ్రైవర్ మొగిలి సతీష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, వైద్యసిబ్బంది అతికష్టం మీద మృతదేహాన్ని వెలికితీశారు. గాయపడిన క్లీనరు అజయ్‌ను ఆసుపత్రికి తరలించారు. అలాగే, చిత్తూరు మండలం చెర్లోపల్లె వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. బంగారుపాళ్యం మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన పవన్, మంజు, చరణ్ వారి స్నేహితుడి జన్మదినానికిగాను కాణిపాకం నుంచి బైకులో కేక్ తీసుకొస్తుండగా మినీ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.
Updated Date - Jun 15 , 2024 | 03:42 AM