గొడ్డలి నా చేతిలో కాదు.. జగన్, అవినాశ్ చేతుల్లో పెట్టాలి
ABN, Publish Date - Mar 06 , 2024 | 04:20 AM
‘‘జగన్ మీడియాలో తప్పుగా వచ్చింది.. గొడ్డలి నా చేతికి కాదు ఇచ్చేది.. ఒకపక్క జగన్మోహన్‌రెడ్డిని, మరోపక్క అవినాశ్‌రెడ్డిని నిలబెట్టి వాళ్ల చేతికి గొడ్డళ్లు ఇచ్చి మధ్యలో భారతీరెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని పెట్టాలి’’ అని వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి అన్నారు.
మధ్యలో భారతి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి ఫొటోలు పెట్టాలి
జగన్ మీడియాలో అవాస్తవాలతో తప్పుడు కథనం రాశారు
ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగింది
చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా అప్రూవర్‌గా మారా
జైలులో ఉన్నప్పుడు చైతన్యరెడ్డి బెదిరించారు.. ప్రలోభపెట్టారు
అక్కడి సీసీ ఫుటేజీ బయటకు వచ్చేవరకూ పోరాడతా: దస్తగిరి
కడప, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్ మీడియాలో తప్పుగా వచ్చింది.. గొడ్డలి నా చేతికి కాదు ఇచ్చేది.. ఒకపక్క జగన్మోహన్‌రెడ్డిని, మరోపక్క అవినాశ్‌రెడ్డిని నిలబెట్టి వాళ్ల చేతికి గొడ్డళ్లు ఇచ్చి మధ్యలో భారతీరెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని పెట్టాలి’’ అని వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి అన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసి మళ్లీ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. కేవలం ఎంపీ టికెట్ కోసమే ఈ హత్య జరిగిందని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన కడప ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘వైఎస్ సునీత ఇంట్లో పనిచేసే బీబీ మా ఇంట్లోనూ పనిచేస్తుందని, అక్కడి విషయాలు ఇక్కడకు, ఇక్కడి విషయాలు అక్కడకు చేరవేస్తుందని భరత్ యాదవ్ చెప్పడం దగ్గరనుంచి జగన్ మీడియాలో అన్నీ అవాస్తవాలే రాశారు. నాపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే జైలుకెళ్లేందుకు నేను సిద్ధం. నిరూపించకపోతే జైలుకు వెళ్లేందుకు మీరు సిద్ధమా? నేను జైలు నుంచి విడుదల అవుతూనే గన్‌మెన్లు, ఎస్కార్టు వెంట వచ్చారు. నేను ఏం చేసేది ప్రతిదీ వారికి తెలుసు. నావద్ద బొలెరో ఉన్నట్లు నిరూపిస్తే మీరేం చెప్పినా చేసేందుకు సిద్ధం, నిరూపించలేకపోతే జగన్ మీడియాను మూసేసి, చేసిన తప్పు ఒప్పుకొంటారా?’’ అని దస్తగిరి సవాల్ విసిరారు.
జైల్లో సీసీ ఫుటేజీ బయట పెట్టాలి
‘‘నన్ను భయభ్రాంతులకు గురిచేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి చైతన్యరెడ్డి. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చైతన్యరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టాడు. అసలు ఆయన్ను జైల్లోకి ఎలా రానిచ్చారు? జైలులో సీసీ కెమెరాలు ఉన్నాయని జగన్ మీడియాలో రాశారు. అక్టోబరు 31న నేను జైలుకు వెళ్లినప్పటి నుంచి ప్రతి వీడియోను భద్రపరచాలి. కానీ అందతా డిలీట్ అయిపోయుంటుందని చెబుతున్నారు. జైలులో జరిగిన ఘటనల సీసీ ఫుటేజీని సీబీఐ వెలికి తీసి వీరి నిజస్వరూపం బయటపెట్టాలి’’ అని దస్తగిరి కోరారు. ‘‘నా భార్యకు కూడా 41ఏ నోటీసులు ఇచ్చామని, ఆమెను కూడా లోపల వేస్తామని, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో, మాకు సహకరిస్తావో చూస్కో అని జైలులో నన్ను కలిసిన చైతన్యరెడ్డి బెదిరించాడు. పులివెందులలో వైఎస్ మనోహర్‌రెడ్డికి రైట్‌హ్యాండ్‌గా ఉన్న రాజశేఖర్‌రెడ్డి అనే కౌన్సిలర్ నా భార్య వద్దకెళ్లి నీ భర్తను జైలులోనే చంపేస్తాం.. ఇబ్బంది పడకుండా ఉండాలంటే మేం చెప్పినట్లు వినాలని హెచ్చరించారు. మీకు కావాలంటే పులివెందుల ఓఎస్డీ ఆఫీ్‌సలో రూ.20కోట్లు డబ్బు ఉంది.. అది తీసుకోండి అని ప్రలోభపెట్టారు’’ అని దస్తగిరి చెప్పారు.
‘‘మేం డ్రామాలు ఆడుతున్నామని చెబుతున్నారు.. ఈ ఐదేళ్లు మీ ప్రభుత్వమే కదా ఉంది.. మీరేం చేస్తున్నారు.. టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన సిట్ అధికారులకు కట్టుకథలు చెప్పాం. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అండగా ఉంటామని జగన్, భారతీరెడ్డి నుంచి సమాచారం వచ్చింది. మాట వినకుంటే మమ్మల్ని ఏదోటి చేస్తామనే ధీమాతో ఉన్నారు. నాకు సహాయం చేసిన వారిని భయభ్రాంతులకు గురిచేశారు. నా తరఫున వాయిదాలకు తిరగకూడదని కడపకు చెందిన లాయర్ చంద్రగుప్తను భయపెట్టారు. నేను ఇచ్చిన సలహాతో నా భార్య జడ శ్రీనివాస్ వద్దకెళ్లి ప్రాధేయపడింది. ఆయన హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసి తీసుకొచ్చారు’’ అన్నారు.
విచారణకు పిలిస్తే... ఢిల్లీ పోయి కాళ్లు పట్టుకుంటున్నారు
‘‘జైలులో జరిగిన ప్రతి అంశంపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తా. నా భార్యకు మతిస్థిమితం లేక చెబుతా ఉంది, మీడియా మిత్రులు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని జైలు సూపరింటెండెంట్ లెటర్ రాయమన్నారు. వినకుంటే ములాఖత్‌లు కట్ చేస్తామని, ఫోన్లు లేకుండా చేస్తామని బెదిరించారు. ఈ విషయాలన్నీ సీబీఐ, జైళ్ల డీజీ దృష్టికి తీసుకెళ్తా. సీసీ ఫుటేజీ బయటకు వచ్చేవరకు పోరాడతా. సుప్రీంకోర్టుకు కూడా వెళ్తా. న్యాయస్థానాలను, సీబీఐని మేనేజ్ చేసే కెపాసిటీ వైఎస్ సునీతకు లేదు. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగానే అప్రూవర్‌గా మారాను. వివేకా దగ్గర పనిచేశా.. ఆయన పెట్టిన కూడు తిన్నా. వీళ్లతో చేతులు కలపడం తప్పే’’ అని దస్తగిరి పేర్కొన్నారు.
Updated Date - Mar 06 , 2024 | 04:21 AM