నేటి నుంచి పల్లె పండుగ
ABN, Publish Date - Oct 14 , 2024 | 04:22 AM
రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత మొట్టమొదటసారిగా చేపట్టనున్న ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
20 వరకూ పంచాయతీ వారోత్సవాల నిర్వహణ
3 వేల కి.మీ. సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు భూమిపూజ
కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శ్రీకారం
టూర్ షెడ్యూల్ ప్రకటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
సంక్రాంతి నాటికి రోడ్లు పూర్తయ్యేలా ప్రణాళికలు
అందుబాటులో ఉన్న ఉపాధి నిధులతో బిల్లుల చెల్లింపు
పనులు చేపట్టేందుకు ముందుకు వస్తున్న కాంట్రాక్టర్లు
ఐదేళ్ల తర్వాత మెటీరియల్ నిధుల సద్వినియోగం
వైసీపీ పాలనలో ధ్వంసమైన రహదారులకు మోక్షం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత మొట్టమొదటసారిగా చేపట్టనున్న ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు 14న సోమవారం భూమి పూజ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్నీ జిల్లాల్లో కలెక్టర్లు గ్రామసభల్లో ఆమోదించిన 30 వేల పనులకు సంబంధించి 3 వేల కి.మీ మేర సిమెంట్ రోడ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతి మంజూరు చేశారు. సాంకేతిక ఆమోదం కోసం ఇంజనీర్లు అంచనాలు రూపొందిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జరిగే భూమిపూజలో పాల్గొంటారు. అదే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు పంచాయతీరాజ్‌శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సిమెంట్ కొనుగోలుకు సంబంధించి ఒక్కో బస్తా రూ.270 చొప్పున స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేసి వాడుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఆమోదించిన క్వారీల నుంచి సేకరించాలని పేర్కొంది. ప్రతి రోడ్డు పని వద్ద వర్క్‌సైట్ బోర్డు ఏర్పాటు చేయాలని, దానిపై ఆయా పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండాలని సూచించింది. అన్ని పనులకు సంబంధించి పౌరసమాచార బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాణ్యతతో కూడిన సిమెంట్ రోడ్లను జనవరి లోపు పూర్తి చేయాలని, వీటిని క్వాలిటీ కంట్రోల్, సోషల్ ఆడిట్ విభాగం తనిఖీ చేస్తుందని మార్గదర్శకాల్లో తెలిపింది. రానున్న సంక్రాంతి నాటికి సిమెంట్ రోడ్లును ప్రారంభించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
భూమి పూజల్లో ఎమ్మెల్యేలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సిమెంట్ రోడ్ల భూమి పూజకు ఎమ్మెల్యేలు టూర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 14 నుంచి 20 వరకు వారంతా ఆయా ప్రాంతాల్లో చేపట్టనున్న భూమి పూజల్లో నిమగ్నమవుతారు. సీఎం చంద్రబాబు కూడా ఎక్కడో ఒకచోట ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఇంకా షెడ్యూలు ఖరారు కాలేదు. ఐదేళ్ల తర్వాత చేపట్టనున్న సిమెంట్ రోడ్ల భూమిపూజను ఒక పండుగలా ప్రారంభించాలని సర్కారు యోచిస్తోంది. ఉపాధి నిధులు అందుబాటులో ఉండటంతో బిల్లు చెల్లింపులకు ఢోకాలేదని తెలియడంతో పనులు చేపట్టేందుకు గ్రామాల్లో కాంట్రాక్టర్లు ముందుకొస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
మెటీరియల్ నిధుల సద్వినియోగం దిశగా
ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధుల సద్వినియోగం ఐదేళ్ల తర్వాత ప్రారంభమవుతోంది. ఈ ఏడాదిలో రూ.3వేల కోట్ల నిధులతో 3 వేల కి.మీ. సిమెంట్ రోడ్లు , 500 కి.మీ. తారు రోడ్ల నిర్మాణం, 22 వేల మినీ గోకులాలతో పాటు పలు వ్యక్తిగత ఆస్తులను పేదలకు కల్పించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో ఉపాధి పథకం మెటీరియల్ నిధులు విస్తృతంగా వినియోగించుకొనేవారు. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ఉపాధి పథకం స్పూర్తిని దెబ్బతీయడంతో పాటు మెటీరియల్ నిధులు వాడుకోవడంలో విఫలమైంది. గత చంద్రబాబు ప్రభుత్వం సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లతో పాటు పలు సాగు, తాగునీటి వనరుల కల్పనకు ఈ నిధులను వాడి సద్వినియోగం చేసుకుంది. అయితే వైసీపీ హయాంలో మొదటి ఏడాది సరైన ప్రణాళికలు లేక నిధులు వృధా అయ్యాయి. ఆ తర్వాత జగనన్న కాలనీల లెవలింగ్ పనులంటూ కొండల్లో, చెరువుల్లో మట్టి పోసి వైసీపీ కార్యకర్తలకు అప్పనంగా నిధులు దోచిపెట్టారు. అలాగే సచివాలయ భవనాల నిర్మాణాలు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. దీంతో రూ.వేల కోట్ల ఉపాధి నిధులను దుర్వినియోగమయ్యాయి.
ఐదేళ్ల తర్వాత రోడ్ల నిర్మాణం
రాష్ట్రంలో గత టీడీపీ హయాంలో వేసిన రోడ్లు తప్ప ఐదేళ్లలో ఎక్కడా ఒక్క రోడ్డు నిర్మాణం కూడా జరగలేదు. గ్రామీణ రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఏకంగా కొన్ని రోడ్లు మాయమయ్యాయి. గతంలో వేసిన తారు రోడ్లు నిర్వహణకు నోచుకోకపోవడంతో వాటిపై కంకర, తారు క్రమంగా కనుమరుగయ్యాయి. ఆ రోడ్లపై వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నిలిపివేశారు. ఒకప్పుడు నడక దారిగా ఉన్న రోడ్లను అప్పటి టీడీపీ సర్కారు తారురోడ్లుగా మారిస్తే... వైసీపీ పాలనలో అవి మళ్లీ నడక దారులుగా మారిపోయాయి. పంచాయతీరాజ్ రోడ్ల మీద కనీసం మట్టి పోసి మరమ్మతులు చేసిన దాఖాల్లేవు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు రోడ్ల నిర్మాణాలు చేపడతామని హడావుడి చేసిన వైసీపీ ప్రభుత్వం... రోడ్ల పనులకు టెండర్లు ఖరారు చేసింది. సుమారు రూ.100 కోట్ల మేర పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. అందులో రూ.25కోట్ల మేర చేపట్టిన పనులకు కూడా బిల్లులివ్వక పోవడంతో వారు పనులు నిలిపేశారు. చివరకు కోర్టుకు వెళ్లి బిల్లులు వసూలు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వంలో టెండర్లు పిలిచినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
Updated Date - Oct 14 , 2024 | 04:22 AM