అచ్యుతాపురంలో నాగబాబు నివాసం
ABN, Publish Date - Feb 17 , 2024 | 01:16 AM
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురంలో నివాసం ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సిబ్బంది కోసం పక్కనే మరో పది గృహాలు అద్దెకు...
అనకాపల్లిలో పార్టీ జిల్లా కార్యాలయం
అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి నాగబాబు పోటీ చేయనున్నారని సమాచారం
అచ్యుతాపురం (అనకాపల్లి జిల్లా), ఫిబ్రవరి 16:
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురంలో నివాసం ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇల్లు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అచ్యుతాపురం నుంచి గాజువాక వెళ్లే రహదారిలో రామన్నపాలెం వద్ద ఎస్‌టీబీఎల్ లేఅవుట్ ఉంది. దీనిని ఆనుకొని జనసేన పార్టీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి సుందరపు విజయకుమార్ ఇటీవల నూతనంగా గృహాన్ని నిర్మించుకున్నారు. ఈ భవనం కింద భాగంలో నాగబాబు నివాసం ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎస్‌టీబీఎల్ లేఅవుట్‌లో సుమారు పది గృహాలను అద్దెకు తీసుకున్నారు. ఎన్నికల కార్యకలాపాలన్నీ అచ్యుతాపురం కేంద్రంగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే నాగబాబుతోపాటు ఇతర సిబ్బంది ఉండడానికి పది ఇళ్లను అద్దెకు తీసుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా జనసేన పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటుకు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ఎదురుగా ఒక భవనాన్ని ఎంపిక చేశారు. ఈ భవన యజమాని చోడవరంలో ఒక విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. కొంతకాలం క్రితం ఆయన జనసేన పార్టీలో చేరారు.
Updated Date - Feb 17 , 2024 | 01:16 AM