శరవేగంగా మహిళా డిగ్రీ కళాశాల పనులు
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:48 AM
ట్టకేలకు అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల భవన సముదాయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. రెండేళ్ల క్రితమే భవన సముదాయాలు పూర్తి కావలసి ఉండగా కరోనా, ఆ తరువాత ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడం వంటి కారణాల వల్ల జాప్యం జరిగింది. అయితే వెంటనే పనులు పూర్తి చేయాలని విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు రావడంతో జోరుగా పనులు సాగుతున్నాయి.
- ప్రారంభానికి సిద్ధమవుతున్న భవన సముదాయాలు
అరకులోయ, ఫిబ్రవరి 29: ఎట్టకేలకు అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల భవన సముదాయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. రెండేళ్ల క్రితమే భవన సముదాయాలు పూర్తి కావలసి ఉండగా కరోనా, ఆ తరువాత ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడం వంటి కారణాల వల్ల జాప్యం జరిగింది. అయితే వెంటనే పనులు పూర్తి చేయాలని విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు రావడంతో జోరుగా పనులు సాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రూసా నిధులతో మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అరకులోయకు కళాశాలను మంజూరు చేశారు. 2019 ఫిబ్రవరి 3న జమ్ము కశ్మీరులో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో మహిళా కళాశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. సుమారు రూ.12 కోట్లతో ఈ కళాశాల భవన సముదాయాలను నిర్మిస్తున్నారు. ఏపీఈడబ్ల్యూఐడీసీ (ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. రెండేళ్లు కరోనా వల్ల, ఆ తరువాత బిల్లుల మంజూరులో జాప్యం వల్ల పనులకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ కళాశాల విద్యార్థినులకు కో-ఎడ్యుకేషన్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు కళాశాలల ప్రారంభం సందర్భంగా దీనిని కూడా ప్రారంభించే అవకాశం ఉండడంతో వెంటనే నిర్మాణాలు పూర్తి చేయాలని విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో నెల రోజులుగా పనులు జోరుగా సాగుతున్నాయి. తరగతులు, బోధన, ప్రాక్టికల్స్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటగా మెయిన్ బ్లాక్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌ను సిద్ధం చేస్తున్నారు. అలాగే విద్యార్థినుల వసతి గృహ భవనాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. మరో పది రోజుల్లో పనులు దాదాపు పూర్తి కావచ్చునని అధికారులు చెబుతున్నారు
Updated Date - Mar 01 , 2024 | 12:48 AM