‘సర్వే రాళ్ల’లో స్వాహాపర్వం
ABN, Publish Date - Oct 29 , 2024 | 05:40 AM
గనుల శాఖ కేంద్రంగా వైసీపీ హయాంలో సాగిన కొనుగోళ్ల దోపిడీ గుట్టురట్టవుతోంది. అస్మదీయులు, అయినవారితో కంపెనీలు ఏర్పాటుచేయించి వాటికే టెండర్లు కట్టబెట్టి దోచుకున్న ఉల్లంఘనుల బాగోతాలు వెలుగుచూస్తున్నాయు.
గ్రానైట్ ఫ్యాక్టరీ, గనుల లీజులు లేని కంపెనీకి సర్వే రాళ్లను సరఫరా చేసే కాంట్రాక్టును కట్టబెట్టారు. వైద్య పరికరాలు అమ్ముకునే మరో కంపెనీకి.. సర్వేరాళ్లను పాలిష్ చేసే మిషన్లను చైనా నుంచి కొనుగోలు చేసే కాంట్రాక్టును అప్పగించారు. ఇలా...నియమనిబంధనలు, పారదర్శకత, పద్ధతిని బుట్టదాఖలు చేసి ఆనాడు అడ్డగోలు దందాను ఎండీసీలోని ఉన్నతాధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలు నడిపించారు. పైగా.. ఈ కంపెనీల్లో ఒకటి ఎండీసీలోని ఓ ఉన్నతాధికారి బంధువులది కాగా, రెండో కంపెనీ మరో ఉన్నతాధికారి బినామీ కంపెనీ. ఇప్పుడు వీటన్నింటిని వెలికితీసేందుకు ఏసీబీ ఒక్కో అంశంపై విచారణ మొదలుపెట్టింది.
వైద్య పరికరాలు అమ్ముకునే ‘ధన్వంతరి’ కంపెనీకి రాళ్లతో ఏం పని?
ఫ్యాక్టరీ,గనులలీజు లేని కంపెనీ మరొకటి
దానికి సర్వేరాళ్ల సరఫరా కాంట్రాక్టు ఎలా?
ఈ కంపెనీలను సిఫారసు చేసిందెవరు?
ధన్వంతరికి 140 కోట్ల విలువైన టెండరు
అయినా, న్యాయసమీక్షకు పంపలేదేం?
పైగా రూ.100 కోట్లు అడ్వాన్స్ ఇవ్వాలని
ఆర్థిక శాఖపై నాడు వెంకటరెడ్డి ఒత్తిడి
అది ఎవరి బంధువుల కంపెనీ?
విజిలెన్స్ విచారణ ఎవరు వద్దన్నారు?
సర్వేరాళ్ల కొనుగోల్‌మాల్‌పై ఏసీబీ విచారణ
టెండరు కమిటీని ప్రశ్నించిన అధికారులు
ఎండీసీ కార్యాలయం తలుపులు మూసి కీలక ఫైళ్ల పరిశీలన
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గనుల శాఖ కేంద్రంగా వైసీపీ హయాంలో సాగిన కొనుగోళ్ల దోపిడీ గుట్టురట్టవుతోంది. అస్మదీయులు, అయినవారితో కంపెనీలు ఏర్పాటుచేయించి వాటికే టెండర్లు కట్టబెట్టి దోచుకున్న ఉల్లంఘనుల బాగోతాలు వెలుగుచూస్తున్నాయు. భూముల సర్వే జరిపి వేసే రాళ్ల కొను...గోలుమాల్‌పై తెరవెనక వెంకటరెడ్డి, మరో ముగ్గురు అధికారుల కేంద్రంగా సాగిన దందాపై అవినీతి నిరోధకశాఖ సోమవారం విచారణ మొదలుపెట్టింది. తాటిగడపలోని ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) కార్యాలయంలో ఏసీబీ విచారణ చేసింది. కీలకమైన ఫైళ్లను దగ్గరపెట్టుకొని, సర్వేరాళ్ల కొనుగోలు తీరుపై ఆరాతీసింది. ఏసీబీ డీఎస్పీలు ప్రతాప్, రామచంద్రల నేతృత్వంలో ఆరుగురు సీఐలు, ఇతర అధికారుల బృందం ఎండీసీ ఆఫీసును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొన్నట్లు తెలిసింది. కొత్త వ్యక్తులను ఆఫీసులోకి రానివ్వకుండా ద్వారాలు మూసి ఇన్‌కెమెరా తరహాలో విచారణ చేసినట్లు తెలిసింది. సర్వేరాళ్ల టెండర్ కమిటీని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కమిటీలో ముగ్గురు అధికారులున్నారు. దీంతోపాటు ఈ ఫైలులో పలు అంశాలను లేవనెత్తిన వారు, ఫైలుతో సంబంధం ఉన్న అధికారులను ఒక్కక్కరిని పిలిచి ప్రశ్నించినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు ముందుగా కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకుని, వాటి ఆధారంగా అధికారులను ప్రశ్నించారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం, ధన్వంతరీ అనే కంపెనీకి టెండరు ఎలా ఇచ్చారు? ఏ రూల్ ప్రకారం ఆ కంపెనీకి టెండరు అర్హత లభించింది? ఆ కంపెనీని ఎవరు తీసుకొచ్చారు? అది ఏ అధికారి బంధువు కంపెనీ? సురేశ్ అనే వ్యక్తి గనుల శాఖలో ఎవరికి సన్నిహిత బంధువు?’’ అంటూ ఏసీబీ ప్రశ్నించినట్లు తెలిసింది. ధన్వంతరీ కంపెనీకి టెండర్‌లో పాల్గొనే అర్హత వచ్చేలా నిబంధనలు మార్చిందెవరు? నిబంధనలు మార్చాలని సిఫారసు చేసిందెవరు? అని ప్రశ్నించినట్లు సమాచారం. వైద్య పరికరాలు అమ్ముకునే ధన్వంతరీ అసోసియేట్స్‌కు సర్వే రాళ్లతో ఏం పని? ఈ రంగంలో ఆ సంస్థకు అనుభవం లేకున్నా టెండర్ ఎలా ఇచ్చారు? గ్రానైట్ ఫ్యాక్టరీ, గనుల లీజులు లేని మరో అనామక సంస్థకు వందల కోట్ల విలువైన టెండర్ ఇవ్వాలని ఎలా నిర్ణయించారు? ఆ కంపెనీని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవ రు ప్రమోట్ చేశారు?’’ అని ఓ కీలక అధికారిని ఏసీబీ బృందం ప్రశ్నించింది. సర్వేరాళ్ల ఎంగ్రేవింగ్ (గ్రానైట్ రాయిపై పేరు, చిత్రాలు చెక్కడం), పాలిషింగ్ కోసం చైనా కంపెనీ మిషన్లు కొనమని చెప్పింది ఎవరు? ఆ మిషన్లను వాడాలని సిఫారసు చేసిందెవరు? ధన్వంతరీతో కాంట్రాక్ట్ రద్దుకాకుండా ఆ కంపెనీకి బ్యాంక్ గ్యారంటీ (బీజీ)లు విడుదల చేయించింది ఎవరు? కాంట్రాక్టు అగ్రిమెంటు రద్దుకాకుండా, ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండానే బీజీలు ఇవ్వమని ఒత్తిడి చేసిందెవరు? బీజీలు ఇవ్వకూడదని ఫైలుపై అనేక మంది పేర్కొన్నా.....ఇవ్వాల్సిందే అని నిర్ణయం తీసుకోవడం వెనక ఎవరి ప్రయోజనాలు, ఒత్తిళ్లు ఉన్నాయి? అని మరో కీలక అధికారిని ప్రశ్నించినట్లు తెలిసింది.
అసలేం జరిగిందంటే....
జగన్ ప్రభుత్వం 2019లో భూముల సర్వేచేపట్టింది. తమకు 3.50 కోట్ల రాళ్లు కావాలని గనుల శాఖను సర్వేశాఖ కోరింది. గనుల శాఖ టెండర్లు పిలిచి గ్రానైట్ రాళ్ల సరఫరా ఏజెన్సీని ఎంపిక చేయాలి. ఆశాఖ పాత్ర అంతవరకే. కానీ నాటి గనుల అధికారి వెంకటరెడ్డి మూడు అడుగులు ముందుకేశారు. ఒక్కో గ్రానైట్ రాయికి 475 రూపాయల ధర నిర్ణయించినా ఏ ఒక్క కంపెనీ బిడ్ దాఖలు చేయలేదు. రెండుసార్లు టెండర్లు పిలిచినా కంపెనీలు ఆసక్తిచూపలేదు. ఇందుకు కారణం ఆ ధర తమకు గిట్టుబాటు కాదని, కానీ, ఓ ప్రైవే టు సంస్థ 475 రూపాయల ధరకే రాయిని సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. ఆ కంపెనీకే టెండర్ కట్టబెట్టారు. అయితే, ఆ కంపెనీకి గ్రానైట్ ఫ్యాక్టరీ లేదు. గనుల లీజులు లేవు. అయితే, అది ఓ అధికారి బంధువుది కావడంతో ఒకే చేశారు. కొనుగోలు చేసిన రాళ్లను పాలి్‌షచేసి దానిపై జగన్ పేరు రాయడానికి పలు చోట్ల ఎంగ్రేవింగ్, పాలిషింగ్ యూనిట్లు పెట్టాలనుకున్నారు. ఇందుకోసం చైనా మిషన్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వైద్య పరికరాలు అమ్ముకునే ధన్వంతరీ అనే సంస్థకు టెండర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ టెండర్ విలువ 520 కోట్లు. ఇది ఓ గనుల ఉన్నతాధికారి బినామీ కంపెనీ అని, ఎలాంటి అర్హతలు లేకున్నా టెండర్ ఇచ్చారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. తొలుత 140 కోట్లతో 25 యంత్రాలు కొనాలని ప్లాన్‌వేశారు. నిబంధనల ప్రకారం 100 కోట్లు విలువచేసే ఏ టెండర్ అయినా న్యాయసమీక్షకు పంపాలి. కానీ ఈ పనిచేయలేదు. పైగా, దన్వంతరీకే 100 కోట్ల రూపాయల అడ్వాన్వ్ ఇవ్వాలనుకున్నారు. ఈమేరకు ఒప్పందం చేసుకున్నారు. వెంటనే అడ్వాన్స్ సొమ్ము విడుదల చేయాలని గనుల శాఖ నాటి డైరెక్టర్ వెంకటరెడ్డి....ఆర్ధికశాఖ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ గత ఏడాది నవంబరు, డిసెంబరు మాసాల్లో వరుస వార్తలను ప్రచురించింది. ఈ పరిణామాలపై నాటి మంత్రి పెద్దరెడ్డి విజిలెన్స్ విచారణ చేయాలని ఆదేశించారు. దీన్ని నాటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి అడ్డుకున్నారు పంచాయితీ జగన్ వద్దకు చేరగా, ఆయన వెంకటరెడ్డిని సమర్థించారు. కానీ, అప్పటికే లోకాయుక్త, విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఇదే అంశంపై విచారణ జరుపుతున్నారు.
బ్యాంక్ గ్యారంటీల ఫైల్ ముందుపెట్టి..
సర్వేరాళ్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ కమిషన్, లోకాయుక్తలకు ఫిర్యాదులు వెళ్లాయి. ఆ సంస్థల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు.. నాడు మీరేం చేశారని ఓ ఉన్నతాధికారిని ఏసీబీ ఆరాతీసినట్లు తెలిసింది. సర్వేరాళ్ల కొనుగోళ్లపై గ నుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి, నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నడుమ విబేధాలు ఎందుకు వచ్చాయి? అని ఏసీబీ బృందం నలుగురు గనుల శాఖ కీలక అధికారులను ప్రశ్నించింది. సర్వేరాళ్ల కొనుగోలు, ఓఅండ్‌ఎమ్ కాంట్రాక్టులో జరిగిన గోల్‌మాల్‌పై మొత్తం ఏడుగురిని ప్రశ్నించారు. ఇందులో టెండర్ కమిటీలో కీలకంగా ఉన్న ముగ్గురు అధికారులున్నారు. మధ్యలో ఓ అధికారి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఏసీబీ టీమ్.....బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించిన ఫైలును తెప్పించి సంబంధిత అధికారి ముందు పెట్టినట్లు తెలిసింది. ఆ ఫైల్‌లో రాసిన దానికి, ఆ అధికారి చెప్పినదానికి తేడా ఉండటంతో ఫైలులోని అంశాల ఆధారంగా ప్రశ్నించినట్లు సమాచారం.
Updated Date - Oct 29 , 2024 | 05:40 AM