2027 నాటికి రూ.1.41 లక్షల కోట్లు
ABN, Publish Date - Feb 21 , 2024 | 03:32 AM
దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్ 25-35 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) తో అభివృద్ధి చెందుతున్నదని.. 2027 నాటికి భారత ఏఐ మార్కెట్ పరిమాణం 1,700 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.41 లక్షల కోట్లు) స్థాయికి...
భారత ఏఐ మార్కెట్‌పై నాస్కామ్-బీసీజీ అంచనా
ముంబై: దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్ 25-35 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) తో అభివృద్ధి చెందుతున్నదని.. 2027 నాటికి భారత ఏఐ మార్కెట్ పరిమాణం 1,700 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.41 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవచ్చని ఓ రిపోర్టు అంచనా వేసింది. కంపెనీలు ఆధునిక సాంకేతికత కోసం భారీగా వెచ్చిస్తుండటం, దేశీయంగా ఏఐ నిపుణులతోపాటు ఏఐలో పెట్టుబడులు వేగంగా పెరుగుతుండటం వంటి పలు అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని నివేదిక పేర్కొంది. ఐటీ రంగ అసోసియేషన్ నాస్కామ్, బీసీజీ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికను నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరమ్ సదస్సులో మంగళవారం విడుదల చేశారు. మరిన్ని విషయాలు..
ప్రపంచవ్యాప్తంగా ఏఐలో పెట్టుబడులు 2019 నుంచి 24 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వచ్చాయి. గత ఏడాదిలో దాదాపు 8,300 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలివచ్చాయి.
మెజారిటీ పెట్టుబడులు డేటా అనలిటిక్స్, జెనరేటివ్ ఏఐ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) అల్గోరిథమ్స్ అండ్ ప్లాట్‌ఫామ్స్ విభాగాల్లోకి వచ్చాయి.
దేశీయంగా టెక్ సర్వీసెస్, ప్రొడక్ట్ కంపెనీలు ఏఐ పెట్టుబడుల్లో 93 శాతం డిజిటల్ కంటెంట్, డేటా అనలిటిక్స్, సప్లై చెయిన్ సేవల అభివృద్ధి కోసం వెచ్చించాయి.
ఏఐ నిపుణులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలో 4.20 లక్షల మంది నిపుణులు ఏఐ సాంకేతిక విధులను నిర్వహిస్తున్నారు.
ఏఐ నైపుణ్య వ్యాప్తి కూడా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మూడు రెట్లు అధికం. గత ఏడేళ్లలో ఏఐ నైపుణ్యం కలిగిన వ్యక్తులు 14 రెట్లు పెరిగారు. 2027 వరకు ఏఐ నిపుణుల డిమాండ్‌లో 15 శాతం సీఏజీఆర్ నమోదు కానుంది.
భారత్‌లోని టెక్నాలజీ ఇండస్ట్రీలో గడిచిన ఏడాది కాలంలో ఏఐ/ఎంఎల్ ఉద్యోగాలు 15 శాతానికి పైగా పెరిగాయి. ఏఐ ఇంజనీర్ ఉద్యోగావకాశాలు వార్షిక ప్రాతిపదికన 67 శాతం పెరిగాయి.
కృత్రిమ మేధ నిపుణుల ప్రాధాన్యతను గుర్తించి, ప్రధాన కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ సాంకేతికతలో శిక్షణ ఇచ్చేందుకు భారీగా వెచ్చిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగుల నైపుణ్య శిక్షణ కోసం వచ్చే మూడేళ్ల కాలానికి 100 కోట్ల డాలర్ల మేర కేటాయింపులు జరుపుతున్నాయి.
Updated Date - Feb 21 , 2024 | 03:32 AM