GOLD : నగల దుకాణాలకు అక్షయ తృతీయ కళ
ABN, Publish Date - May 11 , 2024 | 05:04 AM
పసిడి ధర కొండెక్కినా అక్షయ తృతీయ రోజు బంగారు నగల అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు. శుక్రవారం ఉదయం నుంచి నగల దుకాణాలకు జనం పోటెత్తారు. గత ఏడాది అక్షయ తృతీయ రోజు 10 గ్రాముల మేలిమి (24 ..
జనంతో కిటకిట
ముంబై: పసిడి ధర కొండెక్కినా అక్షయ తృతీయ రోజు బంగారు నగల అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు. శుక్రవారం ఉదయం నుంచి నగల దుకాణాలకు జనం పోటెత్తారు. గత ఏడాది అక్షయ తృతీయ రోజు 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) బంగారం రూ.60,000గా ఉంది. ఈ అక్షయ తృతీయకు అది 15 నుంచి 17 శాతం పెరిగి రూ.71,000కు చేరింది. ఈ ప్రభావం ఈ ఏడాది అక్షయ తృతీయ నగల అమ్మకాలపై ఉంటుందని మార్కె ట్ వర్గాలు భయపడ్డాయి. అయితే ఆ భయాలను పటాపంచలు చేస్తూ కొనుగోలుదారులు శుక్రవారం ఉదయం నుంచే నగల దుకాణాల ముందు క్యూ కట్టారు.
‘దేశవ్యాప్తంగా నగల దుకాణాలు అక్షయ తృతీయ రోజు కిటకిట లాడాయి. దక్షణ భారత దేశంలో ఇది మరింత స్పష్టంగా కనిపించింది’ అని ఆలిండియా జెమ్ అండ్ జువెలరీ డొమిస్టిక్ కౌన్సిల్ (ఏఐజేజేడీసీ) చైర్మన్ సయాం మెహ్రా చెప్పారు.
తగ్గే అవకాశం
గత ఏడాతో పోలిస్తే ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజు కొనుగోలుదారులు ఆచితూచి ఖర్చు చేశారు. మరీ అవసరమెతే తప్ప పెద్ద పెద్ద ఆభరణాల జోలికి పోలేదు. ఎక్కువ మంది చిన్న చిన్న ఆభరణాలతోనే సరిపెట్టుకున్నారు. అధిక ధరలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపించింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే విలువపరంగా అమ్మకాలు పెరిగినా, పరిమాణ పరంగా ఐదు నుంచి ఏడు శాతం తగ్గాయని మార్కెట్ వర్గాలు చెప్పాయి. దక్షిణ భారత్‌లో పెళ్లిళ్లకు అవసరమయ్యే పెద్ద పెద్ద ఆభరణాలు ఎక్కువగా అమ్ముడైతే, మిగతా ప్రాంతాల్లోని కొనుగోలుదారులు ఎక్కువగా చిన్న చిన్న ఆభరణాలతోనే సరిపెట్టుకున్నారు. పసిడి ధర మరింత పెరుగుతుందనే భయంతో కొంత మంది, అక్షయ తృతీయ రోజు పెద్ద పెద్ద ఆభరణాలు కొనుగోలు చేశారు. అక్షయ తృతీయ శనివారం మధ్యాహ్నం వరకు ఉన్నందున అమ్మకాలు శనివారం వరకు కొనసాగుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రూ.3.80 లక్షల కోట్ల పసిడి దిగుమతులు
మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మన దేశం 4,554 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.80 లక్షల కోట్లు) విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దిగుమతి అయిన 3,500 కోట్ల డాలర్ల విలువైన బంగారంతో పోలిస్తే ఇది 30 శాతం ఎక్కువ. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన వివరాలు విడుదల చేసిది. గత ఆర్థిక సంవత్సరం మన దేశం దిగుమతి చేసుకున్న బంగారంలో స్విట్జర్లాండ్ నుంచి 40 శాతం, యూఏఈ నుంచి 16 శాతం, దక్షిణాఫ్రికా నుంచి పది శాతం దిగుమతి అయింది.
Updated Date - May 11 , 2024 | 05:04 AM