Personal Finance: మీ నెల జీతం రూ. లక్షన్నరా? ఇంతకు మించి ఖరీదైన ఇల్లు మాత్రం కొనొద్దు!
ABN, Publish Date - Nov 26 , 2024 | 09:02 PM
సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే యువతకు ఆర్థిక నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈఎమ్ఐలపై ఇల్లు కొనుగోలు చేయదలిస్తే పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి యువతలో కొందరు నెలకు లక్షన్నర రూపాయలకు పైగానే సంపాదిస్తున్నారు. ఈ తరానికి అవగాహన ఎక్కువ కావడంతో దీపం ఉండగానే ఇల్లు కూడా చక్కబెట్టేసుకుంటున్నారు. ఇలా సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే యువతకు ఆర్థిక నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈఎమ్ఐలపై ఇల్లు కొనుగోలు చేయదలిస్తే పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు (Personal Finance).
నిపుణులు చెప్పే దాని ప్రకారం, నెలకు సుమారు లక్షన్నర వరకూ సంపాదించే వారు రూ. కోటి వరకూ ధర పలికే ఇంటిని కొనుగోలు చేసేందుకు సాహసించొచ్చు. లోన్ రీపేమెంట్ పీరియడ్ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే ఈఎమ్ఐల భారం కూడా భరించేస్థాయిలోనే ఉంటుందట.
Life Insurance: జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ 6 విషయాల్లో జాగ్రత్త!
నిపుణులు చెప్పే దాని ప్రకారం, రూ.కోటి విలువైన ఇంటిని లోన్‌పై కొనాలంటే బ్యాంకులు గరిష్ఠంగా 80 శాతం వరకూ లోన్ ఇస్తాయి. అంటే.. రూ. కోటి ఖరీదైన ఇంటికి లోన్ రూపంలో రూ.80 లక్షల వరకూ పొందొచ్చు. మిగతా మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించాలి. అంటే డౌన్ పేమెంట్ రూ.20 లక్షలన్నమాట. ఇక ఈఎమ్ఐలు తక్కువగా ఉండాలనుకునే వారు 30 సంవత్సరాల రీపేమెంట్ పీరియడ్‌ను ఎంచుకోవచ్చు. ఇక మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ లోన్ వడ్డీ రేటు 8.5 శాతం ఉండొచ్చు. లోన్ చెల్లింపులు భారం కాకుండా ఉండేందుకు బ్యాంకులు ఈఎమ్ఐలను వినియోగదారుల జీతంలో గరిష్ఠంగా 50 శాతం ఉండేలా నిర్ణయిస్తాయి.
Personal Finance: మిడిల్ క్లాస్ జీవులు కచ్చితంగా పాటించాల్సిన 10 ఆర్థిక సూత్రాలు!
కాబట్టి, ఈ గణాంకాలను ప్రామాణికంగా భావిస్తే నెలవారీ ఈఎమ్ఐ రూ. 61,500గా ఉంటుంది. ఇక స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు వంటివన్నీ కలిపి రూ.8 లక్షల వరకూ ఖర్చు రావచ్చు. ఇక లీగల్ ఫీజులు, ప్రాపర్టీ మెయింటెనెన్స్ ఖర్చులు, ఇళ్ల మార్పు ఖర్చులు కూడా వీటికి తోడవుతాయి. ఈ లెక్కన నెలకు సుమారు లక్షన్నర శాలరీ ఉన్నవారు సులువుగా సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. ఇంతకు మించి ఖరీదైన ఇల్లు మాత్రం ఆర్థికంగా భారమయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
అయితే, కోటి రూపాయల ఇంటిని లోన్‌పై కొనుగోలు చేసేందుకు రెడీ కావడం చాలా పెద్ద ఆర్థికపరమైన కమిట్‌మెంట్ అని అనుభవజ్ఞులు చెబుతున్నారు. కాబట్టి, భవిష్యత్తు ఆర్థిక అవసరాలు, స్థిరత్వం, ఉద్యోగఉపాధి అవకాశాలు వంటవివన్నీ దృష్టిలో పెట్టుకుని ఓ నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా నిపుణులను సంప్రదించి పూర్తి విషయాలను కూలంకషంగా తెలుసుకోవాలనేది అనుభవజ్ఞులు చెప్పేమాట.
Updated Date - Nov 26 , 2024 | 09:02 PM