iPhones : ఐఫోన్లకూ జనరేటివ్ ఏఐ టెక్నాలజీ హంగులు
ABN, Publish Date - Jun 11 , 2024 | 04:41 AM
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఎట్టకేలకు జనరేటివ్ కృత్రిమ మేధ (జనరేటివ్ ఏఐ) సాంకేతికతలోకి ప్రవేశించింది. యాపిల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్‌లో జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి
యాపిల్ ఇంటెలిజెన్స్‌ను ఆవిష్కరించిన కంపెనీ
న్యూయార్క్: అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఎట్టకేలకు జనరేటివ్ కృత్రిమ మేధ (జనరేటివ్ ఏఐ) సాంకేతికతలోకి ప్రవేశించింది. యాపిల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్‌లో జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. పలు లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్‌ఎల్‌ఎం) సమాహారమైన ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ అభివృద్ధిలో వినియోగదారుల సమాచార భద్రతతోపాటు వ్యక్తిగతీకరణకు అధిక ప్రాధాన్యమివ్వడం జరిగిందని ‘డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024’ సదస్సులో యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ వెల్లడించారు. ఐఓఎస్ 18, ఐప్యాడ్ ఓస్ 18, మ్యాక్ సికోయా వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో కూడిన కంపెనీ ఉత్పత్తుల్లో యాపిల్ ఇంటెలిజెన్స్‌ను ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాదు, కంపెనీకి చెందిన ప్రముఖ డిజిటల్ అసిస్టెంట్ అప్లికేషన్ సిరి ఫీచర్లను మరింత మెరుగుపర్చడంతోపాటు వాయిస్ కమాండ్స్‌తోనే గాక, టెక్స్ట్ మేసేజ్ ద్వారానూ సమాధానాలు పొందే వీలు కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, ప్రముఖ జనరేటివ్ ఏఐ అప్లికేషన్ చాట్ జీపీటీ అభివృద్ధి సంస్థ ఓపెన్ ఏఐతోనూ యాపిల్ జట్టు కట్టింది. చాట్‌జీపీటీ అప్లికేషన్‌నూ త్వరలోనే ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.
Updated Date - Jun 11 , 2024 | 04:41 AM