Sundar Pichai: ఉద్యోగులకు ఉచిత మీల్స్‌పై ఎందుకంత ఖర్చు?.. సుందర్ పిచాయ్ ఏమన్నారంటే
ABN, Publish Date - Oct 22 , 2024 | 02:59 PM
గూగుల్ కంపెనీ తన ఉద్యోగులకు చక్కటి భోజన సదుపాయలను ఉచితంగా అందిస్తోందని టెక్ రంగంలో పనిచేస్తున్నవారికి చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా గూగుల్ ఫ్రీ మీల్స్ పాలసీ ప్రాచుర్యం పొందింది. మరి ఎందుకు ఇంతలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
గూగుల్ కంపెనీ ఉద్యోగులకు అందించే ఫ్రీ మీల్స్ చాలా బాగుంటాయని టెకీలు చెబుతుంటారు. మరి ఫ్రీ మీల్స్ పాలసీపై ఎందుకంత పెట్టుబడి పెడుతున్నారనే సందేహానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. సామూహిక భోజనాల సమయంలో కొన్ని అద్భుతమైన ఆలోచనలు పుట్టుకొస్తాయని, ఉద్యోగులు ఆహారాన్ని తీసుకునే వాతావరణం చక్కగా ఉంటే ఆవిష్కరణ ఆలోచనలు పెంపునకు దోహదపడుతుందని పిచాయ్ చెప్పారు.
ఈ విధానం నుంచి లభించే ప్రయోజనం కంటే ఖర్చు చాలా చిన్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఉచితంగా మీల్స్ అందించడం ఆర్థిక భారం కాబోదని స్పష్టం చేశారు. సృజనాత్మకత, సమాజ పురోగతికి దీర్ఘకాలిక పెట్టుబడి ఈ విధానమని అభిప్రాయపడ్డారు. జనాలు అనుకుంటున్నట్టుగా ఫ్రీ మీల్స్ కేవలం ఒక ప్రోత్సాహకం కాదని, మంచి ప్రయోజనాన్ని అందిస్తోందని ఆయన వివరించారు. బ్లూమ్‌బెర్గ్ ‘ది డేవిడ్ రూబెన్‌స్టెయిన్ షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్ ఈ మేరకు ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
తాను గూగుల్‌లో పనిచేసిన తొలినాళ్లలో కేఫ్‌లలో ఇతర ఉద్యోగులను కలుసుకున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఉత్సాహంగా ఉండడాన్ని తాను చాలాసార్లు గుర్తుచేసుకున్నానని ఆయన ప్రస్తావించారు. ఉచిత భోజనాలతో పాటు గూగుల్ ఎంప్లాయి-ఫ్రెండ్లీ కార్యక్రమాలు ఆఫీస్ కార్యకలాపాలను సానుకూలంగా ప్రభావితం చేశాయని పిచాయ్ పేర్కొన్నారు.
ఇక నియామకాలపై మాట్లాడుతూ కంపెనీలో పాత్రను బట్టి ప్రమాణాలు మారుతాయని పిచాయ్ స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ పోస్టుల విషయంలో కొత్త సవాళ్లకు అనుగుణంగా నైపుణ్యాలను కలిగిన ప్రోగ్రామర్లను గుర్తించడం కంపెనీకి చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. సూపర్‌స్టార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కోసం అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు.
కాగా గూగుల్‌కు ప్రపంచవ్యాప్తంగా 1,82,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గూగుల్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వారిలో 90 శాతం మంది ఆఫర్లను అంగీకరిస్తున్నట్టు కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యోగులకు ఉచిత భోజనాలతో పాటు ఆరోగ్య బీమా, సౌకర్యవంతమైన వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్, సంక్షేమ పాలసీలను కూడా అందిస్తోంది. అందుకే టెక్ రంగంలో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. ఇక సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
For more Business News and Telugu News
Updated Date - Oct 22 , 2024 | 03:08 PM