Tata Motors : టాటా మోటార్స్ లాభం మూడింతలు
ABN, Publish Date - May 11 , 2024 | 05:00 AM
మార్చి 31తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి టాటా మోటార్స్ ఏకీకృత నికర లాభం మూడింతలకు పైగా వృద్ధితో రూ.17,528.59 కోట్లకు చేరుకుంది. జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్‌ఆర్) సహా
క్యూ4లో రూ.17,528 కోట్లు
ఒక్కో షేరుకు మొత్తం డివిడెండ్ రూ.6
న్యూఢిల్లీ: మార్చి 31తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి టాటా మోటార్స్ ఏకీకృత నికర లాభం మూడింతలకు పైగా వృద్ధితో రూ.17,528.59 కోట్లకు చేరుకుంది. జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్‌ఆర్) సహా కంపెనీకి చెందిన మూడు వాహన విభాగాలు బలమైన పనితీరు ను కనబరచడం ఇందుకు దోహదపడింది. 2022-23లో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.5,496.04 కోట్లుగా నమోదైంది. కాగా, ఈ క్యూ4లో టాటా మోటార్స్ ఏకీకృత నిర్వహణ ఆదా యం రూ.1,19,986.31 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలానికి దాదాపు రూ.1.06 లక్షల కోట్ల రాబడి నమోదైంది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ రూ.4,37,927.77 కోట్ల ఆదాయంపై రూ.31,806.75 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో సాధారణ షేరుకు రూ.3 తుది డివిడెండ్‌తో పాటు రూ.3 ప్రత్యేక డివిడెండ్ కలిపి మొత్తం రూ.6 డివిడెండ్ చెల్లించాలని టాటా మోటార్స్ బోర్డు సిఫారసు చేసింది. కాగా, ఒక్కో ఏ క్లాస్ ఆర్డినరీ షేరుకు కంపెనీ రూ.3.10 తుది డివిడెండ్, రూ.3.10 ప్రత్యేక డివిడెండ్ కలిపి మొత్తం రూ.6.20 చెల్లించనుంది.
మరిన్ని ముఖ్యాంశాలు..
జనవరి-మార్చి కాలానికి జేఎల్‌ఆర్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధితో 790 కోట్ల పౌండ్లకు చేరుకోగా.. నికర లాభం 140 కోట్ల పౌండ్లకు పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ విభాగం ఆదాయం 27 శాతం వృద్ధితో 2900 కోట్ల పౌండ్లకు, లాభం 260 కోట్ల పౌండ్లకు పెరిగింది. ఈ విభాగానికిదే అత్యధిక వార్షికాదాయం. ల్యాండ్‌రోవర్, డిఫెండర్ మోడళ్లకు బలమైన డిమాండ్ ఇందుకు దోహదపడింది.
టాటా వాణిజ్య వాహనాల విభాగం ఆదాయం క్యూ4లో రూ.21,600 కోట్లకు చేరుకోగా.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.78,800 కోట్లుగా నమోదైంది. జనవరి-మార్చి కాలానికి దేశీయంగా 1,04,600 యూనిట్ల వాణిజ్య వాహన విక్రయాలను విక్రయించినట్లు సంస్థ తెలిపింది.
టాటా ప్రయాణికుల కార్ల విభాగం ఆదాయం క్యూ4లో రూ.14,400 కోట్లు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.52,400 కోట్లుగా నమోదైంది. మార్చి త్రైమాసికంలో వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 14.8 శాతం పెరిగి 1,55,600 యూనిట్లుగా నమోదయ్యాయి.
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆల్‌టైం రికార్డు ఆదాయం, లాభాలను నమోదు చేసింది. కంపెనీ దేశీయ వ్యాపారం ఇప్పుడు రుణరహితంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాలూ రుణరహితంగా మారనున్నాయి. భిన్న వ్యూహాలతో కంపెనీ వ్యాపారాలు బలమైన పనితీరును కనబరుస్తున్నాయి. మున్ముందు సంవత్సరాల్లోనూ ఈ జోరు కొనసాగుతుందని ధీమాగా ఉన్నాం.
- పీబీ బాలాజీ, టాటా మోటార్స్ సీఎ్‌ఫఓ
Updated Date - May 11 , 2024 | 05:00 AM