Hyderabad: ఆన్‌లైన్ కరెన్సీ పేరుతో మోసం.. రూ. 2 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
ABN, Publish Date - Feb 04 , 2024 | 12:25 PM
ఆన్‌లైన్ డిజిటల్ కరెన్సీ పేరుతో అమాయకులను ఆకర్షించి రూ.2 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ల ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు.
- తెలుగు రాష్ట్రాల్లో 200 మంది బాధితులు
- నిందితుడి ఆటకట్టించిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ డిజిటల్ కరెన్సీ పేరుతో అమాయకులను ఆకర్షించి రూ.2 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ల ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. సైబరాబాద్ ఆర్థిక నేరాల(ఈవోడబ్ల్యూ) విభాగం డీసీపీ శనివారం వివరాలు వెల్లడించారు.
బెంగళూరు(Bengaluru)కు చెందిన అవల కొండప్ప వెంకటచలపతి, బీఎన్ కొండప్ప కలిసి గ్జిటోకన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2015లో బెంగళూరులో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎక్స్సీఎస్పీఎల్ డాట్‌కామ్ అనే మోసపూరితమైన వెబ్‌సైట్(Website)ను క్రియేట్ చేశారు. అదే పేరుతో కేపీహెచ్‌బీలో బ్రాంచిని ఏర్పాటు చేశారు. తన ముఠాలో గదిరాజు, రాజేంద్రప్రసాద్ రాజు, గురుప్రసాద్, పాశం వెంకటప్రసాద్, జ్యోతిలను చేర్చుకున్నారు. ఆన్‌లైన్‌లో గో ఫ్లైయాక్స్ ద్వారా ఆన్‌లైన్ కరెన్సీ(ఎక్స్ కాయిన్స్)ని కొనుగోలు చేసి పెట్టుబడులు పెడితే.. మొదటి మూడు నెలలు పెట్టిన పెట్టుబడికి సమానంగా అంటే 1:1, ఆ తర్వాత ఏడాది పాటు 1:4 (నాలుగు రెట్లు) లాభాలు ఇస్తామని ప్రచారం చేసి ఆకట్టుకున్నారు. వారి మాటలు నమ్మి తెలుగు రాష్ట్రాల నుంచి 200 మంది వరకు వారి ద్వారా పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్టర్స్ పెట్టిన డబ్బుకు సమానంగా ఎక్స్ కాయిన్స్ కొనుగోలు చేసినట్లు చూపించారు. ఎక్స్‌కాయిన్స్ విలువ రోజు రోజుకూ పెరుగుతుందని బురిడీ కొట్టించారు. అలా సుమారు రూ. 2 కోట్లు పెట్టుబడుల రూపంలో చేతికి అందిన తర్వాత ఉడాయించారు. నగరానికి చెందిన రాజేంద్రప్రసాద్ వారి మాటలు నమ్మి రూ. 6.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం ‘నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలి’అని గ్జిటో కన్సల్టెన్సీ వారిని కోరగా వారు స్పందించడం మానేశారు. కార్యాలయం మూసేశారు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సీపీ ఆదేశాలతో ఆర్థిక నేరాల విభాగం డీసీపీ కె.ప్రసాద్, ఏసీపీ హుస్సేనీనాయుడు పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బృందం రంగంలోకి దిగింది. ప్రధాన నిందితుల్లో ఒకరైన సతీ్‌షను అరెస్ట్ చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. త్వరలోనే మిగిలిన వారినీ అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు.
Updated Date - Feb 04 , 2024 | 12:25 PM