అంతుపట్టని వింత దేవుడు
ABN, Publish Date - Sep 07 , 2024 | 09:14 AM
మన దేవతలలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి ఆ కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిశిత పరిశీలనకు, మేథస్సుకు సంకేతాలు. ఆ వక్రతుండము, ఓంకార ప్రణవనాదానికి ప్రతీక.
మన దేవతలలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి ఆ కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిశిత పరిశీలనకు, మేథస్సుకు సంకేతాలు. ఆ వక్రతుండము, ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ‘ఆత్మ’లోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం. జగత్తునంతా ఆవరించి ఉన్న మాయాశక్తే ఈ నాగము. నాల్గుచేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్త్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనస్సులను సన్మార్గంలో నడి పించు సాధనాలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే. వ్యాస భగవానుడు మహాభారతం రాయడానికి సంకల్పించి నప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానం కోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో మోదకం (ఉండ్రాయి) ఉంటుంది. కొందరి మతం ప్రకారం అది కపిత్థం (వెలక్కాయ) ఏదిఏమైనా పైన చూస్తే గట్టిదనం లోపల తియ్యదనం ఉండే దనడానికి సంకేతం. గణేశునికి మూడు కళ్ళు, మూడవ కన్ను జ్ఞాననేత్రం. చేటలంత చెవులుమొరలాలించే ఆ దేవుడి ప్రత్యేకతను సూచిస్తాయి. నిజం చెప్పాలంటే- గణేశమూర్తి వినోదకరమేమోగాని సుందరం కాదు. అది కూడా ఒక సంకేతమే.
బాహ్యసౌందర్యానికి అంతర్గత మహోన్నతికి సంబంధంలేదని ఆ రూపం సూచిస్తుంది. వినాయకునికి సంబంధించి ఇంకో ప్రత్యేకతను ఇక్కడ చెప్పుకోవాలి. భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసి ఉంటే క్షమించ మని చెంపలు వేసుకోవడం ఉంది కానీ, వినాయకుని ఎదుట అంత మాత్రం చాలదు. చేసిన తప్పులకు మనకు మనం శిక్ష విధించుకుంటున్నట్లుగా గుంజీలు తీయడం ఆయనంటే మనకున్న భయభక్తులకు గుర్తు. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతాలు కలిగిన అధినాయకుడు మన వినాయకుడే.
Updated Date - Sep 07 , 2024 | 09:14 AM