ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీ విఘ్నేశ్వర దండకం

ABN, Publish Date - Sep 07 , 2024 | 09:46 AM

శ్రీ మన్మహారాజ రాజేశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్‌ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్‌ దేలియాడంగనిన్‌ జేరి యర్చించు భక్తావళిన్‌ సర్వవిఘ్న ప్రకాండంబులన్‌ రూపుమాయించి నానా వరంబుల్‌ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించుచున్నట్టి యో విఘ్నరాజా భవత్పాద మందార మకరంద

శ్రీ మన్మహారాజ రాజేశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్‌ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్‌ దేలియాడంగనిన్‌ జేరి యర్చించు భక్తావళిన్‌ సర్వవిఘ్న ప్రకాండంబులన్‌ రూపుమాయించి నానా వరంబుల్‌ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించుచున్నట్టి యో విఘ్నరాజా భవత్పాద మందార మకరంద మాశించి నానేత్రభృంగంబులీనాడు వ్రాలెన్‌ కారుణ్య సారంబు ప్రసరించి కాపాడగా రమ్ము నీవానిగా నన్ను జేకొమ్ము వేదవేదాంగ వేదాంత సారంబులన్‌ సర్వశాస్త్రార్థ సద్విద్య సందోహముల్‌ నిన్ను మూలంబుగా గౌరవస్థాన మందుంచి పూజించు ముల్లోకమందెవ్వరేమైన సత్కార్య కర్మంబు జేయంగ మున్ముందుగా నీదునామంబు కీర్తించి యర్చింత్రు, నీ నామమే సర్వగీర్వాణ సంపూజ్యమై నిత్య సన్మంగళ ప్రాభవంబై ప్రకాశించు నీ రూపు సేవించి యంభోజ సంజాతుడున్‌ నిర్జరేంద్రుండు నానా విదార్థంబులన్‌ బొంది సంతోషమున్నందు రెల్లప్పుడున్‌ దేవదేవారులున్‌, యక్షగంధర్వ గరుడోరగాదుల్‌ భవన్మాయ దెలియంగ లేకెంతయో విస్మయాంతాత్ములై యుందురో దేవ షాణ్మాతురుండపుడు యుష్మత్‌ ప్రభావంబు శంకించి అవనీతలం బొక్క నిమిషంబులో తివిరి నేవత్తునంచున్‌ మనోవేగ మొప్పారగాబోవ నీవంతలో


భక్తియుక్తండవై శైలరాజేంద్రతనయన్‌ జగన్మాతకున్‌ మందగమనంబుతో జుట్టిరాగా, మహాదేవుడే నీ మహాత్వంబపూర్వంబుగా సుస్థిరత్వంబుగా చాటడామున్ను! రజతాచలేంద్రాగ్ర భాగంబునన్‌ శారదేందుప్రభా భాసితాశావకాశంబునన్‌ సహజ గాంభీర్య గమనంబుతో సంచరింపంగ దర్శించి సనకాది సన్మౌనిబృందంబు పూర్ణేందుబింబంబు నిర్జించు నీ యొక్క మత్తేభవక్త్రంబు నీ గుజ్జురూపున్‌ తదేకంబుగా జూచి యానందమున్‌ బొందదా! తారకానాధుడానాడు సౌందర్యశోభా సమోపేత శృంగార సర్వాంగుడై తన్ను కాంతా సమూహంబు మోహంపు చిరునవ్వుతో మంచి నీరాజనంబుల్‌ సమర్పింపగా అన్నుమిన్నేమియున్‌ గానగాలేక నీ హ్రస్వరూపంబు వీక్షించి నవ్వంగ నా వారిజారిన్‌ భవత్కోపదావాగ్ని కిన్నాహుతిన్‌జేయ నుంకించినన్‌ భీతిచే గర్వమంతన్‌ విసర్జించి దాసోహమంచున్‌ నినున్‌ జేరగా పార్వతీనాధు జూటాగ్ర చూడామణిన్‌ జూచి వర్షవర్షంబునన్‌ భక్తియుక్తంబుగ సర్వపుష్పంబులన్‌, సర్వ పత్రంబులన్‌, ద్రాక్ష,


జంబీర, నారంగ, రంభాది నానాఫలంబుల్‌ సమర్పించి యర్చించు సద్భక్త బృందంబులన్‌, శోభనంబుల్‌ ప్రసాదించి రక్షింతు నంచున్‌ వచింపంగ, నీలదాకాశ మధ్యంబులో నుండి విద్యుల్లతా భాసురాంగుల్‌ నిలింపాగనల్‌ దివ్య ప్రసూనంపు వర్షంబు వర్షించి హర్షింపరా! మోదకాఖాది మూషికారోహణానందలోలుండవై ముమ్మూర్తులన్‌ మూడు లోకంబులన్‌ మంత్రముగ్ధాత్ములన్‌ జేయవానీవు! ద్వారకానాధుడానాడు సత్రాజితున్‌ జేరరావించి నీ ఇంటిలో భానుదత్తం బనావృష్టి వార్యంబుగానున్న మణిరాజమిమ్మన్న, మోమాటమింతైన బాటింపకన్‌ వాడుశౌరిన్‌ తిరస్కార వాక్యంబులన్‌ బల్కె నొక్కింతకాలంబుమీదన్‌ ప్రసేనుండు తమ్ముండు మణిబూని చరియించుచుండంగ కాంతార మధ్యంబులో సింగ మొక్కండు దుష్టోగ్రదంతంబులన్‌ వానికాయంబు గాయంబుగా జేసి వధియింప,


సత్రాజితుండీయదార్థంబు నింతైన గుర్తింపకన్‌ కృష్ణుడే వాని ప్రాణంబులన్‌ దీసి మణిగొన్న వాడంచు దుష్ట ప్రచారంబు గావింపగా, రుక్మిణీవల్లభుండాత్మ చింతించి ‘‘యేపాప మేమాత్ర మెరుగంగలేనైన దుష్కీర్తివాటిల్లె యోపార్వతీపుత్ర యో మేరుగంభీర సద్గాత్ర పాపంబు పుణ్యంబులన్‌, సర్వకర్వంబులన్‌ సాక్షివీవేకదా’’ యంచు ప్రార్థించి, షడ్రసోపేత మృష్టాన్నముల్‌, పంచబక్ష్యంబులన్‌, భక్తినైవేద్యమర్పించి పూజించి, ఘోరాటవిన్‌ బాగుగాలించి గాడాంధకార ప్రపూర్ణంబునై దుర్గమంబై పాదసంచారియై పోయి, యుద్ధంబులో సాటిలేనట్టి మేటిన్‌ మహాకాయు భల్లూకనాధున్‌ కడున్‌నొవ్వగాజేసి మెప్పించి, భానురత్నంబుతో భామతో వచ్చి నిర్ముక్త పాపుండునై కీర్తిధాముండునై యొప్పె భవత్కర్ణ సంచాలనోద్భూత ఝుంఝూనిలం


బస్మదీయంపు పాపౌఘ సంజన్య దురితావళిన్‌ పంచబంగాళ మొనరించు సొంపుతావుల్‌ గుబాళించు పుష్పంబులా లేవు అర్పింప నామస్తకంబీదు చరణంబులందుంచినాడన్‌ భవత్ర్పీతిగా నేలుకోవయ్య యో సిద్ధి గణనాధ సర్వ కార్యర్థసిద్ధిన్‌ ప్రసాదించి రక్షింపుమోదేవ నిన్నెంత కీర్తించినన్‌ తృప్తియేలేదు మాకింత సంసార మోహంబులో నుండి కూపస్థ మండూకలీలన్‌ గృహంబున్‌ విశాల ప్రపంచంబుగా నెంచి నీపాదకంజంబులన్‌ మ్రొక్కి పూజింపగా నిశ్చలత్వంబు శూన్యంబు అజ్ఞాన తిమిరాంధకారంబులో పూర్ణజ్యోతి స్వరూపంపు నీవే కదా మమ్ము దరీజేర్చి గాపాడుమో ఏకదంతా, బృహత్కీర్తిమంతా సదా విఘ్నహర్తా జగత్కార్యకర్తా నమస్తే నమస్తే నమస్తే నమః.

Updated Date - Sep 07 , 2024 | 09:50 AM

Advertising
Advertising