ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీతారాం ఏచూరి లేని భారత రాజకీయం

ABN, Publish Date - Sep 18 , 2024 | 12:55 AM

దాదాపు 15 సంవత్సరాల క్రితం 2009 ఆగస్టు 30న హైదరాబాద్‌లో జరిగిన నా ఇండియా గేట్ పుస్తకావిష్కరణ సభలో నాటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు...

దాదాపు 15 సంవత్సరాల క్రితం 2009 ఆగస్టు 30న హైదరాబాద్‌లో జరిగిన నా ఇండియా గేట్ పుస్తకావిష్కరణ సభలో నాటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు, సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తొలి ప్రతి అందుకున్న ఈ సమావేశంలో ఒకే వేదికపై మూడు విభిన్నమైన భావజాలాలు గల ముగ్గురు ప్రముఖ నేతలు హాజరు కావడం అపూర్వమని ఒక జాతీయ పత్రిక అభివర్ణించింది. జైపాల్, వెంకయ్య, సీతారాం ఏచూరి మంచి స్నేహితులు. పార్లమెంట్‌లోనూ, బయటా ముగ్గురూ ఘర్షించుకున్నా, తటస్థ పడినప్పుడు స్నేహపూర్వకంగా పలకరించుకునేవారు. 15 సంవత్సరాల క్రితం జరిగిన ఇలాంటి పరిణామాన్ని ఇప్పుడు దేశంలో ఎక్కడైనా ఊహించుకోగలమా? దేశంలో మూడు సైద్ధాంతిక భావజాలాల మధ్య సంఘర్షణే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని సీతారాం ఏచూరి ఆనాడు పుస్తకావిష్కరణ సభలో అన్నారు. ఇవాళ సీతారాం ఏచూరి మన మధ్య లేరు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మూడవ భావజాలం కూడా తీవ్ర సంక్షోభంలో ఉంది. సిద్ధాంతాలకు అతీతంగా ఆయన రాజకీయ నేతల మధ్య నెలకొల్పిన స్నేహపూరిత వైఖరి కూడా ఇవాళ పూర్తిగా మృగ్యమైంది.


వర్తమాన సామాజిక చరిత్రలో భాగంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలు దేశ రాజకీయాల పరిణామాల్ని నిర్దేశించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా సీతారాం ఏచూరి మరణాన్ని కేవలం ఒక వ్యక్తి మరణంగా కొట్టిపారేయలేము. వామపక్ష పార్టీలు మనుగడకోసం తీవ్ర యత్నాలు చేస్తున్నప్పటికీ సీతారాం ఏచూరి దేశ వ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ భావజాలం వ్యాపించేందుకు, దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక కీలక అంశాలపై చర్చ జరిగేందుకు దోహదం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ప్రతిఘటించి బీజేపీయేతర పక్షాలను సంఘటితం చేసేందుకు శక్తి యుక్తులొడ్డారు. ‘కాంగ్రెస్ వామపక్షాల ప్రభావంతో పనిచేస్తోంది’ అని మోదీ విమర్శించేంతగా ఆయన కాంగ్రెస్‌కు దిశానిర్దేశం చేశారు. సీతారాం ఏచూరితో తాను ఎన్నో సుదీర్ఘ సంభాషణలు చేసేవాడినని రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. పదేళ్ల తర్వాత మోదీ హయాంలోని బీజేపీ సంఖ్యాబలం తగ్గి, ఇండియా కూటమి బలోపేతం కావడంలో సీతారాం ఏచూరి పాత్రను ఎవరూ విస్మరించలేరు. ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా సీతారాం ఏచూరి పనిచేసిన ఆయన కార్యాచరణ గురించి ఆయనను దగ్గరినుంచి గమనించిన వారికి అర్థమవుతుంది. ఇప్పుడే కాదు. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో కూడా ఆయన కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వం అందుకు అనుగుణంగా నడుచుకునేలా చేశారు. నాడు పెట్రోలు ఒక్క రూపాయి పెంచాలన్నా మొత్తం యునైటెడ్ ఫ్రంట్‌లో భాగస్వామ్య పార్టీల నేతలు చర్చించుకునేవారంటే ఏచూరి, తదితరులు అనుసరించిన ప్రజాస్వామిక, సమాఖ్య స్ఫూర్తే కారణం.


ఏచూరి ఆలోచనా విధానానికి ఆయన పార్టీ పూర్తిగా సహకరించిందా లేదా అన్నది చర్చనీయాంశం. 2008లో అణు ఒప్పందానికి వ్యతిరేకంగా మద్దతు ఉపసంహరించుకునేందుకు తొందరపడవద్దని అప్పుడు అమెరికాలో ఉన్న సీతారాం ఏచూరి చెప్పినా పార్టీ అంగీకరించలేదు. కనీసం తాను అమెరికా నుంచి తిరిగి వచ్చేంతవరకైనా వేచి చూడమని సీతారాం ఏచూరి చేసిన అభ్యర్థనను పార్టీ తిరస్కరించి యూపీఏ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకోవడమే కాక ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని నిర్ణయించుకుంది. కాని ములాయంసింగ్ యాదవ్ వంటి నేతలు సహకరించకపోవడంతో సీపీఐ(ఎం) ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వామపక్షాలు తీవ్రంగా నష్టపోయాయి. తమ నిర్ణయం సరైనదేనని, తాము వామపక్షాల మధ్య ఐక్యత సాధించి, కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్‌ను బలోపేతం చేస్తామని నాటి ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రకటించారు. అయితే తాము అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం సరైనదేకాని, మద్దతు ఉపసంహరించుకోవడం తప్పేనని సీతారాం ఏచూరి 2015లో తాను ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత అంగీకరించారు. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో 1996లో అప్పటి ముఖ్యమంత్రి జ్యోతి బసును ప్రధానమంత్రి కాకుండా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ అడ్డుపడింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా నాడు కర్ణాటక భవన్‌లో సమావేశమైన చంద్రబాబు, దేవెగౌడ, ములాయంసింగ్ యాదవ్, లాలూ తదితరులు పార్టీని కోరినా అందుకు అంగీకరించలేదు. ఇది ఒక చారిత్రక తప్పిదమని, తాను ప్రధానమంత్రి అయితే అనేక ప్రజానుకూల చర్యలు తీసుకునేవాడినని జ్యోతి బసు స్వయంగా ఆ తర్వాత ప్రకటించారు. బహుశా దేవెగౌడ బదులు జ్యోతిబసు ప్రధాని అయితే కాంగ్రెస్ యునైటెడ్ ఫ్రంట్ సర్కార్‌ను పడగొట్టేందుకు తొందరపడేది కాదేమో.. అన్న చర్చ కూడా తర్వాతి కాలంలో జరిగింది. అదే విధంగా యూపీఏ ప్రభుత్వానికి 2008లో సీపీఐ(ఎం) మద్దతు ఉపసంహరించుకోకుండా ఉంటే, 2009–-14 మధ్య యూపీఏ సర్కార్ హయాంలో కుంభకోణాలు, అవినీతి కార్యకలాపాలు జరగకుండా సీపీఐ(ఎం) దిశానిర్దేశం చేసేదేమో అన్న చర్చ కూడా జరిగింది.


సీపీఐ(ఎం) మద్దతు ఉన్న కాలంలో యూపీఏ తొలిదశ ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ రాలేదు. సీపీఐ(ఎం) నిర్దేశకత్వం లేనందువల్లే యూపీఏ ప్రభుత్వం రకరకాల ఆరోపణలకు గురై ప్రజాదరణను కోల్పోయి నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ ఘనవిజయం సాధించడం జరిగిందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. తద్వారా కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు కూడా దేశంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. మళ్లీ ఏచూరి లైన్ మూలంగానే బీజేపీయేతర పక్షాలు ఇప్పుడిప్పుడే బలం పుంజుకోవడం ప్రారంభించాయి.

ఏచూరి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ ఆయన రాజకీయ జీవితం అంతర్గతంగా సాఫీగా సాగలేదు. ఆయన ఆలోచనలకు, తీసుకోదలచిన నిర్ణయాలకూ పార్టీ పోలిట్ బ్యూరోలో చుక్కెదురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విశాఖపట్టణం, హైదరాబాద్‌లో ఆయనను ప్రధాన కార్యదర్శిగా కాకుండా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఆయన మూడవసారి రాజ్యసభకు ఎన్నిక కాకుండా పార్టీ బలంగా అడ్డుపడింది. దాదాపు పది సంవత్సరాలు రాజ్యసభలో చేసిన అద్భుత ప్రసంగాలు, మోదీ ప్రభుత్వంపై చేసిన బలమైన విమర్శలు, ప్రతిపక్షాల ఐక్యతకోసం ఆయన చేసిన ప్రయత్నాలు తెలిసిన వారికి రాజ్యసభలో ఆయన లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడింది. ‘ఏం చేస్తాం.. మావాళ్లే నన్ను రానివ్వడం లేదు’. అని సెంట్రల్ హాలులో ఆయన బాధపడుతూ చెప్పిన దృశ్యం ఇంకా మరిచిపోలేనిది. ‘బీజేపీయేతర ఫ్రంట్‌ను బలోపేతం చేసేందుకు మేము చేసిన ప్రయత్నాలు కొంత విజయవంతం అయ్యాయి కాని సీపీఐ(ఎం)ను బలోపేతం చేసేందుకు ఇక నేను తీవ్రయత్నాలు చేయాల్సి ఉన్నది..’ అని ఏచూరి తన చివరి ఇంటర్వ్యూలో అన్నారు. తన ప్రయత్నాలు నెరవేరకముందే ఆయన కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఏచూరి తర్వాత బాధ్యతలు స్వీకరించే నేత సీపీఐ(ఎం)ను బలోపేతం చేయగలరా. ఏచూరి లాగా సమర్థంగా బీజేపీయేతర పక్షాలను ఏకం చేసి ఒక సైద్ధాంతిక దిశా నిర్దేశం చేయగలరా అన్న సందేహం నెలకొన్నది.


సీతారాం ఏచూరి మరణంతో పాటు ఇటీవలి కాలంలో జరిగిన ముఖ్యమైన పరిణామాల్లో ఒకటి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడవ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకోవడం. మొదటి రెండు ప్రభుత్వాలు వందరోజులు పూర్తి చేసుకున్న తర్వాత కనపడిన ఉత్సాహకరమైన సన్నివేశాలు ఇప్పుడు అంతగా కనపడడం లేదు. అప్పుడు బీజేపీ ఒక్కటే తన ఢంకా తాను భజాయించుకుంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ నేతలే ఎక్కువగా ఉత్సాహం కనపరుస్తున్నారు. వందరోజులు పూర్తవుతుండగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 74న పుట్టిన రోజును పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. ఆయన 75 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయంలోపు అనేక కీలక రాజకీయ పరీక్షలను ఎదుర్కోనున్నారు. హర్యానా, జమ్ముకశ్మీర్, ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం అంత సులభంగా కనపడడం లేదు. గత పదేళ్లుగా కనపడ్డ మోదీ ముద్ర, ప్రభావం ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాల్లో అంత బలంగా గోచరించడం లేదు. ఈ అయిదు రాష్ట్రాల్లో బీజేపీ తన సత్తా చూపకపోతే ఏమి జరుగుతుందన్న విషయంలో బీజేపీలోనే అంతర్గత చర్చ జరుగుతోంది. బీజేపీ మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ ఈ సారి ఆయన ప్రతి చర్యలను నిశితంగా గమనిస్తోంది.


‘నేను గణేశ్ పూజలో పాల్గొంటే కూడా కాంగ్రెస్ విమర్శిస్తోంది..’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఒడిషాలో వాపోయారు. మోదీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో గణేశ్ పూజకు హాజరయినందుకు ప్రతిపక్షాలు విమర్శించాయి. భారత ప్రధాన న్యాయమూర్తి నివాసంలో గణేశ్ పూజకు ప్రధానమంత్రి హాజరు కావడం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రశ్నార్థకం చేసిందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో పాటు అనేక మంది న్యాయనిపుణులు విమర్శించారు. మరో రెండునెలల్లో పదవీవిరమణ చేస్తున్న జస్టిస్ చంద్రచూడ్ కూడా జస్టిస్ గొగోయ్ లాగే నామినేటెడ్ కోటాలో రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘మన మధ్య స్నేహ పూర్వక సంబంధాలు ఉండాలి’ అని ఒకప్పుడు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్యతో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు ఒక కార్యక్రమంలో అన్నారు. ‘మన రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ స్నేహ సంబంధాలకు ఆస్కారం లేదు. అవి తమ పాత్రను సరిగ్గా నిర్వహించాలి కాని స్నేహ పూర్వకంగా కాదు’ అని జస్టిస్ వెంకటాచలయ్య పీవీకి స్పష్టం చేశారు! కాని తర్వాతి కాలంలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వం తమ మధ్య ఉండాల్సిన లక్ష్మణ రేఖను తామే తొలగించుకుంటున్నాయేమోనన్న అనుమానాలు తీవ్రతరమయ్యాయి. మోదీ, చంద్రచూడ్‌ల భేటీ ఇందుకు తాజా నిదర్శనం.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Sep 18 , 2024 | 12:55 AM

Advertising
Advertising