ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివాదంలో మదురో హ్యాట్రిక్‌

ABN, Publish Date - Aug 03 , 2024 | 01:16 AM

దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నికోలస్‌ మదురో మూడోసారి అధ్యక్షుడిగా గెలిచారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, మదురో గుప్పిట్లో ఉన్న ఎన్నికల సంఘం యాభైఒక్కశాతం ఓట్లు వచ్చాయంటూ తప్పుడు లెక్కలు రాసి విజేతగా ప్రకటించిందని ఆయన ప్రత్యర్థులు ఆగ్రహాన్ని ప్రకటించారు.

దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నికోలస్‌ మదురో మూడోసారి అధ్యక్షుడిగా గెలిచారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, మదురో గుప్పిట్లో ఉన్న ఎన్నికల సంఘం యాభైఒక్కశాతం ఓట్లు వచ్చాయంటూ తప్పుడు లెక్కలు రాసి విజేతగా ప్రకటించిందని ఆయన ప్రత్యర్థులు ఆగ్రహాన్ని ప్రకటించారు. బరిలో ఎనిమిదిమంది అభ్యర్థులున్నా, పోటీ ప్రధానంగా మదురో–విపక్ష అభ్యర్థి ఎడ్మండ్‌ గొంజాలెస్‌ మధ్య సాగింది. గొంజాలెస్‌ను విజేతగా ప్రకటించనంతవరకూ దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు, విధ్వంసాలు ఆగవని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్యన అమెరికా గురువారం గొంజాలెస్‌ను విజేతగా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ ప్రకటన ద్వారా మదురోమీదా, అక్కడి ఎన్నికల సంఘం మీదా నైతికమైన ఒత్తిడి తెచ్చారనీ, విపక్షానికి బలం చేకూర్చారని కొందరు వాదిస్తుంటే, వెనెజువెలా ఎన్నికల్లో వేలుపెట్టడం కంటే, అల్లకల్లోలంగా ఉన్న అమెరికా ముందు తన ఇల్లుచక్కబెట్టుకోవడం మంచిదని మదురో గట్టిగా ఓ హెచ్చరిక చేశారు.

మదురోకు 51శాతం, గోంజాలెస్‌కు 44శాతం ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం చేసిన ప్రకటనలో కుట్ర ఉన్నదని అందరూ నమ్ముతున్నారు. బూత్‌స్థాయి ఓటింగ్‌ డేటాతో ప్రతీ వివరమూ బహిర్గతం చేయాలని విపక్షనేతలు డిమాండ్‌ చేస్తుంటే, దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని రంగంలోకి దించి తన ఎన్నికకు ఆమోదముద్రవేయించుకోవాలని మదురో చూస్తున్నారు. విపక్ష అభ్యర్థిని విజేతగా అమెరికా ప్రకటించడానికి కొద్దిగంటల ముందు మదురో ట్విటర్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఈ అనవసరపు బెదిరింపులు ఆపి, వెనెజువెలా సార్వభౌమత్వాన్ని అమెరికా గౌరవించినపక్షంలో దానితో చర్చలకు తాను సిద్ధమన్నారు. దేశంలో ఎన్నికలు జరిగితే ఆంక్షలు ఎత్తివేస్తానని గత ఏడాది అమెరికా హామీ ఇచ్చిన మేరకు దాని ప్రాతిపదికగా ఈ చర్చలు జరగాలన్నారు. ఖతార్ వేదికగా జరిగిన ఈ చర్చల అనంతరం, గణనీయమైన చమురు నిల్వలున్న వెనెజువెలా తిరిగి ప్రపంచ చమురు వాణిజ్యంలోకి అడుగుపెడుతుందని అధికులు విశ్వసించారు. 2017, 2019లలో అమెరికా ఆంక్షలు విధించడానికి ముందువరకూ భారత్‌ దిగుమతి చేసుకొనే మొత్తం చమురులో వెనెజువెలా వాటాయే గణనీయంగా ఉండేది. కానీ, ఆ తరువాత ఆంక్షల కారణంగా చమురు దిగుమతులు నిలిచిపోయాయి.


అధ్యక్ష ఎన్నికలు సక్రమంగా, సవ్యంగా జరుగుతాయన్న మదురో హామీ మేరకు, విపక్షాలతో కుదిరిన సయోధ్య నేపథ్యంలో గత ఏడాది అమెరికా కొన్ని నియమనిబంధనలను సడలించింది. ఉక్రెయిన్‌ యుద్ధం కూడా ఈ నిర్ణయానికి దోహదం చేసింది. దీనితో భారీ ముడిచమురు దిగుమతులతో, యూరప్‌కు శుద్ధి చేసిన చమురు ఎగుమతులతో భారత్‌ గణనీయంగా లబ్ధిపొందింది. గత ఏడాది వెనెజువెలానుంచి భారత్‌ దిగుమతి చేసుకున్న ముడిచమురులో 90శాతం వాటా రిలయెన్స్‌దేనని అంటారు. చవుకగా కొని, గుజరాత్‌లో శుద్ధిచేసి, లాభం ఉన్నచోటకు ఎగుమతిచేయడమనే ప్రక్రియ సవ్యంగా జరుగుతున్న తరుణంలో మళ్ళీ మొన్న ఏప్రిల్‌లో ఆంక్షలు వచ్చిపడ్డాయి. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తానన్న ఒప్పందానికి అనుగుణంగా మదురో చర్యలు లేవంటూ అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడంతో, వెనెజువెలానుంచి మళ్ళీ భారత్‌కు చమురు దిగుమతులు నిలిచిపోయాయి. అమెరికా ట్రెజరీ విభాగానికి రిలయెన్స్‌ దరఖాస్తు చేసుకుందనీ, ఇటీవలే దిగుమతులకు అనుమతులు సైతం లభించాయని వార్తలు వచ్చాయి. అధ్యక్ష ఎన్నికల ఫలితాల చుట్టూ ప్రస్తుతం సాగుతున్న వివాదం మన ముడిచమురు దిగుమతులకు ఆటంకం కలిగించకపోవచ్చును కానీ, ఈ సంక్షోభం సాధ్యమైనంత వేగంగా పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. రష్యా, చైనా మదురో పక్షాన నిలుస్తూ, పలు లాటిన్‌ అమెరికన్ దేశాలు చెరోవైపూ చీలిపోయిన ఈ సందిగ్ధస్థితి సడలాలంటే మదురో ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోవాలి. తన మిత్రదేశాలైన మెక్సికో, బ్రెజిల్‌, కొలంబియా సైతం ఎన్నికల సంఘం పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరుతున్న విషయాన్ని ఆయన విస్మరించకూడదు.

Updated Date - Aug 03 , 2024 | 01:16 AM

Advertising
Advertising
<