మానసిక యుద్ధం, ముందస్తు విజయాలు
ABN, Publish Date - Feb 22 , 2024 | 05:24 AM
ఎన్నికల వేళ జనం మనసులో ఏమున్నదో తెలియదంటారు కానీ, మరీ అంత తెలియకుండా పోదు. రాజకీయ నాయకులలాగా ఓటర్లు తమ మనోభావాలు దాచిపెట్టుకుని నటించలేరు. గొట్టాలు పెట్టి,...
ఎన్నికల వేళ జనం మనసులో ఏమున్నదో తెలియదంటారు కానీ, మరీ అంత తెలియకుండా పోదు. రాజకీయ నాయకులలాగా ఓటర్లు తమ మనోభావాలు దాచిపెట్టుకుని నటించలేరు. గొట్టాలు పెట్టి, ఓటెవరికో చెప్పమంటే చెప్పరు కానీ, ముఖకవళికలు చదవగలిగేవారు అంతరంగాలను గ్రహించగలరు. కాకపోతే, ఎటువైపు మొగ్గు ఎంతెంత అన్న పరిమాణాల అంచనాలోనే సర్వేవీరులు సఫలమో విఫలమో అవుతుంటారు.
పాత్రికేయులు, పరిశీలకులు పసిగట్టగలిగే నాడి, జనంతోనే ఉండే నాయకులకు అందదా? అందుతుంది, కానీ, అంగీకరించరు. తన రేటింగ్ తగ్గిందని సిటింగ్ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు తెలుస్తుంది, కానీ ఒప్పుకోబుద్ధి వేయదు. ఎదురులేదని చెవుల్లో హోరెత్తే భజనల్లో హితవాక్యాలు వినిపించవు. క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులకే అట్లా ఉంటే, రాష్ట్ర నేతలకు ఎట్లా ఉంటుంది? కోటలాగా కమ్ముకున్న కోటరీ, జయజయధ్వానాలను తప్ప అపశబ్దాలను దగ్గరికి కూడా రానివ్వదు కనుక, చాపకింద నీరు అసలే తెలియదు.
కేసీఆర్ విషయంలో అలానే జరిగింది. జనంలో వ్యతిరేకత అంత గగ్గోలుగా ఉంటే కూడా, ఆయనకు వినపడలేదు. లేదా, వినిపించుకోలేదు. ఇప్పుడు జగన్ సంగతీ అంతే. కాళ్ల కింద నేల జారిపోతున్నా, వాస్తవం తలకెక్కడం లేదు. ఓటమి పర్యవసానాలంటే భయం లేకపోలేదు, కానీ, తన సొంత బటన్ సంక్షేమం మీద అపారమైన నమ్మకం. కండబలం మీద మంద బలం మీద విశేషమైన గౌరవం. తన గెలుపునకు భరోసా లేదన్న ధీమాతో ఊహలలో తేలిపోతున్నారు. తప్పుల మీద తప్పులు చేసి, అధికారాంతం కోసం ఆవురావురుమంటున్నారు. మరోపక్క, అపజయభయంతో పత్రికల మీద, పాత్రికేయుల మీద దాడులకు తెగబడుతున్నారు. ఉత్తరాది తరహాలో మూకలను ఉసిగొల్పుతున్నారు. సర్వశక్తిమంతులమని భ్రమపడే ఇటువంటి నాయకుల వల్ల అనేక సమస్యలున్నా, జనానికి ఒక సదుపాయం కూడా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల మనసులో మాట తమ చెవి సోకకుండా, తగిన జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి, చాపకిందనీరులా ప్రజలు తమ అభీష్ఠాన్ని నెరవేర్చుకోవచ్చు.
ఏదైనా పక్షానికి గెలుస్తామన్న ధీమా, అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు సానుకూలంగా పనిచేస్తుంది కూడా. యుద్ధం అన్ని వేళలా, భౌతికంగానే ఉండదు. ప్రత్యక్ష యుద్ధానికి ముందు పరోక్ష యుద్ధం ఉంటుంది, మరో పక్క మానసిక యుద్ధం ఉంటుంది. ఉత్సాహం మీద ఉన్న పక్షానికి, విజయం ఖాయమనే నమ్మకం అదనపు బలాన్ని ఇస్తుంది. ఇతర అంశాలు అనుకూలంగా ఉంటే, ఈ అదనపు బలం విజయానికి చేరువ చేస్తుంది. ఏ పక్షమూ కూడా తను ఓడిపోతానని అనుకోదు. తనకు తాను విజయోత్సాహాన్ని, ప్రత్యర్థులకు అపజయ భావాన్ని కలిగించడమే మానసిక యుద్ధం లక్ష్యం.
జాతీయస్థాయిలో చూస్తే, తాను గెలవడం నూటికి నూరుపాళ్లు, నిస్సందేహమైన పరిణామం అన్నట్టు భారతీయ జనతాపార్టీ ధీమాగా ఉంది. సొంతంగా 370 అందుకుంటామా లేదా, మిత్రులతో కలసి 400 దాటతామా లేదా అన్నదే తప్ప, మరో చింత తనకు లేదని ఆ పార్టీ చెబుతోంది. ఇక, తిరుగులేని అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, జాతీయ మీడియా అంతా అదే చాటింపు వేస్తోంది. ఇది మొత్తంగా ఎన్నికల వాతావరణాన్ని ముందే ఫలితం నిర్ణయమైపోయిన క్రీడ లాగా మార్చేసింది. బీజేపీ కూటమి 400 దాటడం అసాధ్యం అంటారు ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకుడు మల్లికార్జున ఖర్గే. ఆయన మాటల్లో కూడా ‘‘మీదే గెలుపు ఒప్పుకుంటున్నాము కానీ, అన్ని సీట్లు మాత్రం రావు’’ అన్న ధోరణే వినిపించింది. నాలుగువందలు మాకు వస్తాయో రావో కానీ, మీరు మాత్రం 40 కంటె ఎక్కువ తెచ్చుకోవాలని కోరుకుంటున్నా.. అని నరేంద్రమోదీ కాంగ్రెస్‌ను ఉద్దేశించి చెణికారు. ఇప్పుడు 40కీ 400కీ నడుమ యుద్ధమన్నమాట. తాను చేస్తున్న తప్పు అర్థమై ఖర్గే తాజాగా, బీజేపీకి 100 సీట్లు కూడా రావని అన్నారు కానీ, అది బక్క కోపంతో అన్న మాటల్లాగే వినిపించాయి.
ఘనవిజయం సాధిస్తున్నా అని మోదీ పరివారం అనుకుంటున్నట్టుగానే, ఓడిపోతున్నాం అని ప్రతిపక్ష శిబిరమూ అనుకుంటోంది. ఇప్పుడు కాదు, మేం 2029లో చూసుకుంటాం అని కేజ్రీవాల్ అంటున్నారు. ఇంకో వైపున ఒకనాటి కాంగ్రెస్ అగ్రనేతల వారసులు బీజేపీలోకి దూకేస్తున్నారు. కశ్మీర్ నాయకులు అర్ధరాత్రులు అధికార భవనాల్లో తచ్చాడుతున్నారని గులాం నబీ ఆజాద్ అంటున్నారు కానీ, దేశవ్యాప్తంగా వీరాధివీర ప్రతిపక్ష నేతలు అదే పని చేస్తున్నారు.
సాధారణ ఎన్నికల మానసిక యుద్ధరంగం ఒకవైపే మొగ్గి ఉంది నిజమే కానీ, మరి ఓటర్లు కూడా నిజంగా అటే ఉన్నారా? ఒక వార్తాసంస్థ జరిపిన సర్వేలో తెలంగాణలో 34 శాతం మంది ప్రధానిగా మోదీని ఇష్టపడుతుంటే, 23 శాతం మాత్రమే రాహుల్ గాంధీని కోరుకుంటున్నారట. మరి, తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ కంటె ఎక్కువ ఎంపీ సీట్లు గెలవబోతోందా? యాభైశాతం దాకా మోదీ ప్రభుత్వం పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్టు చెప్పారు, మరి వాళ్లంతా బీజేపీకి ఓట్లు వేస్తారా? ఈ దేశంలో ఓటింగ్ సరళి ఇంకా ప్రాంతీయ ఆలోచన ద్వారానే వ్యక్తమవుతోంది. ఎవరూ నేరుగా ప్రధానిని ఎన్నుకోరు. ఉత్తరాదిలో అనేక రాష్ట్రాలలో బీజేపీ ప్రాబల్యం కారణంగానే జాతీయస్థాయిలో ఆ పార్టీకి ఆధిక్యం లభిస్తోంది తప్ప, జాతీయ ప్రాధాన్యాల ఎంపికనుంచి కాదు. అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు కావాలని బీజేపీ కోరుకునేది అందుకే, ప్రాంతీయ, జాతీయ అద్వైతం సాధించవచ్చునని. రాష్ట్ర స్థానికతలను అధిగమించే బాధ్యతను రామాలయ ప్రచారం తీసుకోగలదని ఆ పార్టీ ఆశిస్తోంది. బహుశా, అందులో అది కొంతవరకు విజయం సాధించేటట్టే ఉంది.
తమకిక ఓటమే ఖాయమని అనుకునేటట్టయితే, ప్రతిపక్ష కూటమికి పోరాడే చేవనే ఉండబోదు. ఎంతో కొంత ప్రతిఘటన ఇవ్వాలని, కనీసం అనుకున్న సంఖ్య అందకుండా చూడాలని ప్రతిపక్ష శ్రేయోభిలాషులు సమాధానపడవచ్చును కానీ, ప్రతిపక్షాలు మాత్రం గెలవగలమనే అనుకోవాలి. ఏ ధైర్యంతో రెండు రాష్ట్రాల రైతులు ఢిల్లీలో బైఠాయించి, తమ గొంతు వినిపిస్తున్నారు? కేంద్రం వివక్ష మీద ఢిల్లీ పౌరులతో ఉద్యమిస్తానని కేజ్రీవాల్ ఎందుకు ఆలోచన చేస్తున్నారు? అన్ని చోట్లా వీగిపోయిన కాంగ్రెస్ పొత్తు ఉత్తరప్రదేశ్‌లో ఎందుకు సఫలమయింది? అన్ని చీలికలు, ఫిరాయింపులు జరిగి, అనేక ఉద్రిక్తతలను అనుభవించి, చివరకు మరాఠా రిజర్వేషన్లను సాధించి కూడా మహారాష్ట్ర సమాజం ఎందుకు అంత గుంభనంగా ఉన్నది? మరీ దేశం అంత ఎడారిగా మారలేదు! దేవుణ్ణి మెచ్చినంతమాత్రాన, ప్రజలు రాజునీ మెచ్చాలని ఏమీలేదు! తలచుకుంటే జనం తమ విచక్షణతో అందరినీ ఆశ్చర్యపరచవచ్చు!
జనహృదయంలో ఏకపక్షంగా ఘనవిజయాలు అందించే ఆలోచనలేవీ ఉన్నట్టు కనిపించకపోవడం వల్లనే ఢిల్లీ వ్యూహకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ లాగా, జగన్ లాగా ముంచుకు వస్తున్న ముప్పును చూడకుండా కళ్లు మూసుకోవడం లేదు. ఓట్ల కుంభవృష్టి కురుస్తుందని పైకి చెబుతూనే, ఒక్క చినుకూ వృథాపోకుండా పట్టుకోవాలని చూస్తున్నారు. అంకెలలో ఎవరు అధికులో వారికే అధికారం వస్తుంది నిజమే కానీ, ఈ సారి అనేక పవనాలు, అనేక వెల్లువలు భారతీయ సమాజంలో ప్రసరిస్తున్నాయేమో, ప్రవహిస్తున్నాయేమో అనిపిస్తుంది. తమను అతిగా ప్రభావితం చేసి, అభిమతాలను దారి మళ్లించాలనుకునే ధోరణులకు పగ్గం వేసే లక్షణం ఏదో మన రాజకీయ ఎంపికలకు ఉండవచ్చునన్న ఆశ కలుగుతుంది. ఇది ఒక ధోరణికి వ్యతిరేకతో, మరొకదానికి అనుకూలతో కాదు, అన్నీ తానై ఆక్రమించుకునే బాహుబలి తత్వాన్ని నిరాకరించే ప్రజాస్వామికత.
మరో రెండువారాల్లో ఎన్నికల రంగస్థలం అవతరిస్తుంది. ఆ తరువాత చేయలేని అనేక పనులు ఈ లోగా జరిగిపోతాయి. అనేక రాజకీయ కథనాలు సామాజిక మాధ్యమాల ద్వారా, ప్రధాన మీడియాద్వారా ప్రజల మీదకు దాడిచేస్తాయి. జనం చూపును, శ్రవణశక్తిని, విచక్షణను అనునయించే, భ్రమపెట్టే, గందరగోళపరిచే అనేక విన్యాసాలు విజృంభిస్తాయి. ప్రజల ఎంపికల మీద సంధించే ఆఖరి అస్త్రం డబ్బు. ఈ సాధారణ ఎన్నికలు దేశానికి ఎంతో ముఖ్యమని, భయరహితమైన భవితవ్యానికి ఎంతో కీలకమని గుర్తింపు పెద్దగా లేకుండానే అశేషజనం ఈ ప్రక్రియలో పాల్గొంటారు. కానీ చైతన్యవంతులైన అతికొద్ది మంది మాత్రమే కాలాన్ని మలుపు తిప్పే ప్రయత్నం చేస్తారు.
కె. శ్రీనివాస్
Updated Date - Feb 22 , 2024 | 05:24 AM