Height: 18 ఏళ్లు దాటాక కూడా ఎత్తు పెరగొచ్చా? సైన్స్ ఏం చెబుతోందంటే..
ABN, Publish Date - Dec 05 , 2024 | 07:11 AM
18 ఏళ్ల తరువాత పొడవు పెరుగుతారా అనే ప్రశ్నకు వైద్యులు సవివరమైన సమాధానం చెప్పారు. మరి అదేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: మంచి పొడవున్న వారు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తామున్న పొడవు కంటే మరికాస్త ఎత్తు పెరిగితే బాగుండని కోరుకుంటారు. పోషకాహారం, కసరత్తులు వంటివి పిల్లలు ఎత్తు పెరిగేలా చేస్తాయి. అయితే, కాస్త పెద్దయ్యాక కూడా పొడవు పెరిగే అవకాశం ఉందో? లేదో తెలుసుకునేందుకు ఇప్పటికే పలు అధ్యయనాలు జరిగాయి.
నిపుణులు చెప్పేదాని ప్రకారం, ఎత్తు పెరగడమనేది 60 - 80 శాతం వరకూ జన్యుపరమైన అంశాలే కారణం. ఇది పుట్టుకతోనే నిర్ధారణ అవుతుంది కాబట్టి ఈ అంశంలో వైద్యశాస్త్రం చేయగలిగిందేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. మిగతా 20 - 40 శాతం మాత్రం మన చేతుల్లోనే ఉందని అంటున్నారు. అయితే, చాలా మంది 18 ఏళ్లు దాటాక పొడవు పెరగరు (Health).
Thirst: ఎంత నీరు తాగుతున్నా దాహంగా ఉంటోందా? కారణాలు ఇవే!
13 లేదా 14 ఏళు వచ్చే వరకూ పిల్లలు ఏటా సగటున 2 అంగుళాల ఎత్తు పెరుగుతారు. ఆ తరువాత 18 ఏళ్ల వచ్చే వరకూ ఎత్తు ఏటా 4 శాతం మేర పెరుగుతుంటుంది. ఆ తరువాత ఇక ఎత్తు పెరగరు. మనుషులు ఎత్తు పెరగడానికి ప్రధాన కారణం.. చేతులు, కాళ్లల్లోని ఎముకల పొడవు పెరగడమే. ఈ ఎముకల రెండు వైపులా గ్రోత్ ఫ్లేట్స్ అనే భాగాలు ఉంటాయి. ఈ ప్లేట్స్ పొడవు అవుతున్నంత కాలం పిల్లలు ఎత్తు పెరుగుతారు. 14 ఏళ్లు వచ్చే వరకూ శరీరంలో హార్మోన్ మార్పుల కారణంగా గ్రోత్ ప్లేట్స్ క్రియాశీలకంగా ఉంటాయి. ఫలితంగా ఎముకలు పొడవు పెరుగుతాయి. 14 ఏళ్ల తరువాత జరిగే మార్పుల కారణంగా గ్రోత్ ప్లేట్స్ క్రమంగా గట్టిపడటం ప్రారంభమవుతుంది. దీంతో ఎముకల ఎత్తు పెరగదు. మనిషి పొడవు పెరగడం కూడా నిలిచిపోతుంది. బాలికల్లో 14 ఏళ్ల తరువాత, మగపిల్లల్లో 14 నుంచి 19 ఏళ్ల మధ్య గ్రోత్ ప్లేట్స్ ఎదగడం నిలిచిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
అయితే, ఎత్తు తక్కువగా ఉన్న వారి ముందు కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 18 -19 ఏళ్ల మధ్య కొద్దిగా పొడవు పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ కీలక సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుగా పోషకాహారం తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న ఆహారం తినాలి. ఎములక ఎదుగుదలకు కీలకమైన విటమిన్ డీ, కాల్షియం ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఆయా కాలాల్లో లభించే పళ్లు, కూరగాయలు తింటే పొడవు పెరిగే అవకాశాలు మెరుగవుతాయి.
Turmeric In Winter: చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు!
ధూమ పానం ఎత్తు పెరగడంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఓ అధ్యయనం ప్రకారం, రోజుకు కనీసం 10 సిగరెట్లు తాగే తల్లులు ఉన్న ఇళ్లల్లో పిల్లలు తమ సాటి వారికంటే సగటున 0.65 సెంటీమీటర్ల ఎత్తు తక్కువ ఉన్నారట. ఎముకల పెరుగుదలపై నికొటీన్ ప్రభావం ఎక్కువని, ఇది ఆకలి కూడా తగ్గేలా చేసి శరీరానికి పోషకాలు అందకుండా అడ్డుకుంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇక పొడవు పెరిగేందుకు రోజూ రాత్రిళ్లు తగినంత నిద్రపోవాలని కూడా వైద్యులు చెబుతున్నారు. ఎత్తు పేరిగేందుకు కీలకమైన గ్రోత్ హార్మోన్ రాత్రి నిద్రిస్తున్నప్పుడు విడుదల అవుతుందట. కాబట్టి, రాత్రిళ్లు తరచూ నిద్ర తక్కువైతే గ్రోత్ హార్మోన్ విడుదల తగ్గి ఎత్తు పెరిగే అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి.
నిలబడేటప్పుడు కూర్చున్నప్పుడూ ముందుకు వంగడం కూడా పొడవు పెరగడంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. కాబట్టి, వీలైనంత వరకూ ముందుకు వంగకుండా నిటారుగా కూర్చోవడం లేదా నిలబడటం చేస్తే పొడవు పెరిగే అవకాశాలు మెరుగవుతాయని నిపుణుల చెబుతున్నారు.
Updated Date - Dec 05 , 2024 | 07:18 AM