Parenting Tips: మీ పిల్లలు మీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారా? ప్రధాన కారణాలు ఇవే!
ABN, Publish Date - Dec 06 , 2024 | 02:25 PM
పిల్లలు తల్లిదండ్రులతో అంటీముట్టనట్టుగా ఉండటానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో లోతుగా అర్థం చేసుకుంటే సమస్యను సులువుగా పరిష్కరించొచ్చని భరోసా ఇస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలు అంటీముట్టనట్టుగా ఉంటున్నారంటే ఏ తల్లిదండ్రులైనా తల్లడిల్లిపోతారు. ఏం జరుగుతోందో వెంటనే అర్థంకాక అందోళన చెందుతారు. పిల్లలు ఇలా ఉండటానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో లోతుగా అర్థం చేసుకుంటే సమస్యను సులువుగా పరిష్కరించొచ్చని భరోసా ఇస్తున్నారు.
పిల్లలు ఎదిగే క్రమంలో అనేక శారీరక, మానసిక మార్పులకు లోనవుతుంటారు. ముఖ్యంగా కొందరు ఎదిగే క్రమంలో స్వతంత్రను కోరుకుంటారు. ఇలాంటప్పుడు పిల్లలు అంటీముట్టనట్టుగా ఉంటున్నారన్న భావన తల్లిదండ్రుల్లో కలుగుతుంది. ఎదిగే క్రమంలో ఇదో సహజమైన దశ అని, తమ బంధం బలహీనపడుతున్నట్టు కాదని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకుని కావాల్సిన ప్రైవసీ ఇస్తే అంతా సద్దుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
Tattoo: తొలిసారి టాటూ వేయించుకుంటున్నారా?ఈ విషయాల గురించి ఆలోచించారా?
స్కూలు, ఇల్లు, లేదా స్నేహంలో సమస్యలు కూడా పిల్లలను అందరికీ దూరంగా ఉండేలా చేస్తాయి. తమ మనసులో ఉన్న భావాలను ఎలా వ్యక్తపరచాలో తెలీక అందరికీ దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి సమయాల్లో వారితో అనునయంగా మాట్లాడితే పిల్లలు మంచులా కరిగిపోయి మనసులో ఉన్నది చెబుతారు. దానికి అనుగూణంగా చర్యలు తీసుకోవచ్చు
చదువులో పోటీ, హోం వర్క్, పరీక్షలు వంటివన్నీ పిల్లలపై ఒత్తిడి తెస్తాయి. ఫలితంగా వారు ఉక్కిరిబిక్కిరై తమలో తాము ముడుకుపోయే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో పిల్లల్ని కేవలం చదువుకే పరిమితం చేయకుండా ఆటపాటలవైపు ప్రోత్సహిస్తే మంచి ఫలితం ఉంటుంది.
స్కూల్లో సహ విద్యార్థులు, స్నేహితులతో జరిగే చిన్నిచిన్ని వివాదాలు కూడా పిల్లలపై పెద్ద ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా తోటి పిల్లలు హేళన చేసినప్పుడు వారు ఎవరికి చెప్పుకోవాలో తెలీక అందరినీ దూరం పెడతారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. ఇలాంటి పిల్లలతో తరచూ మాటకలిపి వారి మనసును వేధిస్తున్న సమస్యలకు తగిన పరిష్కారాలు చూపిస్తే మళ్లీ పిల్లలు మామూలు స్థితికి వస్తారు.
స్మార్ట్ ఫోన్లు, టీవీలు చూడటంలో మునిగిపోయే పిల్లలు తల్లిదండ్రులతో అంటీముట్టనట్టుగా ఉండటం సహజమే. కుటుంబసభ్యులతో మాట్లాడటం కంటే ఆన్‌లైన్‌లో గేమ్స్ గట్రా ఆడటమే వారికి నచ్చు తుంది. కాబట్టి, స్మార్ట్ ఫోన్ల వినియోగానికి కొన్ని పరిమితులు విధిస్తే వాళ్లు ఇతర కుటుంసభ్యులతో కలిసిమెలిసి మెలుగుతారు.
Clocks tick faster on Moon: చంద్రుడిపై కాలానికి వేగమెక్కువ! ఎంత స్పీడో తెలిస్తే..
అనారోగ్య సమస్యలు కూడా పిల్లల్ని మూడీగా, నిస్సత్తువగా మారేలా చేస్తాయి. కాబట్టి, పిల్లలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయిస్తూ ఆరోగ్య సమస్యలను సకాలంలో గుర్తించి చికిత్స చేయిస్తే మంచి ఫలితం ఉంటుంది.
తల్లిదండ్రుల మధ్య తగాదాలు, తోబుట్టువు జన్మించడం వంటివన్నీ పిల్లల్లో అభద్రతాభావాన్ని పెంచుతాయి. ఇతరులతో అంటీముట్టనట్టుగా ఉండేలా చేస్తాయి. ఈ సమయంలో వారితో మాట్లాడి మనసులోని భయాలు పోగొడితే మళ్లీ వాళ్లల్లో సహజమైన ఉత్సాహం ఉరకలెత్తుతుంది.
తల్లిదండ్రులు నిత్యం బిజీగా ఉంటూ పిల్లలకు తగిన సమయం కేటాయించకపోవడం పొరపాటని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటప్పుడు పిల్లలు తమను ఎవరూ పట్టించుకోవట్లేదని భావించి అంటీముట్టనట్టుగా మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి, ఎంత బిజీగా ఉన్నా తల్లిదండ్రులు పిల్లలు తగినంత సమయం కేటాయిస్తే పిల్లలు నిత్యం సంతోషంగా ఉంటారు.
Updated Date - Dec 06 , 2024 | 02:37 PM