Types of Salt: ఉప్పులో రకాలు.. వాటి వల్ల కలిగే ఉపయోగాలు!
ABN, Publish Date - Sep 02 , 2024 | 09:01 AM
ఉప్పులో కూడా పలు రకాలు ఉన్నాయి. ఒక్కో రకంతో ఒక్కో ప్రయోజనం చేకూరుతుంది. మరి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఉప్పులు ఏవో? వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఉప్పు లేని వంటకాలను అస్సలు ఊహించుకోలేము. ఆహారానికి రుచి ఉప్పు వల్లే చేకూరుతుంది. అయితే, ఉప్పులో కూడా పలు రకాలు ఉన్నాయనేది చాలా మందికి తెలియని విషయం. ఒక్కో రకంతో ఒక్కో ప్రయోజనం (Health) చేకూరుతుంది. మరి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఉప్పులు ఏవో? వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వివిధ రకాల ఉప్పులకు సంబంధించి అంజలీ ముఖర్జీ అనే న్యూట్రిషనిస్టు నెట్టింట పంచుకున్న విషయాలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి (Types of Salt and their uses).
Viral: ఆయుర్దాయం పెంచుకునేందుకు ఐదు సులభమైన మార్గాలు!
సెల్టిక్ సాల్ట్
మన ఇళ్లల్లో సాధారణంగా కనిపించే ఉప్పుతో పోలిస్తే ఇందులో సోడియం శాతం తక్కువగా ఉంటుంది.
బ్లాక్ సాల్ట్
నల్ల ఉప్పుగా చెప్పుకునే ఈ రకంలో కూడా సోడియం శాతం సాధారణ ఉప్పుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అయితే, కడుపు ఉబ్బరం, అరుగుదలలోపం, కడుపునొప్పి, కడుపులో తిప్పడం, గుండె మంట వంటి సమస్యలకు ఈ ఉప్పుతో పరిష్కారం లభిస్తుంది. ఈ ఉప్పులో పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ కూడా ఉంటాయట.
కోషర్ ఉప్పు
సాధారణ రకంతో పోలిస్తే ఈ ఉప్పులోని పలుకులు కాస్తంత పెద్దవిగా ఉంటాయి. దీన్ని పరిమిత స్థాయిలోనే రిఫైన్ చేయడంతో ఉప్పదనం కూడా కాస్తంత తక్కువగానే ఉంటుంది. ఇందులో ఐయోడిన్ శాతం కూడా తక్కువే.
లో సోడియం సాల్ట్
పేరుకు తగ్గట్టే ఇందులో సోడియం సోడియం శాతం తక్కువ, పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. హైబీపీ ఉన్న వాళ్లకు ఇది దివ్యౌషధం.
పింక్ సాల్ట్
లేత గులాబీ రంగులో ఉండే ఈ ఉప్పులో లవణాల శాతం ఎక్కువ. ఇది తరచూ తింటే కండరాలు పట్టేయడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఉప్పుతో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. కణాల్లోని పీహెచ్ స్థాయిలు స్థిరత్వాన్ని సంతరించుకుంటాయి.
సాధారణ ఉప్పు
ఇది మనందరి ఇళ్లల్లో సాధారణంగా కనిపించేదే. ఇందులో అయోడిన్ కూడా ఉంటుంది. అయితే, ఈ ఉప్పును పరిమితస్థాయిలో వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు. పెద్దలు రోజుకు సాధారణ ఉప్పును 5 గ్రాములకు మించి తినకూడదనేది వైద్యుల సలహా
సీ సాల్ట్
ఈ ఉప్పులో లవణాల శాతం అధికంగా ఉంటుంది. అయితే, ఇది నీటిలో అంత సులభంగా కరగదట.
‘‘మార్కెట్లో ఎన్నో రకాల ఉప్పులు ఉన్నాయి. కానీ నాకు ఇష్టమైదని మాత్రం పింక్ సాల్ట్. కానీ, ఏ ఉప్పుతో ఏయే ఉపయోగాలు ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకున్నాకే వినియోగించాలి’’ అని సదరు నెటిజన్ చెప్పుకొచ్చారు. బీపీతో బాధపడే వాళ్లు లో సాల్ట్ ఉప్పు వాడాలని సూచించారు. శరీరానికి లవణాలు తగినంత కావాలంటే పింక్ సాల్ట్ వాడొచ్చని సూచించారు.
Updated Date - Sep 02 , 2024 | 09:25 AM