గాజాలో మసీదుపై దాడి 26 మంది మృతి
ABN, Publish Date - Oct 07 , 2024 | 04:28 AM
సెంట్రల్ గాజా డెయిల్ అల్ బలాహ్ పట్టణంలోని అల్ అక్సా ఆసుపత్రికి సమీపంలో ఉన్న మసీదుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 26 మంది చనిపోయారు.
లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్
ఐఆర్‌జీసీ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖానీ హతం!
టెల్ అవీవ్, గాజా, అక్టోబరు 6: సెంట్రల్ గాజా డెయిల్ అల్ బలాహ్ పట్టణంలోని అల్ అక్సా ఆసుపత్రికి సమీపంలో ఉన్న మసీదుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 26 మంది చనిపోయారు. మరోవైపు హమాస్ దాడి జరిపిఏడాది అయిన సందర్భంగా గాజా సమీప ప్రాంతాల్లో ఇజ్రాయెల్ అదనపు బలగాలను మోహరించింది. అయినా గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు దూసుకువచ్చాయని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ దక్షిణభాగంలోని బీర్షెబా ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదులదాడిలో ఒకరు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఉగ్రవాదిని ఇజ్రాయెల్ బలగాలు కాల్చి చంపాయి. మరోవైపు, ఇరాన్‌కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. బీరుట్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ హతమయ్యాడు.
నస్రల్లా మరణం తర్వాత హిజ్బుల్లా కొత్త చీఫ్‌గా బాధ్యతలు హాషిమ్ సఫీద్దీన్‌తో ఇస్మాయిల్ ఖానీ భేటీ అయినప్పుడే ఇజ్రాయెల్ దాడి చేసి ఇద్దరినీ మట్టుబెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఇరాన్ తరపున ఇజ్రాయెల్‌పై పోరాడుతోన్న హిజ్బుల్లా, హమాస్, హూతీ, ఇతర మిలీషియా గ్రూపుల సమన్వయ పనులను ఇస్మాయిల్ ఖానీయే చూస్తున్నారు. అయితే దీనిపై ఇరాన్, హిజ్బుల్లాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా, గాజాలో దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్‌పై నెతన్యాహు మండిపడ్డారు. ఇరాన్ ప్రేరేపిత అరాచక శక్తులతో తాము ఏకకాలంలో ఏడు చోట్ల పోరాటం చేస్తుంటే ఆయుధాల సరఫరా నిలిపివేస్తామనడం సిగ్గుచేటన్నారు.
Updated Date - Oct 07 , 2024 | 04:28 AM