Anwarul Azim: ఎంపీ దారుణ హత్య
ABN, Publish Date - May 22 , 2024 | 04:28 PM
కోల్‌కతాలో అదృశ్యమైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ దారుణ హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ దేశ హోం శాఖ మంత్రి అసదుజ్జామన్ ఖాన్ వెల్లడించారు. ఈ హత్య పక్కా ప్రణాళికతో జరిగిందన్నారు.
కోల్‌కతా, మే 22: కోల్‌కతాలో అదృశ్యమైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ (Bangladesh MP Anwarul Azim) దారుణ హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ దేశ హోం శాఖ మంత్రి అసదుజ్జామన్ ఖాన్ (Bangladesh Home Minister Asaduzzaman Khan) వెల్లడించారు. ఈ హత్య పక్కా ప్రణాళికతో జరిగిందన్నారు.
ఈ ఎంపీ హత్యలో ప్రమేయమున్న హంతకులు ఎవరన్నది బయటకు వస్తుందన్నారు. అయితే ఈ హత్యతో సంబంధమున్న ముగ్గురు వ్యక్తులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారని ఖాన్ వివరించారు. ఈ హత్య వెనుకనున్న ఉద్దేశ్యమేమిటో తెలుసునని.. అది తొందరలోనే బహిర్గతం చేస్తామని చెప్పారు.
ఇక ఈ హత్య కేసు దర్యాప్తులో భారత్ పోలీసులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. మే 12వ తేదీన వైద్య చికిత్స కోసం బంగ్లాదేశ్ నుంచి ఎంపీ అజిమ్ న్యూఢిల్లీ వచ్చారు. ఆ మరునాడు ఆయన కోల్‌కతాలోని తన స్నేహితుడు గోపాల్ బిస్వాస్ నివాసానికి చేరుకున్నారు.
అనంతరం ఆయన అదృశ్యమయ్యారు. దీంతో గోపాల్ బిస్వాస్.. ఎంపీ అజిమ్ అదృశ్యంపై ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వారి సూచన మేరకు బిదాన్‌నగర్‌లోని బారానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు మే 13వ తేదీ వరకు అజిమ్.. తన కుటుంబ సభ్యులతోపాటు స్నేహితుడి గోపాల్ బిస్వాస్‌తో ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉన్నారని మీడియా వెల్లడించింది.
బంగ్లాదేశలో అన్వరుల్ అజిమ్.. ప్రధాని షేక హాసినా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు. అవామీ లీగ్ పార్టీ తరఫున జినైదా- 4 నియోజకవర్గానికి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 22 , 2024 | 05:39 PM