Kamala vs Trump: తొలి ముఖాముఖీ డిబేట్‌లో పాల్గొన్న ట్రంప్, కమలా హ్యారీస్.. ఎవరిది పైచేయి?
ABN, Publish Date - Sep 11 , 2024 | 08:19 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో కీలక ఘట్టం జరిగింది. రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, అతడి ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ నామినీ కమలా హారిస్ మధ్య ఫిలిడెల్ఫియాలో తొలి ముఖాముఖీ చర్చ జరిగింది. డిబేట్‌లో ఇరువురు నేతలు హోరాహోరీగా తలపడ్డారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో కీలక ఘట్టం జరిగింది. రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, అతడి ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ నామినీ కమలా హారిస్ మధ్య ఫిలిడెల్ఫియాలో తొలి ముఖాముఖీ చర్చ జరిగింది. డిబేట్‌లో ఇరువురు నేతలు హోరాహోరీగా తలపడ్డారు. చర్చ ప్రారంభంలో వేదికపై కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ కరచాలనం చేసుకున్నారు. దీంతో అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ వేదికపై కరచాలనం లేకుండా గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీగా వీరిద్దరూ ముగింపు పలికినట్టు అయింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వీరిద్దరు నాయకులు కలసుకోవడం కూడా ఇదే తొలిసారి. దీంతో వీరిద్దరూ పరిచయం చేసుకున్నట్టు అయ్యింది.
తాను అమెరికా అధ్యక్ష పదవిని చేపడితే మధ్యతరగతి కుటుంబాలు, చిరు వ్యాపారులకు అండగా నిలుస్తానని, ఈ మేరకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన వ్యయం అంశాలపై మీ ఆలోచనలు ఏమిటని ప్రశ్నించగా ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ఓటర్ల మనస్సులలో ఎక్కువగా ఉన్న సమస్య జీవల వ్యయాలేనని హారీస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన మధ్యతరగతి కుటుంబ నేపథ్యాన్ని ఆమె ప్రస్తావించారు. ఇక బిలియనీర్లు, పెద్ద కంపెనీలపై పన్నుల భారాల నుంచి ఉపశమనం కల్పిస్తానని కమల వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌పై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రంప్ చేతులు ఎత్తేసిన ఆర్థిక వ్యవస్థను జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చక్కదిద్దారని, ఆర్థిక వ్యవస్థ విషయంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాంటి ప్రణాళికలు లేవని ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు.
ఇక డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇమ్మిగ్రేషన్ విధానంలో విఫలమయ్యారంటూ బైడెన్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కమలా హారిస్ లక్ష్యంగా ట్రంప్ పదునైన విమర్శలు చేశారు. అయితే ట్రంప్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘‘మీరు అదే పాత నలిగిపోయిన ప్లేబుక్‌లోని అబద్ధాలు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ మనకు ఏం ఇచ్చారో మాట్లాడుకుందాం. ట్రంప్ మనకు మహా ఆర్థిక మాంద్యం, తీవ్ర నిరుద్యోగాన్ని ఇచ్చారు. ఒక శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య మహమ్మారి సమస్యను అందించి వెళ్లారు. అంతర్యుద్ధం తర్వాత మన ప్రజాస్వామ్యంపై అత్యంత దారుణమైన దాడిని ట్రంప్ మిగిల్చి వెళ్లారు. ట్రంప్ సృష్టించిత గందరగోళాలను శుద్ధి చేయడమే మేము చేసిన పని’’ అని కమలా హ్యారీస్ గట్టి కౌంటర్లు ఇచ్చారు. స్పందించిన ట్రంప్ కరోనా మహమ్మారి సమయంలో తాను చాలా గొప్పగా విధులు నిర్వహించానని, అయితే దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదని అన్నారు. కొవిడ్ మహమ్మారితో అద్భుతంగా పోరాడమని ఆయన చెప్పారు.
ఇమ్మిగ్రేషన్‌పై అంశంపై ట్రంప్ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తుంటారని కమలా హారిస్ విమర్శించారు. ఇక ట్రంప్ ర్యాలీలకు వచ్చే జనాలకు బోర్ కొడుతోందని, అందుకే ఆయన ర్యాలీల్లో హన్నిబాల్ లెక్టర్ వంటి కల్పిత పాత్రల గురించి మాట్లాడుతుంటారని, ప్రజలు విసుగు చెంది అతని ర్యాలీలకు దూరంగా ఉండడం మొదలుపెట్టారని కమలా హారీస్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్రంప్ ర్యాలీలకు ఎవరూ వెళ్లొద్దని ఆమె అన్నారు. ఆమె మాట్లాడుతుండగానే... ఒహియోలో హైతీ వలసదారులు కుక్కలను తినడం కుట్ర అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాట్లాడడం ట్రంప్ మొదలు పెట్టారు. దీంతో కమల నవ్వారు.
అబార్షన్ అంశంపై కూడా కమలా హారిస్ మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే అబార్షన్‌లపై నిషేధం విధిస్తారని అని అన్నారు. అయితే కమలా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. అలాంటి చట్టాన్ని కాంగ్రెస్ ఆమోదించబోదని ఆయన స్పష్టం చేశారు. కమలా హ్యారీస్ గట్టిగా అదరగొడుతుండడంతో ఒకానొక సమయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. ‘‘కమలా హారిస్ ఒక మార్క్సిస్టు. ఆమె తండ్రి మార్క్సిస్టు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వింటూ హారిస్ చిరునవ్వులు చిందించారు.
Updated Date - Sep 11 , 2024 | 08:19 AM