Donald Trump: 18 వేల మంది భారతీయుల మెడపై.. ట్రంప్ సర్కారు బహిష్కరణ కత్తి!
ABN, Publish Date - Dec 18 , 2024 | 03:52 AM
అమెరికాలో వచ్చే నెలలో కొలువుదీరనున్న డొనాల్డ్ ట్రంప్ సర్కారు.. అక్రమ వలసదారులపై దృష్టి సారించింది.
జాబితాలో ఏపీ పౌరులతోపాటు పంజాబీలు, గుజరాత్ రాష్ట్రీయులు
భారత్‌కు పంపేందుకు నేషనల్ గార్డ్స్‌ను వాడుతానన్న ట్రంప్
వాషింగ్టన్, డిసెంబరు 17: అమెరికాలో వచ్చే నెలలో కొలువుదీరనున్న డొనాల్డ్ ట్రంప్ సర్కారు.. అక్రమ వలసదారులపై దృష్టి సారించింది. తప్పుడు పత్రాలతో అమెరికాకు వచ్చిన వారి చిట్టాను సిద్ధం చేసింది. ఈ కోవలో 14.45 లక్షల మంది ఉండగా.. వీరిలో భారతీయుల సంఖ్య 17,940. వీరందరినీ భారత్‌కు తిప్పి పంపే(బహిష్కరణ/డీపోర్టేషన్) ఏర్పాట్లు జరుగుతున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) వెల్లడించింది. ట్రంప్ కూడా ఇటీవల టైమ్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మిలటరీ (నేషనల్ గార్డ్స్)ను సాధారణంగా ఇలాంటి పనులకు వినియోగించరు కదా? అని టైమ్ ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘అమెరికాలోకి అక్రమంగా చొరబాట్లు జరిగాయి. ఇది అమెరికాపై దురాక్రమణగా భావిస్తాం. పలు దేశాలు ఈ విషయంలో మాకు సహకరించడం లేదు. మేము గుర్తించిన వ్యక్తుల పౌరసత్వం వివరాలు అడిగాం. కానీ, స్పందన లేదు.
అలాంటి 15 దేశాలను ‘సహకరించడం లేదు’ అనే జాబితాలో పెట్టాం. ఆ దేశాలు సహకరించకపోతే.. నేషనల్ గార్డ్స్ సాయంతో వారిని తిప్పి పంపుతాం’’ అని అన్నారు. కాగా.. భారత్ కూడా బహిష్కరణ కోసం 18 వేల మంది వివరాలు అడిగితే.. ఇవ్వడం లేదని ఐసీఈ పేర్కొంది. అమెరికాలో తప్పుడు పత్రాలతో నివసిస్తున్న భారతీయుల్లో ఎక్కువగా పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారున్నట్లు వివరించింది. పాకిస్థాన్, చైనా, ఇరాన్, వెనెజువెల నుంచి సహకారం అందడం లేదని తెలిపింది. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్రిమినల్ కేసులేవీ లేకుండా అధ్యక్ష పీఠంపై కూర్చోవాలనే ఆశకు కోర్టు నిర్ణయంతో బ్రేక్ పడింది. అధ్యక్షుడికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ ఉంటుందని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా హష్ మనీ కేసులో తీర్పును కొట్టివేయాలని తాజాగా ట్రంప్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను మన్‌హటన్ కోర్టు జడ్జి జస్టిస్ జువాన్ మెర్కన్ తిరస్కరించారు. న్యూయార్క్ స్టేట్ కేసును ముందస్తుగా మూసివేయడానికి నిరాకరించారు. ఆ కేసు ట్రంప్ వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించినది అని, అది ఆయన అధికార కార్యక్రమాలకు చెందినది కాదని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించారు.
Updated Date - Dec 18 , 2024 | 04:23 AM