Israel-Hamas War: హమాస్ హెచ్చరిక.. ఇజ్రాయెల్ ఆ పని చేస్తే వారి ఖేల్ ఖతం!
ABN, Publish Date - Jun 11 , 2024 | 11:03 AM
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై పది నెలలు కావొస్తున్నా ఇంకా ఆగలేదు. తగ్గేదే లేదంటూ.. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు జరుపుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా..
ఇజ్రాయెల్, హమాస్ (Israel Hamas War) మధ్య యుద్ధం ప్రారంభమై పది నెలలు కావొస్తున్నా ఇంకా ఆగలేదు. తగ్గేదే లేదంటూ.. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు జరుపుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా.. హమాస్‌ని అంతమొందించాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. అమాయక ప్రజలు చనిపోతున్నా, ప్రపంచ దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. వెనక్కు తగ్గకుండా దాడుల పరంపరని కొనసాగిస్తోంది. ఇలాంటి తరుణంలో.. హమాస్ ఓ హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ దళాలు ముందుకు సాగితే.. బందీలను చంపాలని హమాస్ నాయకులు ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ అధికారుల్ని ఉటంకిస్తూ.. న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
‘‘ఇజ్రాయెల్ దళాల కదలికలపై అనుమానాలు వచ్చిన వెంటనే.. బందీలను హతమార్చండి’’ అని ముష్కరులకు హమాస్ నాయకుల నుంచి ఆదేశాలు అందాయని ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారంటూ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇటీవల సెంట్రల్ గాజాలోని నుసెయిరత్ నుంచి నలుగురు బందీలను ఇజ్రాయెల్ డిఫరెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) రక్షించిన తర్వాత.. ముష్కరులకు ఆ ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇదే సమయంలో.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్లే ముగ్గురు బందీలు చనిపోయారన్న హమాస్ వాదనల్ని ఇజ్రాయెల్ అధికారులు తోసిపుచ్చారు. తమ పౌరుల్ని బంధించిన ముష్కరులే.. ఆ ముగ్గురిని హతమార్చారని వాళ్లు ఆరోపించారు. కాగా.. ఇజ్రాయెల్ ఇప్పటిదాకా ఏడుగురు బందీలను విడిపించగలిగింది. కానీ, చాలామంది దాడుల కారణంగా మరణించారు.
కాల్పుల విరమణకు తీర్మానం
ఇదిలావుండగా.. ఈ యుద్ధం కారణంగా గాజాలో వేలాదిమంది అమాయక ప్రజలు చనిపోతుండటంతో కాల్పుల విరమణకు అమెరికా తీర్మానించింది. దీనిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. మే 31వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రూపొందించిన ఈ తీర్మానానికి 14 ఓట్లు అనుకూలంగా పడ్డాయి. కాల్పుల విరమణకు పిలుపునివ్వడంతో పాటు బంధీలను విడుదల చేయాలని ఈ తీర్మానం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా, ఆలస్యం చేయకుండా నిబంధనల్ని పూర్తిగా అమలు చేయాలని ఈ తీర్మానం కోరింది. ఇందుకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం తెలిపాయి. అయితే.. ఈ సంఘర్షణకు శాశ్వత ముగింపుకు హామీ ఇవ్వాలని హమాస్ డిమాండ్ చేయగా.. అందుకు ఇజ్రాయెల్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అందుకే యుద్ధం కొనసాగుతోంది.
Read Latest International News and Telugu News
Updated Date - Jun 11 , 2024 | 11:03 AM