ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

ABN, Publish Date - Oct 02 , 2024 | 02:41 AM

పశ్చిమాసియా భగ్గుమంది..! హమాస్‌.. హిజ్బుల్లాతో పోరుసల్పుతున్న ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7.30 సమయంలో ఒకసారి.. 8 గంటల సమయంలో మరోసారి బాలిస్టిక్‌ క్షిపణుల వర్షాన్ని కురిపించింది.

Iran and Israel War

  • 3 గంటల పాటు 400కుపైగా బాలిస్టిక్‌ క్షిపణులు

  • ఐరన్‌డోమ్‌లు అడ్డుకున్నా.. టెల్‌అవీవ్‌కు నష్టం

  • సైన్యం, వైమానిక దళం స్థావరాలే లక్ష్యంగా దాడి

  • టెల్‌అవీవ్‌, నెగెవ్‌, షారోన్‌లను తాకిన క్షిపణులు

  • మధ్యధరా సముద్రంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ ధ్వంసం!

  • ఇజ్రాయెల్‌ పట్టణం జాఫాలో ఉగ్రదాడి

  • 9 మంది దుర్మరణం.. పలువురికి గాయాలు

  • ఇరాన్‌ క్షిపణులను కూల్చేయండి..పశ్చిమాసియాలో సేనలకు బైడెన్‌ ఆదేశాలు

టెల్‌అవీవ్‌/వాషింగ్టన్‌, అక్టోబరు 1: పశ్చిమాసియా భగ్గుమంది..! హమాస్‌.. హిజ్బుల్లాతో పోరుసల్పుతున్న ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7.30 సమయంలో ఒకసారి.. 8 గంటల సమయంలో మరోసారి బాలిస్టిక్‌ క్షిపణుల వర్షాన్ని కురిపించింది. ఆ తర్వాత విడతల వారీగా రాత్రి 10 గంటల వరకు క్షిపణిదాడులను కొనసాగించింది. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) స్థావరాలు, వైమానిక దళ బేస్‌లు ఉన్న హాట్జెరిమ్‌, నెవాటిమ్లోని, వాణిజ్య/వ్యాపార కేంద్రాలు అధికంగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా.. తొలుత 102 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది.

ఆ తర్వాత అరగంటకే.. మరో 100 క్షిపణులు ఇజ్రాయెల్‌పైకి వచ్చాయని ఐడీఎఫ్‌ అధికారికంగా వెల్లడించింది. రాత్రి 10 గంటల వరకు 400కు పైగా క్షిపణులను ప్రయోగించామని ఇజ్రాయెల్‌ రివల్యూషనరీ గార్డ్స్‌(ఐఆర్‌జీసీ) ప్రకటించింది. ఇజ్రాయెల్‌ను కంచుకోటగా కాపాడే ఐరన్‌డోమ్‌ వ్యవస్థ సింహభాగం క్షిపణులను అడ్డుకున్నా.. టెల్‌అవీవ్‌, నెగెవ్‌, షారోన్‌ నగరాలను పలు క్షిపణులు తాకాయని.. అక్కడ భవనాలు దెబ్బతిన్నాయని అధికారిక వర్గాలు చెప్పాయి. మధ్యధరా సముద్రంలోని తమ గ్యాస్‌పైప్‌లైన్‌ దెబ్బతిన్నట్లు సమాచారం అందినట్లు వివరించాయి.

ఇరాన్‌ నుంచి వచ్చే క్షిపణులను కూల్చేయాలంటూ పశ్చిమాసియాలో ఉన్న తమ సైన్యానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ ఆదేశాలు జారీ చేశారు. ముందు జాగ్రత్తగా పశ్చిమాసియాలో మూడు ఫైటర్‌ స్క్వాడ్రన్లను తరలించారు. క్షిపణి దాడి నేపథ్యంలో అధికారులు ఇజ్రాయెల్‌ గగనతలాన్ని మూసివేసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో.. టెల్‌అవీవ్‌లోని బెన్‌గురియన్‌ విమానాశ్రయంలో టేకా్‌ఫలు, ల్యాండింగ్‌లు నిలిచిపోయి.. పదుల సంఖ్యలో విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. ఇరాన్‌ నుంచి క్షిపణుల దాడి నిలిచిపోయాక..

గగనతలంలో విమానాల రాకపోకలను తిరిగి అనుమతించారు. ఓవైపు ఇరాన్‌ దాడులు కొనసాగుతుండగా.. పలువురు ముష్కరులు జాఫా ప్రాంతంలోని జెరూసలేం బోల్డెవార్డ్‌ వద్ద తుపాకులతో కాల్పులు జరుపుతూ ఉగ్రదాడికి దిగారు. ఈ దాడుల్లో 9 మంది పౌరులు చనిపోయారని.. పలువురు గాయపడ్డారని తెలుస్తోంది.


  • బంకర్లలోకి వెళ్లాలంటూ హెచ్చరికలు

ఇరాన్‌ దాడులు ప్రారంభమవ్వడానికి ముందే.. ఇజ్రాయెల్‌ ప్రభుత్వ వర్గాలు ఇళ్లలోంచి బయటకు రావాలని, సురక్షిత ప్రాంతాలు, బంకర్లలోకి తరలి వెళ్లాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా బంకర్లలోంచే పరిస్థితిని సమీక్షించారు. దేశవ్యాప్తంగా.. 1,864 ప్రాంతాల్లో సైరన్లు మోగాయని.. తమ ఇంటర్‌సెప్టర్లు ఇరాన్‌ క్షిపణులను అడ్డుకుంటున్నాయని ఐడీఎఫ్‌ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు. రాత్రి పదిగంటల సమయంలో ఇరాన్‌ క్షిపణి దాడి నిలిచిపోయిందని ఐడీఎఫ్‌ ప్రకటించింది. దాంతో.. ప్రజలు బంకర్లు, షెల్టర్‌ జోన్ల నుంచి తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు.

కాగా.. ఇరాన్‌ రాబోయే 12 నుంచి 24 గంటల్లో ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్‌ క్షిపణులతో దాడులు చేయవచ్చని అమెరికా మంగళవారం ఉదయమే హెచ్చరించింది. ‘‘హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియే హత్య తర్వాత ఇరాన్‌ తన బాలిస్టిక్‌, క్రూయిజ్‌ క్షిపణులను, డ్రోన్లను సిద్ధం చేసింది. హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా హత్య తర్వాత దాడులకు వ్యూహాలను రచించింది. 12 నుంచి 24 గంటల్లో దాడులు జరుపుతుందని మా నిఘావర్గాల సమాచారం’’ అని అప్రమత్తం చేసింది. ఇరాన్‌ గనక దాడికి దిగితే.. మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా హెచ్చరించింది. మరోవైపు, భూతల దాడులను వెంటనే ఆపాలని, ఇజ్రాయెల్‌ తన సేనలను లెబనాన్‌ నుంచి ఉపసంహరించుకోవాలంటూ రష్యా మంగళవారం సాయంత్రం హెచ్చరికలు జారీ చేసినట్లు అరబ్‌ పత్రికలు పేర్కొన్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య ఫోన్‌లో చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారవర్గాలు వెల్లడించాయి.


  • లెబనాన్‌లో హిజ్బుల్లా ఆయుధాల ధ్వంసం

యుద్ధ ట్యాంకులు.. రాకెట్‌ లాంచర్లతో లెబనాన్‌ దక్షిణ ప్రాంతంపై విరుచుకుపడుతూ భూతల దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్‌.. మంగళవారం ఒక్కరోజే 70కి పైగా ఆపరేషన్లను నిర్వహించినట్లు వెల్లడించింది. సరిహద్దుల్లో హిజ్బుల్లాకు చెందిన భారీ సొరంగాలను గుర్తించి, వాటిని ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్‌ తన అధికారిక టెలిగ్రామ్‌ చానల్‌లో ప్రకటించింది. ఐడీఎ్‌ఫకు చెందిన 98వ డివిజన్‌ కమాండోలు సరిహద్దుల నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు చొచ్చుకుపోయారని వెల్లడించింది. ఇజ్రాయెల్‌ సరిహద్దులకు సమీపంలో ఉన్న టన్నెల్స్‌లో హిజ్బుల్లా ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా ఆయుధాలను నిల్వ చేశారని..

హమాస్‌ తరహాలో ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాడికి కుట్ర పన్నిన విషయాన్ని గుర్తించామని పేర్కొంది. ‘‘సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య ఉన్న గోడను ధ్వంసం చేసేందుకు హిజ్బుల్లా ఐఈడీలను సిద్ధం చేసుకున్నట్లు గుర్తించాం. హమాస్‌ మాదిరిగా.. ఇజ్రాయెల్‌లోకి చొరబడి.. పౌరులను అంతమొందించాలనేది హిజ్బుల్లా ప్రణాళిక అని తెలుస్తోంది’’ అని వివరించింది. కాగా.. భూతల దాడులకు ముందే ఇజ్రాయెల్‌ సైన్యం లెబనాన్‌ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ‘‘మీకు ప్రాణనష్టం కలగకుండా ఉండాలంటే.. అవాలి నది(సరిహద్దు నుంచి 60 కిలోమీటర్ల దూరం) సమీపానికి వెళ్లండి’’ అని పేర్కొంది. మంగళవారం రాత్రి కడపటి వార్తలందేసరికి.. ఐడీఎఫ్‌ బలగాలు సరిహద్దుల నుంచి 10-15 కిలోమీటర్ల మేర.. పలు గ్రామాలను దాటుకుంటూ వెళ్లింది.


  • మా సీక్రెట్‌ సర్వీస్‌ చీఫ్‌ ఇజ్రాయెల్‌ గూఢచారి

ఇరాన్‌ గూఢచారి ఇచ్చిన సమాచారం ఆధారంగానే హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లాను ఇజ్రాయెల్‌ హతమార్చిందనే వార్తల నేపథ్యంలో ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు మహముద్‌ అహ్మదిన్‌జాద్‌ సంచలన విషయం బయటపెట్టారు. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌.. ఇరాన్‌లో చేస్తోన్న కార్యకలాపాలపై నిఘాకు తాము ఏర్పాటు చేసిన సీక్రెట్‌ సర్వీస్‌ సంస్థ అధిపతి ఓ ఇజ్రాయెల్‌ గూఢచారి అని పేర్కొన్నారు. ఇరాన్‌లో ఇజ్రాయెల్‌ గూఢచర్యాన్ని అడ్డుకునే బాధ్యత కలిగిన దేశ అత్యున్నత అధికారి మొస్సాద్‌ మనిషి అని తాము 2021లో గుర్తించామని తెలిపారు.

  • ఖండించిన ఐరాస చీఫ్‌

  • నేడు భద్రతా మండలి సమావేశం

పశ్చిమాసియాలో దాడులను ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ఖండించారు. ఆయన ఏ దేశం పేరును ప్రస్తావించకుండా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆగిపోవాలని.. కాల్పుల విరమణ జరగాలని ఆకాంక్షించారు. మరోవైపు ఇరాన్‌ దాడిపై బుధవారం ఐరాస భద్రతామండలిలో చర్చకు డిమాండ్‌ చేస్తామని ఇజ్రాయెల్‌ రాయబారి డానీ డానన్‌ వెల్లడించారు. ‘‘ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ అతిపెద్ద, అత్యంత హింసాత్మకంగా క్షిపణులతో దాడి చేసింది. మేము ఆత్మరక్షణకు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇజ్రాయెల్‌ పౌరుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునే హక్కు ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


  • దాడులకు మేం సిద్ధం: హిజ్బుల్లా

లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ భూతల దాడులు ప్రారంభమైన మాట నిజం కాదని హిజ్బుల్లా పేర్కొంది. ఈ మేరకు హిజ్బుల్లా ప్రతినిధి మహమ్మద్‌ అఫీఫ్‌ అరబిక్‌లో మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేశారు. ఇజ్రాయెల్‌పై తమ రాకెట్‌ దాడులు కొనసాగుతున్నాయని.. భూతల దాడులకు వచ్చే ఐడీఎఫ్‌ బలగాలను ఎదుర్కొనేందుకు తమ ఫైటర్లు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అటు ఐడీఎఫ్‌ కూడా.. లిటానీ నది పరిసరాల్లో వెయ్యి మందికిపైగా హిజ్బుల్లా ఉగ్రవాదులు కాపుకాచిన విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది.

కాగా.. హిజ్బుల్లా వద్ద ఇరాన్‌ తయారీ ఫాది క్షిపణులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు ఇజ్రాయెల్‌ అనుమానిస్తోంది. ఇవి ఇరాన్‌కు చెందిన ఖైబర్‌ ఎం-302లాంటివని తెలుస్తోంది. 1987లో హతమైన ఫాది హసన్‌ తవీల్‌ పేరుతో హిజ్బుల్లా ఈ క్షిపణులను తయారు చేయిస్తోందని అనుమానిస్తోంది. వీటిల్లో ఫాది-4 క్షిపణికి 300 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఫాది-3 క్షిపణి 250 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్తూ.. 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఫాది క్షిపణులు గైడెడ్‌ కాగా.. భూతలం నుంచి భూతలంపై ఉండే లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి ‘ఖాదర్‌’ క్షిపణి, చైనా తయారీ సీ801, సీ802 కూడా ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు చెబుతున్నాయి.


  • పేజర్‌ పేలుళ్ల వెనక భారతీయుడు?

గత నెల లెబనాన్‌ వ్యాప్తంగా ఏకకాలంలో 3 వేలకు పైగా పేజర్‌ బాంబులు పేలి.. 39 మంది మృతిచెందిన తెలిసిందే..! తొలుత తైవాన్‌కు చెందిన కంపెనీ.. ఆ తర్వాత హంగరీకి చెందిన డిస్ట్రిబ్యూటర్‌ ద్వారా హిజ్బుల్లాకు పేజర్లు అందినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. భారతీయ-నార్వేయన్‌ రిన్సన్‌ జోస్‌ కోసం అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు వేట కొనసాగిస్తున్నాయి. నార్వేలో స్థిరపడ్డ రిన్సన్‌ స్వస్థలం కేరళ. పేలిపోయిన పేజర్లను నార్వే ఆధారంగా పనిచేస్తున్న అతని కంపెనీలో తయారైనవని నార్వేస్‌ నేషనల్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ సర్వీస్‌ గుర్తించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

Updated Date - Oct 02 , 2024 | 07:29 AM