లెబనాన్‌పై గాజా తరహా దాడులు!
ABN, Publish Date - Sep 25 , 2024 | 02:52 AM
మూడు వేలకు పైగా పేజర్ బాంబుల బీభత్సం.. ఆ మర్నాడే వందల సంఖ్యలో వాకీటాకీల పేలుళ్లు.. ఈ దారుణాలు జరిగి వారం గడవక ముందే.. వందల క్షిపణులతో ముప్పేట దాడులు..!
ఇజ్రాయెల్ దాడుల్లో 15 మంది దాకా హిజ్బుల్లా టాప్
కమాండర్ల మృతి.. 558కి పెరిగిన మొత్తం మరణాలు
టెల్‌అవీవ్/బీరుట్, సెప్టెంబరు 24: మూడు వేలకు పైగా పేజర్ బాంబుల బీభత్సం.. ఆ మర్నాడే వందల సంఖ్యలో వాకీటాకీల పేలుళ్లు.. ఈ దారుణాలు జరిగి వారం గడవక ముందే.. వందల క్షిపణులతో ముప్పేట దాడులు..! వెరసి లెబనాన్‌లో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. లెబనాన్ విషయంలోనూ ఇజ్రాయెల్ గాజా తరహా పద్ధతులనే అనుసరిస్తోంది. తొలుత హమాస్ ఉగ్రవాదులకు పౌరులు ఆశ్రయం ఇస్తున్నారని, పౌరుల ఇళ్ల కింద నుంచి హమాస్ సొరంగాలున్నాయని అప్పట్లో ఆరోపించిన ఇజ్రాయెల్.. ఇప్పుడు లెబనాన్‌లో పౌరుల ఇళ్లలో హిజ్బుల్లా క్షిపణులు, రాకెట్ లాంచర్లు ఉన్నట్లు వెల్లడించింది. స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘మా యుద్ధం హిజ్బుల్లాపైనే. దయచేసి సాధారణ పౌరులంతా సముద్ర తీరానికి వెళ్లగలరు’’ అని సోమవారం కోరారు. ఆ తర్వాత కాసేపటికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) అధికారులు పౌరుల ఇళ్లలో క్రూయిజ్ క్షిపణులు, వార్‌హెడ్ల నిల్వల వీడియోలను విడుదల చేశారు.
లెబనాన్‌పై ఆదివారం నుంచి క్షిపణి, వైమానిక దాడులు ముమ్మరమయ్యాయి. ఈ దాడుల్లో మరణాల సంఖ్య 558కి చేరుకున్నట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దహియా ప్రాంతంలో హిజ్బుల్లా క్షిపణి విభాగం చీఫ్ ఇబ్రహీం కబిసీ టార్గెట్‌గా జరిపిన దాడుల్లో పది దాకా అపార్ట్‌మెంట్లు కుప్పకూలగా.. ఇబ్రహీంతోపాటు.. హిజ్బుల్లా అనుబంధ సంస్థ లెబనాన్ నెట్‌వర్క్ చీఫ్ అల్-మయాదీన్, మరో 13 మంది కమాండర్లు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. రెండ్రోజుల దాడుల్లో దాదాపు 1,700 చదరపు కిలోమీటర్ల మేర ప్రభావం కనిపించిందని ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. గాజాలోనూ తొలినాళ్లలో ఈ తరహాలోనే దాడులు చేసిన ఇజ్రాయెల్.. ఆ తర్వాత భూతల దాడులను ప్రారంభించిన విషయం తెలిసిందే..! కాగా, బీరుట్ సహా.. దక్షిణ లెబనాన్‌కు చెందిన పలు పట్టణాల ప్రజలు రాత్రికిరాత్రే సముద్ర తీరప్రాంతాలు సిడోన్, బాల్‌బెక్‌కు చేరుకున్నారు. వాహనాల ఇంధనం, బేకరీల్లో ఆహార ఉత్పత్తులు నిండుకున్నాయి. ఒకట్రెండ్రోజుల్లో ఆకలికేకలు మొదలవుతాయని ఐక్య రాజ్య సమితి(ఐరాస) ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Updated Date - Sep 25 , 2024 | 02:52 AM