పేజర్ వ్యూహానికి నేనే అనుమతించా తొలిసారి అంగీకరించిన నెతన్యాహు
ABN, Publish Date - Nov 11 , 2024 | 04:24 AM
లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్లతో పోరులో భాగంగా సెప్టెంబర్ 17న పేజర్ల పేలుళ్ల వ్యూహానికి తానే అనుమతి ఇచ్చానని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అంగీకరించారు.
టెల్ అవీవ్, నవంబరు10: లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్లతో పోరులో భాగంగా సెప్టెంబర్ 17న పేజర్ల పేలుళ్ల వ్యూహానికి తానే అనుమతి ఇచ్చానని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అంగీకరించారు. ఈ విషయాన్ని నెతన్యాహు అధికార ప్రతినిధి ఒమెర్ దోస్త్రి ప్రకటించారు. నాటి పేజర్ పేలుళ్లలో నలభై మంది హెజ్‌బొల్లా మిలిటెంట్లు చనిపోయారు. మూడు వేల మంది గాయపడ్డారు. వాస్తవానికి నాడు జరిగిన పేజర్ల పేలుళ్ల ఘటనతో ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా హెజ్‌బొల్లాపై ఆధిపత్యం సాధించింది. ఇజ్రాయెల్ ట్రాక్ చేస్తుండటంతో దొరకకుండా ఉండేందుకు కేవలం పేజర్లు మాత్రమే వాడాలని నాటి హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా సూచించడంతో హెజ్‌బొల్లా కేడర్ అంతా పేజర్లు వాడటం మొదలు పెట్టింది. దీంతో హమా్‌సకు మద్దతుగా తమపై దీటుగా పోరాడుతున్న హెజ్‌బొల్లాలను దెబ్బతీసేందుకు పేజర్ పేలుళ్ల వ్యూహాన్ని ఇజ్రాయెల్ ఇంటలిజెన్స్ సంస్థ మొసాద్ అమలు చేసింది. కాగా, పేజర్ పేలుళ్ల ఘటనపై లెబనాన్ ఈ నెల 6న ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేసింది.
Updated Date - Nov 11 , 2024 | 04:24 AM