ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ విఫలం!
ABN, Publish Date - Oct 09 , 2024 | 05:11 AM
హిజ్బుల్లా రాకెట్లు, క్షిపణి దాడులను అడ్డుకోవడంలో తమ గగనతల రక్షణ వ్యవస్థ (ఐరన్ డోమ్) విఫలమైందని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
హెజ్‌బొల్లా రాకెట్లను అడ్డుకోలేకపోయిన గగనతల రక్షణ వ్యవస్థ
హైఫాలో ఐడీఎఫ్ శిబిరాలే లక్ష్యంగా దాడులు
బీరుట్, అక్టోబరు 8: హిజ్బుల్లా రాకెట్లు, క్షిపణి దాడులను అడ్డుకోవడంలో తమ గగనతల రక్షణ వ్యవస్థ (ఐరన్ డోమ్) విఫలమైందని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తర ఇజ్రాయెల్‌లో గల హైఫాలో ఇజ్రాయెల్ భద్రతా దళాలు, రెండు ఐడీఎఫ్ శిబిరాల లక్ష్యంగా ఆదివారం హెజ్‌బొల్లా దాడులు చేసింది. రాకెట్లు, క్షిపణులతో 18 దాడులు చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. రాకెట్ దాడుల ప్రభావం, ప్రాణ, ఆస్తి నష్టంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులను తీవ్రతరం చేస్తామని హెజ్‌బొల్లా తాత్కాలిక అధినేత షేక్ నయీం కసెం హెచ్చరించారు. తమ బలగాలు చెక్కుచెదరకుండా, చాలా దృఢంగా ఉన్నాయని చెప్పారు. సీనియర్ కమాండర్ల స్థానాలన్నింటినీ భర్తీ చేశామని వెల్లడించారు.
బలహీనపడ్డ హెజ్‌బొల్లా
ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ సహా పలువురు అగ్రనేతలు, సీనియర్ కమాండర్‌లు హతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెజ్‌బొల్లా బలహీనపడిందన్న వార్తలు వచ్చాయి. గత వారం ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ భూభాగంలోకి చొరబడిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ దళాలు అంతకుమించి ముందుకు రాలేకపోతున్నాయని నయీం చెప్పారు. ‘‘మేం వందలాది రాకెట్లు, పదుల సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేస్తున్నాం. ఇజ్రాయెల్ దళాల శిబిరాలు, పలు నగరాలపై దాడులు చేస్తున్నాం’’ అని నయీం తెలిపారు.
1300 మందికి పైగా మృతి
ఇజ్రాయెల్‌ను సమర్థంగా ఎదుర్కోగలమని, తమ ఫైటర్లను భారీ సంఖ్యలో మోహరించామని చెప్పారు. మంగళవారం బీరుట్‌లో చేసిన దాడిలో హెజ్‌బొల్లా సీనియర్ కమాండర్ సుహైల్ హుస్సేనీని హతమార్చినట్లు ఐడీఎఫ్ వర్గాలు ప్రకటించాయి. దీనిపై హెజ్‌బొల్లా స్పందించలేదు. సెప్టెంబరులో ప్రారంభమైన ఈ పోరులో లెబనాన్‌లో ఇప్పటి వరకు 1300 మందికిపైగా మరణించారు. 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం
Updated Date - Oct 09 , 2024 | 07:25 AM