Hardeep Nijjar: హర్దీప్ హత్య కేసు వివాదం.. ఆధారాలు ఎక్కడంటూ కెనడాని ప్రశ్నించిన న్యూజిలాండ్
ABN, Publish Date - Mar 13 , 2024 | 04:39 PM
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసు వ్యవహారంలో భారత్, కెనడా (India Canada Row) మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ఆరోపణలు చేశాక ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసు వ్యవహారంలో భారత్, కెనడా (India Canada Row) మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ఆరోపణలు చేశాక ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతున్న తరుణంలో.. తాజాగా కెనడా మిత్రదేశమైన న్యూజిలాండ్ (New Zealand) కీలక వ్యాఖ్యలు చేసింది. హర్దీప్ హత్య కేసులో భారత్ హస్తం ఉండొచ్చని ట్రూడో చేసిన ఆరోపణలపై అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు ఎక్కడున్నాయని ప్రశ్నించింది. న్యూజిలాండ్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ (Winston Peters) ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం విన్‌స్టన్ పీటర్స్ నాలుగు రోజుల భారత్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆయన.. హర్దీప్ హత్య కేసు గురించి మాట్లాడారు. ఈ కేసు విషయంలో భారత్‌పై చేసిన ఆరోపణల్ని ధృవీకరించే ఎలాంటి ఆధారాలను కెనడా తమతో పంచుకోలేదని పేర్కొన్నారు. తమ ‘ఫైవ్ ఐస్’ (Five Eyes) (కెనడా, అమెరికా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలకు ఈ కేసుకి సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నామని గతంలో ట్రూడో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఈ కేసుని గత న్యూజిలాండ్ ప్రభుత్వం చూసుకుందని విన్‌స్టన్ బదులిచ్చారు. ఫైవ్ ఐస్‌లో భాగంగా సమాచార మార్పిడి జరిగినప్పటికీ.. అది ఒక్కోసారి అస్పష్టంగా ఉంటుందని చెప్పారు. నిజ్జర్ కేసులో భారత్ ప్రమేయం ఉన్నట్లు చేసిన ఆరోపణలకు సంబంధించి.. కచ్చితమైన సాక్ష్యాలు ఒక్కటి కూడా కనిపించలేదని అన్నారు. కాగా.. ఫైవ్ ఐస్ కూటమిలోని ఓ దేశం, నిజ్జర్ విషయంలో కెనడా వాదనను ప్రశ్నించడం ఇదే మొదటిసారి.
ఇదిలావుండగా.. కెనడా పౌరసత్వం కలిగిన హర్దీప్ సింగ్, అక్కడి నుంచి భారత్‌కి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఇందుకు గాను హర్దీప్‌ని భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే.. 2023 జూన్ 18వ తేదీన అతడు హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ ట్రూడో చేసిన వ్యాఖ్యలు.. ఇరుదేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఈ కేసు విచారణలో భారత్ సహాయ నికారణ చేస్తోందని కెనడా ఆరోపించగా.. భారత్ వాటిని ఖండించింది. అయితే.. ఈ కేసు విచారణకు భారత్ సహకరిస్తోందని కెనడా మరోసారి స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.. ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదం క్రమంగా సమసిపోతున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 13 , 2024 | 04:39 PM