Gaza War: ఇదో అద్భుతం.. బాంబు దాడిలో చనిపోయి బిడ్డకు ప్రాణం పోసిన తల్లి!
ABN, Publish Date - Jul 20 , 2024 | 10:08 PM
తల్లి చనిపోయాక కూడా గర్భం నుంచి పిల్లలు పుట్టే సన్నివేశాలను మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతం చోటు చేసుకుంది. అవును..
తల్లి చనిపోయాక కూడా గర్భం నుంచి పిల్లలు పుట్టే సన్నివేశాలను మనం సినిమాల్లో చూస్తుంటాం..! కానీ.. ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతం చోటు చేసుకుంది..! అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజమే.. తాను చనిపోయినా.. తన బిడ్డకు మాత్రం ప్రాణం పోసింది ఓ తల్లి. తాను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినా.. తన బిడ్డను ఈ భూమిపై అడుగుపెట్టేలా చేసింది. విషాదంతో కూడిన ఈ మిరాకిల్ గాజాలో (Gaza War) వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అక్టోబర్ 7వ తేదీన హమాస్ రగిల్చిన నిప్పు కారణంగా గాజా ఇప్పుడు మంటల్లో రగిలిపోతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల కారణంగా.. అక్కడ వేలాది మంది చనిపోతున్నారు. ముఖ్యంగా.. చిన్న పిల్లలు, మహిళలు ఎక్కువ సంఖ్యలో మృతి చెందుతున్నారు. తాజాగా ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం ఎయిర్‌స్ట్రైక్ చేయగా.. అది కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి ఆరుగురితో సహా 24 మందికి పైగా మృతి చెందారు. ఇదే భవనంలో ‘ఒలా అద్నాన్ హర్బ్ అల్-ఖుర్ద్’ అనే తొమ్మిది నెలల గర్భిణీ కూడా ఉంది. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఆమెను అతికష్టం మీద శిథిలాల నుంచి బయటకు తీసి.. దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె అప్పటికే దాదాపు మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
అప్పటికీ వైద్యులు అద్నాన్‌ను రక్షించేందుకు ప్రయత్నించారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకైనా మంచిదనుకొని.. అదే టైంలో అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. అప్పుడు వారికి శిశువు హృదయ స్పందన వినిపించింది. దాంతో వాళ్లు వెంటనే ఆపరేషన్ చేసి.. బిడ్డను బయటకు తీశారు. మొదట్లో ఈ బిడ్డ పరిస్థితి విషమంగా ఉండేదని.. తాము ఆక్సిజన్‌తో పాటు ఇతర వైద్య సహాయం అందించిన తర్వాత బిడ్డ కోలుకుందని తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. ఇది నిజంగా ఓ అద్భుతమని వైద్య బృందం పేర్కొంది. ఆ చిన్నారిని మెరుగైన చికిత్స కోసం మరో పెద్దాసుపత్రికి తరలించినట్లు డాక్టర్ రేద్ అల్-సౌదీ వివరించారు.
Read Latest International News and Telugu News
Updated Date - Jul 20 , 2024 | 10:14 PM