ఇజ్రాయెల్ హెచ్చరికలతో బీరుట్ ఖాళీ
ABN, Publish Date - Oct 22 , 2024 | 03:07 AM
లెబనాన్ రాజధాని బీరుట్‌ను వదిలిపోవాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలతో ప్రజలు పరుగులు తీశారు.
మూటాముల్లెతో వీధుల్లోకి ప్రజలు..
సురక్షిత ప్రాంతాలకు పయనం.. భారీ ట్రాఫిక్
హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్ గురి
అల్ ఖర్ద్- అల్ హసన్ బ్యాంక్ శాఖలపై వైమానిక దాడులు
బీరుట్‌లోని అత్యంత రద్దీ ప్రదేశాల్లో అల్ ఖర్ద్ శాఖలు
బీరుట్, టెల్ అవీవ్, గాజా, అక్టోబరు 21: లెబనాన్ రాజధాని బీరుట్‌ను వదిలిపోవాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలతో ప్రజలు పరుగులు తీశారు. ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి రావడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. బీరుట్ జనాభా 24 లక్షలు కాగా ఉన్నఫలంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనడంతో చాలామంది ఇళ్లను వదిలిపెట్టేశారు. వాస్తవానికి హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలు దెబ్బతీసే లక్ష్యంతో వారికి ఆర్థిక వనరులను సమకూర్చే అల్ ఖర్ద్-అల్ హసన్ అసోసియేషన్ శాఖలపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది.
అల్ ఖర్ద్-అల్ హసన్‌కు 30 శాఖలుండగా అందులో 15 బీరుట్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలు, కిక్కిరిసిన జనావాసాల మధ్యలో ఉన్నాయి. ఐడీఎఫ్ హెచ్చరించిన కాసేపటికే బీరుట్ శివార్లలోని చియా ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. దీంతో బీరుట్ వాసులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయాల్సివచ్చింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బీరుట్‌లో పర్యటించడానికి కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగింది.
నష్టంపై హెజ్‌బొల్లా నాయకత్వం ఆరా!
అల్ ఖర్ద్-అల్ హసన్ అసోసియేషన్‌ను 1983లో ఏర్పాటు చేశారు. ఇస్లామిక్ మత విధానాలకు అనుగుణంగా సేవా భావంతో సామాన్యులకు రుణాలను అందిస్తుంది. హెజ్‌బొల్లాకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారనే ఆరోపణలతో అమెరికా దీనిపై 2007లో ఆంక్షలు విధించింది. హెజ్‌బొల్లాను నాశనం చేయాలని నిర్ణయించుకున్న ఇజ్రాయెల్ దానికి ఆర్థిక వనరులు అందకుండా అల్ ఖర్ద్-అల్ హసన్ అసోసియేషన్ శాఖలన్నింటిపై దాడులకు ఉపక్రమించింది. ఇజ్రాయెల్ దాడులతో జరుగుతున్న నష్టంపై హెజ్‌బొల్లా నాయకత్వం ఆరా తీసింది.
హెజ్‌బొల్లా రాకెట్ దాడులు
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా 30కి పైగా రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. వీటిని విజయవంతంగా కూల్చేశామని ఐడీఎఫ్ ప్రకటించింది. స్పష్టమైన కారణాలు వెల్లడించకుండానే బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేసింది.
Updated Date - Oct 22 , 2024 | 03:07 AM