Israel's Operations : వెంటాడి.. వేటాడి..
ABN, Publish Date - Sep 30 , 2024 | 03:50 AM
రామాయణంలో కబంధుడనే ఒక రాక్షసుడి పాత్ర ఉంటుంది! శాపం కారణంగా తల కాళ్లు లేని రాక్షస రూపం దాల్చిన ఓ గంధర్వుడు కబంధుడు. కానీ.. అతడి హస్తాలు ఎంతదూరమైనా సాగుతాయి. వాటితో రకరకాల జంతువుల్ని పట్టుకుని తింటుంటాడు.
శత్రువులపై ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రత్యేక దృష్టి
అద్భుతమైన నిఘా నెట్‌వర్క్‌తో సమాచార సేకరణ
పక్కా ప్రణాళికతో.. తప్పించుకునే వీల్లేకుండా దాడి
ఇటీవలి ఘటనలే నిదర్శనం
రామాయణంలో కబంధుడనే ఒక రాక్షసుడి పాత్ర ఉంటుంది! శాపం కారణంగా తల కాళ్లు లేని రాక్షస రూపం దాల్చిన ఓ గంధర్వుడు కబంధుడు. కానీ.. అతడి హస్తాలు ఎంతదూరమైనా సాగుతాయి. వాటితో రకరకాల జంతువుల్ని పట్టుకుని తింటుంటాడు. ఎంత దూరమైనా సాగే ఆ కబంధుడి హస్తాల నుంచి తప్పించుకోవడం ఏ జీవికైనా అసాధ్యం. ఇజ్రాయెల్ నిఘా నెట్‌వర్క్ కూడా అలాంటిదే! తమ దేశానికి, తమ పౌరులకు, యూదులకు హాని కలిగించే, కలిగించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టదు. ప్రపంచంలో ఏ మూలకెళ్లినా.. ఎంత నక్కినక్కి దాగినా.. పసిగట్టి వారి పనిపడుతుంది. తమ దేశంపై దాడి చేయడం కాదు.. చేయాలన్న ఆలోచన వచ్చినట్టు తెలిసినా.. ఇజ్రాయెల్ వారిని వెంటాడి వేటాడి చంపుతుంది.
ఆ కబంధ హస్తాల నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లక్షలాది మంది యూదుల ఊచకోతలో ప్రధానపాత్ర పోషించిన అడాల్ఫ్ ఐచ్‌మన్‌ను అర్జెంటీనాలో కిడ్నాప్ చేసి తమదేశానికి తెచ్చి మరణశిక్ష విధించడం నుంచి.. భూగర్భంలోని బంకర్లలో దాక్కున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను మట్టుబెట్టడం దాకా.. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ల కచ్చితత్వం అనన్యసామాన్యం!
ఇరాన్ ప్రాక్సీ అయిన హిజ్బుల్లా చీఫ్‌ని ఇరానీ గూఢచారి సాయంతోనే చంపగలిగిందంటే ఇజ్రాయెల్ నిఘా సామర్థ్యం ఏస్థాయిలో ఉంటుందో.. లెబనాన్ దేశవ్యాప్తంగా ఉన్న 3000 మందికిపైగా హిజ్బుల్లా ఆపరేటర్ల వద్ద ఉన్న పేజర్లను ఏకకాలంలో పేల్చేయగలిగిందంటే ఇజ్రాయెల్ ప్లానింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్లలో నిఘా సేవలు అందించేది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్. దీంట్లో నాలుగు ప్రత్యేక విభాగాలుంటాయి.
మొదటిది.. జోమెట్. మొసాద్‌లో అతి పెద్ద విభాగం ఇదే. విదేశాల్లో గూఢచర్యం నిర్వహించే కేస్ ఆఫీసర్లు ఈ విభాగం కింద పనిచేస్తారు. వీరిని ‘కత్సాస్’ అని పిలుస్తారు. వీళ్లు ఆయా దేశాల్లో రకరకాల పేర్లతో స్థిరపడి.. స్థానికులను సైతం ఏజెంట్లుగా నియమించుకుని సమాచారాన్ని సేకరిస్తారు. ప్రభుత్వ విభాగాల్లో అత్యున్నత స్థానాల్లోకి సైతం చొచ్చుకుపోతారు. కొందరు మంత్రిత్వ శాఖల స్థాయికి కూడా చేరుకుంటారు. వారిచ్చే సమాచారం ఆధారంగా పనిచేసే విభాగం కేసరియా.
ఈ విభాగం విదేశీ గడ్డపై ఆపరేషన్లను నిర్వహిస్తుంది. ఈ విభాగం కింద ‘కిడోన్ యూనిట్’ ఉంటుంది. శత్రువులను మట్టుబెట్టే అసాసిన్లతో కూడిన బృందం ఇది. మూడది కెషెత్ విభాగం. ఇది ఎలకా్ట్రనిక్ నిఘా విభాగం. శత్రువుల సమాచార ప్రసారంపై నిఘా వేస్తుంది. వాళ్ల కాల్స్‌ను ట్రాప్ చేసి ఎప్పటికప్పుడు సున్నితమైన సమాచారాన్ని తెలుసుకుంటుంది. చివరిది.. విదేశీ గడ్డపై విధ్వంసచర్యలకు పాల్పడే ‘మెత్సాదా’ అనే ప్రత్యేక విభాగం.
ఎన్నో ఆపరేషన్లు..
ఇజ్రాయెల్ ఏర్పాటైన ఏడాదికి.. అంటే, 1949లో ఏర్పాటైన మొసాద్ చేపట్టిన పలు ఆపరేషన్ల గురించి ఇప్పటికీ ప్రపంచదేశాలు కథలు కథలుగా చెప్పుకొంటాయి. అయితే, మొసాద్ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి తొలిసారి పరిచయం చేసింది.. 1972లో చేపట్టిన ‘ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్’. ఆ ఏడాది జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌కు వెళ్లిన ఇజ్రాయెల్ ఒలింపిక్ బృందంలోని 11 మంది అథ్లెట్లను.. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ బ్లాక్‌సెప్టెంబర్ చంపేసింది. రగిలిపోయిన ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్‌ను చేపట్టి నిర్వహణ బాధ్యతను మొసాద్‌పై పెట్టింది. తొలుత.. తమ అథ్లెట్లను చంపినవారందరినీ గుర్తించి, వారి జాబితాను తయారుచేసిన మొసాద్.. వారందరినీ చంపేందుకు 15 మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఫ్రాన్స్, ఇటలీ, సైప్రస్.. ఇలా యూరప్ దేశాల్లో, మధ్యప్రాచ్య దేశాల్లో మూలమూలల దాగున్న బ్లాక్‌సెప్టెంబర్ సభ్యులను అత్యంత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా చంపేసింది. చంపేయడం అంటే ఏదో.. మామూలుగా ఒక బుల్లెట్ కాల్చిచంపడం కాదు. శత్రువుల తలలోకి బుల్లెట్ల వర్షం కురిపించడం.. పరుపు కింద బాంబు పెట్టి పేల్చేయడం.. ఇలా భయంకరంగా ఉంటాయా హత్యలు. 1972లో మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ దాదాపు 1986 దాకా కొనసాగింది! అంతకుముందు.. జర్మనీలో యూదులపై హత్యాకాండ సాగించిన అడాల్ఫ్ ఐచ్‌మన్‌ను అర్జెంటీనాలో పట్టుకుని, ఇజ్రాయెల్‌కు తరలించిన తీరు కూడా ఒక చరిత్రే. 1945లో జర్మనీ నుంచి తప్పించుకున్న ఐచ్‌మన్.. పలు దేశాలు తిరిగి తిరిగి చివరికి.. నాజీ నరహంతకులకు, యుద్ధ నేరగాళ్లకు ఆశ్రయమిస్తున్న అర్జెంటీనాకు చేరాడు. అక్కడే తన ఇద్దరు పిల్లలు, జీవితభాగస్వామితో స్థిరపడ్డాడు. అతడి గురించి సమాచారం అందుకున్న మొసాద్ ఏజెంట్లు 14 మంది అక్కడికి చేరుకుని నిఘా పెట్టారు. అతడి దినచర్యను గమనించి.. ఒకరోజు సాయంత్రం అతడి కిడ్నా్‌పకి ముహూర్తం పెట్టారు. ఫ్యాక్టరీకి వెళ్లి తిరిగివస్తున్న అతణ్ని కిడ్నాప్ చేసి 9 రోజలుపాటు అక్కడే ఒక ఇంట్లో బంధించి ఉంచారు. కిడ్నాప్ చేయడం సులువేగానీ.. అతణ్ని అర్జెంటీనా అనుమతి లేకుండా ఇజ్రాయెల్‌కు తరలించడం కష్టం. దానికీ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అర్జెంటీనా ఆహ్వానం మీద ఆ దేశానికి వచ్చిన ఇజ్రాయెల్ మంత్రి చార్టర్డ్ విమానం సిబ్బందిలో ఒకడిగా అతణ్ని దేశం దాటించేశారు. తమ దేశానికి తీసుకెళ్లి విచారణ జరిపి ఉరి తీశారు. ఇలా మొసాద్ చేపట్టిన ఆపరేషన్లపై చాలా సినిమాలు, టీవీ సిరీ్‌సలు వచ్చాయి.
విభిన్నంగా..
హత్యలు చేయడమే కాదు.. మొసాద్ తనకున్న నిఘా నెట్‌వర్క్ సాయంతో ఇరాక్, ఇరాన్, సిరియా దేశాల అణు కార్యక్రమాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇరాక్‌లో అయితే ఏకంగా న్యూక్లియర్ బేస్‌పైనే బాంబులు వేసింది. ఇరాన్‌కు చెందిన ఆరుగురు అణు శాస్త్రవేత్తలను చంపేయడం ద్వారా ఆ దేశ అణు లక్ష్యాలను నిలువునా నీరుగార్చింది. హత్యలు చేయడంలో కూడా మొసాద్ ఎప్పటికప్పుడు వినూత్న విధానాలను కనిపెడుతుంది. కొత్త విషాలపై ప్రయోగాలు చేస్తుంది. శత్రువులను చంపడానికి అణుధార్మిక పదార్థాలనూ వాడుతుంది. మొసాద్ తన లక్ష్యాలను చేరుకునే క్రమంలో పలు దేశాల గూఢచార సంస్థలతో కలిసి పనిచేస్తుంది. 9/11 దాడుల గురించి అమెరికాకు మొసాద్ ఒక నెలరోజుల ముందే సమాచారం ఇచ్చి హెచ్చరించినట్టు చెబుతారు. అలాగే.. అబొత్తాబాద్‌లో తలదాచుకున్న లాడెన్ లొకేషన్‌ను గుర్తించడానికి ఇజ్రాయెల్ సహకారం ఉందనిసీఐఏ మాజీ చీఫ్ జాన్‌బ్రెన్నన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
చివరగా: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను చంపడానికి ఇజ్రాయెల్ ఏకంగా ఎఫ్15 విమానాలు వేసుకుని ఆ దేశ గగనతలంలోకి వెళ్లి.. బాంబుల వర్షం కురిపించింది! ఎందుకింత కసి అంటే.. ‘చంపడం అంటే ఏదో చంపామన్నట్టు ఉండకూడదు. శత్రువు వెన్నులో వణుకు పుట్టాలి. తమ భుజం వెనుక నుంచి మొసాద్ అనుక్షణం తమను గమనిస్తోందన్న భయం, వదిలిపెట్టదన్న భయం వారిలో ఉండాలి. అందుకే ఇలా..’ అని మొసాద్ మాజీ చీఫ్ ఒకరు చెప్పారు! అదీ సంగతి!!
- సెంట్రల్ డెస్క్
Updated Date - Sep 30 , 2024 | 09:53 AM