కొరియా రచయిత్రి హాన్‌కాంగ్‌కు సాహిత్య నోబెల్
ABN, Publish Date - Oct 11 , 2024 | 05:09 AM
ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య నోబెల్ పురస్కారం దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ రచయిత్రి హాన్ కాంగ్(53)ను వరించింది. విశేష సాహిత్య కృషికిగాను 2024 సంవత్సరానికి హాన్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది.
చారిత్రక విషాదాలతో తలపడ్డ కలం
మానవ దుర్భలత్వాన్ని చిత్రీకరించారు
గద్య కవిత్వ శైలిలో ప్రయోగవాద
రచనలు.. నోబెల్ కమిటీ ప్రశంసలు
హాన్‌కాంగ్‌కు గతంలోనే బుకర్‌ప్రైజ్
స్టాక్‌హోం, అక్టోబరు 10 : ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య నోబెల్ పురస్కారం దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ రచయిత్రి హాన్ కాంగ్(53)ను వరించింది. విశేష సాహిత్య కృషికిగాను 2024 సంవత్సరానికి హాన్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. ద వెజిటేరియన్ నవలకుగాను హాన్‌కాంగ్ 2016లో బుకర్ ప్రైజ్‌ను అందుకున్నారు. ‘‘గద్య కవిత్వ శైలిలో సాగే లోతయిన ఆమె రచనలు చారిత్రక విషాదాలతో తలపడుతుంది. మానవ జీవితంలోని దుర్భలత్వాన్ని వ్యక్తపరుస్తుంది’’ అని అవార్డు కమిటీ పేర్కొంది. హాన్‌కాంగ్ దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూ ప్రాంతంలో 1970లో సాహిత్య నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించారు.
ఆమె తండ్రి ప్రముఖ నవలాకారుడు. ‘సియోల్‌లో శీతాకాలం’ పేరిట ఆమె రాసిన ఐదు కవితలు 1993లో స్థానిక పత్రికలో అచ్చయ్యాయి. అచ్చులో ఆమె సృజన కనిపించడం ఇదే మొదటిసారి. అయితే, హాన్‌కాంగ్ రచనా జీవితం నవలాకారిణిగా ప్రారంభమైంది. ‘రెడ్ యాంకర్’ నవల 1994లో ఆమెకు అవార్డును తెచ్చిపెట్టింది. ‘సియోల్ షిన్‌మున్ స్ర్పింగ్’ సాహిత్య పోటీకి ఈ నవల ఎంపికయింది. ఆ మరుసటి ఏడాది ‘యియోసు’ పేరిట కథల సంపుటి వెలువరించారు. ముంజీ పబ్లికేషన్ కంపెనీ దీనిని ప్రచురించింది. ఆమె తన రచనను మెరుగుపరుచుకునేందుకు ఆర్ట్స్ కౌన్సిల్ కొరియా అనే సంస్థ సహకరించింది. ఈ సంస్థ అందించిన ప్రోత్సాహంతో యూనివర్సిటీ ఆఫ్ లోవా ఇంటర్నేషనల్ రైటింగ్ ప్రోగ్రామ్‌లో హాన్‌కాంగ్ 1998లో మూడు నెలల శిక్షణ పొందారు. ఆమెలోని సృజనను ఈ శిక్షణ మెరుగుపరిచింది.
ఆ తర్వాత హాన్‌కాంగ్ వెనుదిరిగి చూడలేదు. ఫ్రూట్స్ ఆఫ్ మై వుమన్, ఫైర్ సాలమండేర్ అనే కథల సంపుటులు, నల్ల జింక, యువర్ కోల్డ్ హ్యాండ్స్, బ్రీత్ ఫైటింగ్, గ్రీన్ లెసన్స్, హ్యూమన్ యాక్ట్స్, ద వైట్ బుక్ అనే నవలలు; ఐ పుట్ ద ఈవెనింగ్ ఇన్ ద డ్రాయర్ అనే కవితా సంపుటి వెలువరించారు. హాన్‌కాంగ్ నవల ‘ఐ డు నాట్ బిడ్ ఫేర్‌వెల్’.. 2023లో ఫ్రాన్స్‌కు చెందిన మెడికిస్ అవార్డును, 2024లో ఎమిలీ గీమెట్ అవార్డును అందుకుంది.
‘‘స్థానియ (బౌద్ధం తదితర తూర్పు, దక్షిణాసియా ప్రాచీన తత్వం) తాత్వికతతో ఆమె రచనలు అనుసంధానమై...మానవ జీవితంలోని మానసిక, శారీరక వేదకలను పట్టి ఇస్తాయి’’ అని నోబెల్ కమిటీ ప్రశంసించింది. దేహాత్మల మధ్య, జీవన,మృత్యువుల మధ్య ఉన్న సంబంధం పట్ల గొప్ప ఎరుక కలిగిన రచయిత్రిగా ఆమెను కమిటీ అభివర్ణించింది. ప్రయోగశీలత కలిగిన తన కావ్యశైలి కారణంగా సమకాలీన గద్యసాహిత్యంలో గొప్ప ఆవిష్కర్తగా హాన్‌కాంగ్ నిలిచారని కమిటీ కొనియాడింది. కాగా, సాహిత్య నోబెల్ పురస్కారం కింద హాన్‌కాంగ్‌కు రూ. 9.23 కోట్ల నగదును నోబెల్ కమిటీ ప్రదానం చేయనుంది.
Updated Date - Oct 11 , 2024 | 05:09 AM