ప్రపంచ యుద్ధం ముప్పు?
ABN, Publish Date - Nov 20 , 2024 | 05:09 AM
ఉక్రెయిన్, రష్యా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. యుద్ధం మొదలై వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఉక్రెయిన్ మంగళవారం రష్యా మీద క్షిపణి దాడికి దిగింది.
రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణి దాడులు
అమెరికా పంపిన అటాకమ్స్ మిస్సైళ్ల ప్రయోగం
రష్యా భూభాగంలో దాడికి బైడెన్ అనుమతి
రష్యా మీద గగనతల దాడిచేస్తే అణుయుద్ధమే
ఉక్రెయిన్ దాడి చేసినా నాటో దాడిగా పరిగణిస్తాం
కొత్త అణ్వాయుధ విధానం ప్రకటించిన పుతిన్
లెక్క చేయకుండా అదేరోజు దాడికి దిగిన ఉక్రెయిన్
ప్రపంచ యుద్ధం వస్తుందని నాటో దేశాల వణుకు
న్యూఢిల్లీ, నవంబరు 19: ఉక్రెయిన్, రష్యా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. యుద్ధం మొదలై వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఉక్రెయిన్ మంగళవారం రష్యా మీద క్షిపణి దాడికి దిగింది. అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను(అటాకమ్స్)ను రష్యా భూభాగం మీదకు ప్రయోగించింది. 300 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాన్ని ఛేదించగల మొత్తం ఆరు క్షిపణులను ప్రయోగించగా, ఐదింటిని రష్యా మధ్యలోనే అడ్డుకొని కూల్చేసింది. ఆరో క్షిపణిని కూడా మధ్యలోనే పేల్చేసినప్పుటికీ శకలాలు సైనిక శిబిరం మీద పడ్డాయని, అగ్నిప్రమాదం తప్ప ప్రాణనష్టమేమీ జరగలేదని రష్యా ప్రకటించింది. సరిహద్దుకు 115 కిలోమీటర్ల ఆవల ఉన్న రష్యా ఆయుధ డిపోను పేల్చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. రెండు నెలల్లో పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌లో మోహరించిన అటాకమ్స్‌ను రష్యా భూభాగం మీద ప్రయోగించేందుకు అనుమతి ఇస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆదివారమే విషయం బయటకు వచ్చింది. ఇప్పటిదాకా అటాకమ్స్‌ను ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న రష్యా సైనికుల మీద ప్రయోగించడానికి మాత్రమే అమెరికా అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా రష్యా భూభాగం మీద కూడా క్షిపణి దాడి చేయడానికి బైడెన్ అనుమతించారు. బైడెన్ చర్య మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తనయుడు జూనియర్ ట్రంప్ కూడా ఇది మూడో ప్రపంచ యుద్ధాన్ని తీసుకొచ్చే చర్యేనని మండిపడ్డారు. రెండు నెలల్లో దిగిపోతున్న అమెరికా దేశాధ్యక్షుడు ప్రపంచ భద్రతనే ప్రమాదంలోకి నెట్టారని హంగరీ విదేశాంగమంత్రి ధ్వజమెత్తారు. బైడెన్ నిర్ణయం ఆదివారమే వెలువడినప్పటికీ రష్యా మంగళవారం స్పందించింది.
ఉక్రెయిన్ యుద్ధం మొదలై వెయ్యి రోజులు పూర్తి అయిన సందర్భంగా తన అణ్వాయుధ ప్రయోగ విధానాన్ని సమీక్షిస్తూ కొత్త విధానాన్ని ప్రకటించింది. తన మీద విమానాలు, క్షిపణులు, డ్రోన్లు వేటితో గగనతల దాడులు చేసినా తన సార్వభౌమాధికారాన్ని సవాలు చేసినట్లుగానే భావిస్తామని చెప్పింది. కొత్త విధానం ప్రకారం అణ్వాయుధ శక్తి లేని (ఉక్రెయిన్ లాంటి) దేశం ఏదైనా అణ్వాయుధ సంపత్తి ఉన్న (అమెరికా లాంటి) దేశం సాయంతో దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా మీద ప్రయోగిస్తే దాన్ని రెండు దేశాలు కలిసి(ఉక్రెయిన్-అమెరికా) చేసిన దాడిగా పరిగణించాలని నిర్ణయించారు. ఉక్రెయిన్ రష్యా మీద కాని, దాని మిత్రదేశం బెలారస్ మీద కాని అణ్వాయుధాలతో కానీ సంప్రదాయ ఆయుధాలతో కానీ దీర్ఘ శ్రేణి క్షిపణలను ప్రయోగిస్తే రష్యా సార్వభౌమాధికారం మీద జరిగిన దాడిగా పరిగణిస్తారు. అప్పుడు అణ్వాయుధ ప్రయోగానికి సంబంధించి అన్ని అవకాశాలను పరిశీలించే అధికారం రష్యాకు ఉందని అందులో పేర్కొన్నారు. ఏదైనా కూటమిలో ఒక దేశం దాడి చేసినా మొత్తం కూటమి దాడి చేసినట్లుగా పరిగణిస్తామని చెప్పారు. అంటే, అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్ దాడి చేస్తే మొత్తం నాటో కూటమి యుద్ధం భయాన్ని చవిచూడాలన్న మాట. రష్యా ఇంతటి భీకర ప్రకటన చేసినప్పటికీ ఉక్రెయిన్ లెక్క చేయలేదు. అమెరికా ఇచ్చిన అనుమతితో రష్యా భూభాగం మీదకు క్షిపణులను ప్రయోగించింది. రష్యా కొత్త అణు విధానాన్ని ప్రకటించిన రోజే దాన్ని ఉక్రెయిన్ సవాలు చేయడం గమనార్హం.
పౌరులకు నాటో దేశాల హెచ్చరికలు
బైడెన్ అనుమతి, రష్యా హెచ్చరికల నేపథ్యంలో నాటోలో భాగంగా ఉన్న నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల్లో యుద్ధ భయాలు మొదలయ్యాయి. యుద్ధం తలెత్తితే ఏం చేయాలనే విషయమై తమ పౌరులను అప్రమత్తం చేయడం మొదలు పెట్టాయి. కొన్ని దేశాలు నివాస ప్రాంతాల్లో కరపత్రాలు చల్లుతుండగా, కొన్ని దేశాలు పౌరులకు నేరుగా ఈమెయిల్స్ పంపుతున్నాయి.మొత్తం జనాభా కోసం ఎప్పుడో భూగర్బ షెల్టర్లు నిర్మించిన స్వీడన్ మూడు రోజులకు సరిపడా రేషన్‌తో చెప్పినప్పుడు షెల్టర్లలో పోవడానికి సిద్ధంగా ఉండాలని పౌరులకు సమాచారం ఇచ్చింది.
Updated Date - Nov 20 , 2024 | 05:09 AM