ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సామాన్యులే సమిధలు..

ABN, Publish Date - Oct 07 , 2024 | 04:43 AM

ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి నేటికి సరిగ్గా ఏడాది! పగబట్టిన పాములా.. హమాస్‌ నిర్మూలించడమే లక్ష్యంగా.. సంవత్సర కాలంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సేనలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది!!

  • ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి నేటితో ఏడాది

  • ఇంకా 97 మంది బందీలు హమాస్‌ చెరలోనే

  • యుద్ధంలో దాదాపు 42 వేల మంది మృతి

ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి నేటికి సరిగ్గా ఏడాది! పగబట్టిన పాములా.. హమా్‌సను నిర్మూలించడమే లక్ష్యంగా.. సంవత్సర కాలంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సేనలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది!! హమా్‌సకు అండగా నిలిచిన హిజ్బుల్లా, హౌతీ తదితర ఉగ్రమూకలకూ ఊపిరిసలపని రీతిలో పోరాటాన్ని కొనసాగిస్తోంది! ఏడాది కాలంగా ఆరని చిచ్చులా కొనసాగుతున్న ఈ యుద్ధానికి కారణాలేంటంటే.. ఎవరి వాదన వారిది! ఎవరి వాదన ఎలా ఉన్నా.. దున్నల పోరులో దూడలు నలిగిపోయినట్టు.. యుద్ధంలో అంతిమంగా ఓడిపోయేది, అత్యధికంగా చచ్చిపోయేది.. అభం శుభం తెలియని సామాన్య ప్రజలే! మరీ ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ప్రధాన బాధితులు! ఈ యుద్ధంలోనూ అదే జరుగుతోంది. సరిగ్గా ఏడాది క్రితం 2023, అక్టోబరు 7న.. ‘సింహత్‌ తోరా’ సెలవు దినాన్ని ఆనందంగా గడపడానికి ఇజ్రాయెలీలందరూ సిద్ధమై ఉండగా హమాస్‌ మిలిటెంట్లు ఆ దేశంపై 4300కుపైగా రాకెట్ల వర్షం కురిపించారు!!

కొంతమంది మిలిటెంట్లు వాహనాల్లో భూమార్గాన.. మరికొందరు పారా గ్లైడర్ల సాయంతో గగనతలం గుండా.. సరిహద్దు దాటి ఇజ్రాయెల్‌లోకి చొరబడి దొరికినవారిని దొరికినట్టు చంపేసి ఊచకోత కోశారు! దాదాపు 7000 మంది మిలిటెంట్లు 119 చోట్ల సరిహద్దులను దాటి విధ్వంస కాండ కొనసాగించారు. వారి దాడుల్లో 1139 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 38 మంది చిన్నారులు సహా 695 మంది ఇజ్రాయెల్‌ పౌరులు, 71 మంది విదేశీయులు, 373 మంది ఇజ్రాయెల్‌ భద్రతా సిబ్బంది ఉన్నారు. చనిపోయినవారిలో ఎక్కువ మంది (364 మంది) సరిహద్దులకు సమీపంలో జరిగిని నోరా ఫెస్టివల్‌కు హాజరైనవారే! అలా యుద్ధం మొదలుపెట్టిన హమాస్‌ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్‌ వద్ద బందీలుగా ఉన్న పాలస్తీనియన్లను విడిపించుకోవడానికి 30 మంది చిన్నారులు సహా 251 మందిని తమతోపాటు బందీలుగా గాజా స్ట్రిప్‌కు తీసుకెళ్లిపోయారు.


దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌ ఏడాదికాలంగా చేస్తున్న యుద్ధంలో.. కురిపించిన బాంబుల వర్షంలో.. ఆదివారం (2024, అక్టోబరు 6) నాటికి 41,825 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు! వారిలో 16 వేల మంది చిన్నారులు, 6 వేల మందికి పైగా మహిళలు ఉన్నారు. 19 వేల మంది పిల్లలు అనాథలయ్యారు. 1000 మందికిపైగా పిల్లలు దివ్యాంగులయ్యారు. గాజాస్ట్రి్‌పలో ఉంటున్న ప్రజల్లో 90 శాతం మంది నిరాశ్రయులయ్యారు! తినడానికి తిండి లేక.. కట్టుకోవడానికి బట్ట లేక.. ప్రాణాలు అరచేతపట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్యసమితి, స్వచ్ఛందసంస్థల దాతృత్వంపై ఆధారపడి జీవిస్తున్నారు.

ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉద్విగ్నభరిత, భయానక వాతావరణంలో ఉండే గాజా స్ట్రిప్‌లో ఇప్పుడు ఎటు చూసినా భారీ భవనాల శిథిలాలే! ఏ క్షణాన ఎటు నుంచి మృత్యువు వచ్చి పడుతుందో తెలియని మహాశ్మశానం అది!! అక్కడే.. ఆ భవనాల్లోనే.. ఏదో ఒక మూలన ఉన్న గదిలోంచి తవ్వుకున్న నేలమాళిగలు, సొరంగమార్గాల్లో తలదాచుకున్న హమాస్‌ మిలిటెంట్లలో దాదాపు 60 శాతం మందిని ఏరిపారేశామని ఇజ్రాయెల్‌ సేనలు సగర్వంగా ప్రకటించుకున్నాయి.


  • బహు ముఖ యుద్ధం...

హమాస్‌ కిరాతకదాడితో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పుడు తాము ఏడుగురు శత్రువులతో పోరాడుతున్నామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం అన్నారు! ఆ ఏడుగురు శత్రువులూ.. గాజాలో హమాస్‌, లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లో హౌతీలు, వెస్ట్‌బ్యాంక్‌లో ఉగ్రవాదులు, ఇరాన్‌, ఇరాక్‌, సిరియాలకు చెందిన షియా మిలిటెంట్లని ఆయన పేర్కొన్నారు. కిందటివారమే ఇరాన్‌ తమపై 200కు పైగా బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన విషయాన్ని గుర్తుచేశారు. వీరిలో హమా్‌సపై ఏడాదికాలంగా ఇజ్రాయెల్‌ సేనలు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో గాజా స్ట్రిప్‌లో ఎందరో సామాన్యపౌరులు ప్రాణాలు కోల్పోతున్నా వారు వెనక్కి తగ్గట్లేదు. ఇక, హమాస్‌ తర్వాత ఐడీఎఫ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నది హిజ్బుల్లాపై. లెబనాన్‌కు చెందిన ఈ మిలిటెంట్‌ గ్రూపు నేతల పేజర్లను ఏకకాలంలో పేల్చేయడం ద్వారా ఇజ్రాయెల్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అంతటితో ఆగక.. హిజ్బుల్లా అగ్రనాయకత్వంపైనా దృష్టి పెట్టి తొలుత ఆ సంస్థ చీఫ్‌ నస్రల్లాను, అతడి తర్వాత పగ్గాలు చేపట్టిన మరో నేతను కూడా మట్టుబెట్టి ఇజ్రాయెల్‌ సంచలనం సృష్టించింది.


ఇక.. దక్షిణ దిక్కున యెమెన్‌ నుంచి డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతున్న హౌతీలనూ ఇజ్రాయెల్‌ వదిలిపెట్టట్లేదు. ఇరాక్‌, సిరియాల నుంచి దాడులు చేస్తున్న షియా మిలీషియా బేస్‌లను ధ్వంసం చేస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతంలో ఇరాన్‌ అండతో చెలరేగుతున్న పాలస్తీనా ఉగ్రవాదులపైనా దాడులు చేస్తోంది. నేరుగా తమపై దాడికి దిగిన ఇరాన్‌ను దీటుగా ఎదుర్కొంది. ఆ దేశం ప్రయోగించిన ఖండాంతర క్షిపణులను సైతం తన యారో-3 రక్షణ వ్యవస్థతో కుప్పకూల్చింది.

- సెంట్రల్‌ డెస్క్‌


  • 60% గాజా ధ్వంసం

ఏడాదికాలంగా ఇజ్రాయెల్‌ జరుపుతున్న గగనతల దాడుల కారణంగా గాజా స్ట్రిప్‌లో 60% మేర ధ్వంసమైపోయినట్టు శాటిలైట్‌ డేటా ఆధారంగా తెలుస్తోంది. అలాగే.. 90% దాకా ప్రజలు నిరాశ్రయులై గాజాలో ఒక మూలకు పరిమితమయ్యారు. స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్తు, వైద్య సౌకర్యాలకు దూరమయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2,27,591 గృహాలు ధ్వంసమయ్యాయని.. 68% రోడ్లు నాశనమయ్యాయని యూఎన్‌ శాటిలైట్‌ సెంటర్‌ విశ్లేషించింది. గాజా స్ట్రిప్‌లోని 36 ఆస్పత్రుల్లో ప్రస్తుతం 17 మాత్రమే.. అదీ పాక్షికంగా పనిచేస్తున్నాయి.


  • బందీలెక్కడ?

ఏడాది క్రితం హమాస్‌ చెరబట్టిన 251 మంది బందీల్లో.. ఇప్పటిదాకా 117 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో 108 మందిని.. ఇజ్రాయెల్‌ జైళ్లల్లో ఉన్న 240 మంది పాలస్తీనావాసుల విడుదలకు బదులుగా హమాస్‌ మిలిటెంట్లే ఆరు దశలుగా విడిచిపెట్టారు. తొమ్మిది మంది ఐడీఎఫ్‌ రెస్క్యూ ఆపరేషన్లలో బయటపడ్డారు. మరో 37 మంది చనిపోయారు. ఇంకా 97 మంది హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. వారిలోనూ 64 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నట్టు.. 33 మంది చనిపోయినట్టు సమాచారం. అయితే.. ఇజ్రాయెల్‌ మాత్రం బందీల సంఖ్య 101 అని (నిరుడు హమాస్‌ చేతికి చిక్కిన 97 మందితోపాటు, గతంలో బందీలైన మరో నలుగుర్ని కూడా కలిపి) ప్రకటిస్తోంది. అయితే, ఆ నలుగురిలోనూ ఇద్దరు చనిపోయినట్టు సమాచారం. అంటే.. మొత్తం 35 మంది మృతదేహాలు ఇంకా హమాస్‌ వద్దనే ఉన్నట్టు.

Updated Date - Oct 07 , 2024 | 04:43 AM