డిసెంబరు 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం
ABN, Publish Date - Dec 08 , 2024 | 04:51 AM
ప్రతి ఏటా డిసెంబరు 21వ తేదీని ‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’గా జరపాలని భారత్ సహా పలు దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) ఏకగ్రీవంగా ఆమోదించింది.
తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవ ఆమోదం
ఐక్యరాజ్యసమితి, డిసెంబరు 7: ప్రతి ఏటా డిసెంబరు 21వ తేదీని ‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’గా జరపాలని భారత్ సహా పలు దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయాన్ని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘సమగ్ర శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు! డిసెంబరు 21వ తేదీని ప్రపంచ ఽధ్యాన దినోత్సవంగా జరపాలని భారత్ సహా పలు ఇతర దేశాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఐరాస జనరల్ అసెంబ్లీ ఈ రోజు(శుక్రవారం) ఆమోదించింది’’ అని పేర్కొన్నారు. వసుదైక కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సూత్రాన్ని బలంగా విశ్వసించే భారత్.. ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం కృషి చేస్తోందని అన్నారు. డిసెంబరు 21వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని, భారత సంప్రదాయం ప్రకారం శీతాకాలం అయనం అంటే ఉత్తరాయనంలోకి అడుగుపెట్టే రోజని, ఇది చాలా పవిత్రమైన రోజని తెలిపారు. ఇది సరిగ్గా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే జూన్ 21వ తేదీ (వేసవి అయనం)కి ఆరు నెలల తర్వాత వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా యోగాపై గతంలో భారత్ చేసిన ప్రతిపాదనను హరీశ్ గుర్తుచేసుకున్నారు. 2014లోనూ ప్రతి ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించే విషయంలో భారత్ నాయకత్వం తీసుకుందని పేర్కొన్నారు.
ఈ దశాబ్ద కాలంలో యోగా విశ్వవ్యాప్తం అయిందని, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యోగాను పాటిస్తూ, తమ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారని అన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవంపై లిచ్‌టెన్‌స్టీన్ అనే దేశం యూఎన్‌జీఏలో తీర్మానం తీసుకొచ్చింది. 193 దేశాలు గల యూఎన్‌జీఏలో ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు కృషి చేసిన దేశాల గ్రూపులో భారత్ సహా శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండోర్రా ఉన్నాయి. తీర్మానానికి ఇంకా బంగ్లాదేశ్, బల్గేరియా, బురుండి, ది డొమినికన్ రిపబ్లిక్, ఐస్‌లాండ్, లక్సెంబర్గ్, మారిషష్, మొనాకో, మంగోలియా, పోర్చుగల్, స్లొవేనియా కో-స్పాన్సర్ చేశాయి. కాగా, అంతర్జాతీయ ఽధ్యాన దినోత్సవంపై ఐరాసలోని భారత శాశ్వత మిషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. తీర్మానాన్ని ఆమోదింపచేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషించిందని పేర్కొంది.
ప్రపంచంలోని పలు ప్రాంతాలు ఘర్షణలు, ఉద్రిక్తతలతో మండుతున్న వేళ ఈ నిర్ణయం రావడంపై ఆనందం వ్యక్తం చేసింది. ఽఽధ్యానం అనేది పురాతన పద్ధతుల నుంచే ఉందని, ఇది అంతర్గత పరివర్తన, నేటి ఆఽధునిక కాలంలో శాంతి స్థాపనకు సమర్థవంతంగా పనిచేస్తుందని అభిప్రాయపడింది. ధ్యానం మానసిక, భావోద్వేగ, శారీరక, ఆధ్యాత్మిక అంశాలతో సహా ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు ఉద్దేశించిందని పేర్కొంది. ఇది నేటి ఉరుకుల పరుగుల, ఒత్తిడితో కూడిన జీవితంలో ఉపశమనం కలిగిస్తుందని తెలిపింది. దీనితో చాలా లాభాలు ఉన్నాయని, మన జీవితాలపై ప్రభావం చూపుతుందనే దాన్ని ఆధునిక శాస్త్రం కూడా ధ్రువీకరిస్తోందని పేర్కొంది. ప్రతి రోజూ ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుందని, మానసిక, శారీరక సంబంధిత కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైందని భారత మిషన్ పేర్కొంది.
Updated Date - Dec 08 , 2024 | 04:51 AM