America: డ్రైవ్ మోడ్‌కు బదులు రివర్స్ మోడ్
ABN, Publish Date - Mar 11 , 2024 | 08:57 AM
కారు మోడ్‌ను పొరపాటున మార్చడంతో అమెరికాలో ఓ సంపన్న కుటుంబానికి చెందిన మహిళ, ప్రముఖ కంపెనీ సీఈవో మృతి చెందారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏంజెలా చావో కాలువలోకి దూసుకెళ్లిన టెస్లా కారు
అమెరికాలో ఓ కంపెనీ సీఈవో మృతి
టెక్సాస్, మార్చి 10: కారు మోడ్‌ను పొరపాటున మార్చడంతో అమెరికాలో ఓ సంపన్న కుటుంబానికి చెందిన మహిళ, ప్రముఖ కంపెనీ సీఈవో మృతి చెందారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ షిప్పింగ్ కంపెనీకి సీఈవోగా ఉన్న ఏంజెలా చావో (50) చైనా కొత్త ఏడాది వేడుకలు జరుపుకునేందుకే స్నేహితులతో కలిసి ఫిబ్రవరి 10న టాక్సాస్ ఆస్టిన్ సమీపంలోని తన ప్రైవేటు అతిథి గృహానికి వెళ్లారు. వేడుకల అనంతరం తిరిగి వస్తూ రోడ్డుపై త్రిపాయింట్ టర్న్ తీసుకుంటున్న సమయంలో ఆమె తన టెస్లా కారును డ్రైవ్ మోడ్‌లో వేయబోయి పొరపాటున రివర్స్ మోడ్‌లో వేశారు. దాంతో కారు ఒక్కసారిగా వెనక్కు వెళ్లి అక్కడున్న కొలనులో పడిపోయింది.
ఏంజెలాతో పాటు వచ్చిన స్నేహితులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్య పడకపోవడంతో వారు వెంటనే సహాయక బృందానికి ఫోన్ చేశారు. కాసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న సహాయక బృంద సభ్యులు నీటిలో దిగి కారు అద్దాలను పగులగొట్టి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అవి ధృడంగా ఉండడంతో సాధ్య పడలేదు. కాసేపటికి ట్రాలీ సహాయంతో కారును బయటకు తీసి డోర్లను బలవంతంగా పగులగొట్టి చూడగా అప్పటికే ఏంజెలా చనిపోయారు. అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ జిమ్ బ్రెయార్‌కు ఏంజెలా చావో భార్య.
Updated Date - Mar 11 , 2024 | 08:57 AM