హమాస్ చీఫ్ సిన్వర్ హతం?
ABN, Publish Date - Sep 24 , 2024 | 03:16 AM
ఇజ్రాయెల్‌పై గత ఏడాది అక్టోబరు 7న జరిగిన దాడుల రూపకర్త, ఉగ్ర సంస్థ హమాస్ అధిపతి యాహ్యా సిన్వర్ చనిపోయినట్లుగా తెలుస్తోంది.
టెల్ అవీవ్, సెప్టెంబరు 23: ఇజ్రాయెల్‌పై గత ఏడాది అక్టోబరు 7న జరిగిన దాడుల రూపకర్త, ఉగ్ర సంస్థ హమాస్ అధిపతి యాహ్యా సిన్వర్ చనిపోయినట్లుగా తెలుస్తోంది. అతడి నుంచి కొంతకాలంగా ఎలాంటి కదలికలు లేకపోవడమే దీనిని నిదర్శంగా భావిస్తున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా కథనాలు ప్రచురించింది. అయితే, ఇవేమీ నిర్ధారణ కాలేదు. ఇజ్రాయెల్ దళాలు హమా్‌సకు పెట్టని కోట లాంటి సొరంగాలపై కొన్ని రోజుల కిందట విస్తృత దాడులు చేశాయి. వీటిలోనే యాహ్యా మృతి చెంది ఉంటాడని చెబుతున్నారు. గత నెలలో హమాస్ రాజకీయ విభాగాధిపతి ఇస్మాయిల్ హనియా హతమయ్యాడు. ఇరాన్‌లో జరిగిన ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ ఉందని కథనాలు వచ్చాయి. కాగా, యాహ్యా మృతి అంటూ వస్తున్న కథనాలు హమాస్ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ఆడుతున్న మైండ్ గేమ్‌లో భాగం అనే కథనాలూ వస్తున్నాయి.
పేజర్ పేలుడుతోనే రైసీ దుర్మరణం?
ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మే నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం వెనుక ‘పేజర్ పేలుడు’ కారణమై ఉండొచ్చని పార్లమెంటు సభ్యుడు అహ్మద్ అర్దెస్తానీ వ్యాఖ్యానించారు. రైసీ పేజర్ వాడేవారని ఆయన పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని కోరారు. కాగా, తాము మద్దతు ఇచ్చే ఉగ్ర సంస్థ హిజ్బుల్లాకు పేజర్ల కొనుగోలులో ఇరాన్ సాయం చేసింది. గత వారం లెబనాన్‌లో వేలాది పేజర్లు పేలి హిజ్బుల్లా మద్దతుదారులు భారీగా మృతి చెందిన సంగతి తెలిసిందే.
Updated Date - Sep 24 , 2024 | 03:17 AM