New Jersey: ప్రాణాలు తీసిన బలవంతపు ఎక్సర్‌సైజ్
ABN, Publish Date - May 03 , 2024 | 05:18 AM
మరీ లావుగా ఉన్నాడన్న కారణంతో ఓ తండ్రి చేయించిన బలవంతపు ఎక్సర్‌సైజ్ ఆరేళ్ల బాలుని ప్రాణాలు తీసింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది.
ఆరేళ్ల కుమారునితో ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తించిన తండ్రి
తీవ్ర అనారోగ్యంతో బాలుని మృతి.. అమెరికాలో ఘటన
కోర్టులో సాక్ష్యంగా సీసీటీవీ ఫుటేజీ
న్యూజెర్సీ, మే2: మరీ లావుగా ఉన్నాడన్న కారణంతో ఓ తండ్రి చేయించిన బలవంతపు ఎక్సర్‌సైజ్ ఆరేళ్ల బాలుని ప్రాణాలు తీసింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది. కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫిట్‌నెస్ సెంటర్‌లోని సీసీటీవీ కెమేరాల ఫుటేజీ కలవరపరిచింది. న్యూజెర్సీకి చెందిన క్రిస్టోఫర్ గ్రెగర్ (31)కు తన కుమారుడు కోరీ మిస్సియాలో (6) మరీ లావుగా ఉన్నాడన్న భావన ఉండేది. అట్లాంటిక్ హైట్స్ క్లబ్ హౌస్‌లోని ఫిట్‌నెస్ సెంటర్‌కు తీసుకువెళ్లి ఎక్సర్‌సైజ్‌లు చేయించేవాడు. 2021 మార్చి 20న ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తే ఎక్సర్‌సైజ్ చేయించాడు. ఆ రోజున ట్రెడ్ మిల్‌ను హైస్పీడ్‌లో నడిపాడు.
పరుగెత్తలేక కోరీ పలుమార్లు పడిపోయినా ఊరుకోలేదు. అప్పటి నుంచి ఆరోగ్యం బాగులేకపోవడంతో తల్లి బ్రె మిస్సియాలో ఏప్రిల్ ఒకటో తేదీన ఆస్పత్రికి తీసుకెళ్లింది. శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం, నత్తిగా మాట్లాడడం, వాంతులు వంటి సమస్యలు తలెత్తాయి. తన తండ్రి బలవంతంగా ట్రెడ్ మిల్‌పై పరుగెత్తేలా చేశాడని ఆస్పత్రిలో ఆ బాలుడు చెప్పాడు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ బాలుడ్ని కాపాడలేకపోయారు. మరుసటి రోజునే ప్రాణాలు విడిచాడు. బలవంతపు ఎక్సర్‌సైజు గుండె, కాలేయంపై ప్రభావం చూపినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దాంతో ఆ తండ్రిని 2022 మార్చి9న అరెస్టు చేశారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తించడం, ఆ బాలుడు పడిపోవడం వంటి దృశ్యాలు సీసీటీవీ కెమేరాల్లో నమోదయ్యాయి. వీటిని చూసిన తల్లి కన్నీరు పెట్టుకుంది. ఆరోపణలు రుజువయితే ఆ తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.
Updated Date - May 03 , 2024 | 05:18 AM