ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ పొత్తు ఖరారు
ABN, Publish Date - Feb 23 , 2024 | 04:54 AM
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ- కాంగ్రెస్ పొత్తు ఖరారైన మరునాడే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)- కాంగ్రెస్ పొత్తు కూడా ఖరారైంది.
4 చోట్ల ఆప్, మూడుచోట్ల కాంగ్రెస్ పోటీ
గుజరాత్, గోవా, హరియాణా, చండీగఢ్
సీట్ల పంపకాలు దాదాపు పూర్తి
అమేఠీ నుంచి రాహుల్‌గాంధీ పోటీ?
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ- కాంగ్రెస్ పొత్తు ఖరారైన మరునాడే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)- కాంగ్రెస్ పొత్తు కూడా ఖరారైంది. ఢిల్లీలో నాలుగు సీట్లలో ఆప్, మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే గుజరాత్, గోవా, చండీగఢ్, హరియాణాలలో సీట్ల పంపకాలపై కూడా కాంగ్రెస్- ఆప్ మధ్య అవగాహన ఏర్పడింది. గుజరాత్‌లో రెండు చోట్ల ఆప్, చండీగఢ్‌లోని ఏకైక స్థానానికి కాంగ్రెస్, గోవాలోని రెండు సీట్లలో చెరోచోట పోటీకి అవకాశాలున్నాయని ఇరు పార్టీల వర్గాలు తెలిపాయి. అలాగే హరియాణాలో ఆప్‌కు ఒక సీటు కేటాయించనున్నట్లు తెలిసింది. ఇక మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘాఢీ కూటమితో చర్చలు అంతిమ దశలో ఉన్నాయని, ఏ ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీచేస్తుందో ఈ నెలాఖరు వరకు ప్రకటిస్తామని కాంగ్రెస్ మహారాష్ట్ర ఇన్‌చార్జి రమేశ్ చెన్నితాల ప్రకటించారు. కాగా, రాహుల్ గాంధీ గతంలో పోటీ చేసి ఓడిపోయిన యూపీలోని అమేథీ నుంచే మరోసారి పోటీ చేయనున్నారని, ప్రియాంక కూడా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Updated Date - Feb 23 , 2024 | 06:59 AM