Bihar: బిహార్‌లో భారీగా బ్యూరోక్రాట్ల బదిలీలు.. కొత్త ప్రభుత్వ ఊహాగానాల వేళ కీలక పరిణామం
ABN, Publish Date - Jan 27 , 2024 | 07:17 AM
ఓ వైపు బీజేపీ(BJP)తో బిహార్(Bihar) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ చేతులు కలుపుతారన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 79 మంది ఐపీఎస్, 45 మంది బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను బదిలీ చేశారు.
పట్నా: ఓ వైపు బీజేపీ(BJP)తో బిహార్(Bihar) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ చేతులు కలుపుతారన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 79 మంది ఐపీఎస్, 45 మంది బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను బదిలీ చేశారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్(ఆపరేషన్స్) ఐపీఎస్ సుశీల్ మాన్సింగ్ ఖోప్డేను ఎడీజీ (ప్రోహిబిషన్)గా నియమించారు.
ADG (ప్రోహిబిషన్)గా ఉన్న IPS అమృత్ రాజ్‌ని ADG (ఆపరేషన్స్) గా నియమించారు. ప్రస్తుతం జెహనాబాద్ పోలీస్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఐపీఎస్ దీపక్ రంజన్, బిహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బోద్‌గయా కమాండెంట్‌గా బదిలీ అయ్యారు. ఎస్పీ (అరారియా) అశోక్ కుమార్ సింగ్‌ను స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్, ససారమ్ కొత్త కమాండెంట్‌గా నియమించినట్లు నోటిఫికేషన్ జారీ అయింది.
భిన్నాభిప్రాయాలు
జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఆర్జేడీతో పొత్తును వదిలిపెట్టి బీజేపీతో మళ్లీ చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, ఆదివారం సీఎంగా ప్రమాణం చేస్తారని బిహార్‌లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తగినట్లుగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం నితీశ్ హాజరైనప్పటికీ, ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఆ పార్టీకే చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి, ఇతర నేతలు గైర్హాజరయ్యారు. దీనిపై సీఎంను విలేకర్లు ప్రశ్నించగా.. హాజరుకాని వారినే అడగండి అని ముక్తసరిగా బదులిచ్చారు. అయితే రాజ్‌భవన్ కార్యక్రమానికి ఆర్జేడీ తరఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి అలోక్ కుమార్ మెహతా హాజరయ్యారు.
కాగా, నితీశ్ తిరిగి బీజేపీతో చేతులు కలుపుతారా అన్న విలేకర్ల ప్రశ్నపై బీజేపీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ స్పందిస్తూ.. ‘రాజకీయాల్లో శాశ్వతంగా తలుపులు మూసుకుపోవటం అంటూ ఉండదు. సమయం వచ్చినప్పుడు తలుపులు తెర్చుకుంటాయి. తలుపులు తెరవాలా?వద్దా? అన్నది మా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది’ అని చెప్పారు. నితీశ్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపడతారని వార్తలు వెలువడ్డాయి. అయితే పలువురు బీజేపీ నేతలు నితీశ్‌తో తిరిగి చేతులు కలపటంపై విముఖతను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రజానీకంలో నితీశ్ ప్రతిష్ఠ గణనీయంగా పడిపోయిందని, ఆయనతో పొత్తు కుదుర్చుకుంటే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ నష్టపోతుందని, ఆర్జేడీ-కాంగ్రె్‌స-లెఫ్ట్ కూటమి స్వీప్ చేస్తుందని ఓ బీజేపీ నేత పేర్కొన్నారు. నితీశ్ ఈ సారి బీజేపీతో జత కడితే ఆయన పార్టీ మారడం ఇది నాలుగోసారి అవుతుంది.
బిహార్‌లో ఎవరికి ఎన్ని?
243 సీట్ల బిహార్ అసెంబ్లీలో కనీస మెజారిటీకి 122మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆర్జేడీకి 79, బీజేపీకి 78, జేడీయూకి 45, కాంగ్రె్‌సకు 19, వామపక్షాలకు 16, హెచ్‌ఏఎం(ఎ్‌స)కు నలుగురు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు ఒక్కరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు ఆర్జేడీతో కలిసి ఉన్నాయి. ఈ 3 పార్టీల బలం 114. అంటే మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. జేడీయూ-బీజేపీ చేతులు కలిపితే 123మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాయి.
Updated Date - Jan 27 , 2024 | 07:19 AM