Delhi: నేను అవినీతికి పాల్పడలేదు.. ఈడీ సమన్లపై కేజ్రీవాల్
ABN, Publish Date - Jan 04 , 2024 | 03:01 PM
ఈడీ సమన్లు పంపడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మరోసారి మండిపడ్డారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు.
ఢిల్లీ : ఈడీ సమన్లు పంపడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మరోసారి మండిపడ్డారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. "బీజేపీ కక్షరాజకీయాలకు ఈడీని వాడుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఆపాలని బీజేపీ చూస్తోంది. మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరగలేదన్నది నిజం. బీజేపీ నన్ను అరెస్ట్ చేయాలని చూస్తోంది.
నా పెద్ద ఆస్తి నిజాయతీ. దాన్ని తగ్గించాలని వారు అనుకుంటున్నారు. కానీ అలా ఎప్పటికీ చేయలేరు. నాకు పంపిన సమన్లు చట్ట విరుద్ధమని లాయర్లు నాకు చెప్పారు. విచారణ పేరుతో నన్ను ఇబ్బందిపెట్టి లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది" అని అన్నారు. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ ని ఈడీ ఇవాళ అరెస్టు చేస్తుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్న క్రమంలో కేజ్రీవాల్ ఈ కామెంట్లు చేశారు. ఇప్పటికే ఈడీ ఇచ్చిన 3 సమన్లను కేజ్రీ దాటవేశారు. ఇదిలావుండగా, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేజ్రీవాల్ శనివారం గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Updated Date - Jan 04 , 2024 | 03:01 PM